Jagan Regime: కరోనా సొమ్మూ పక్కదారి
ABN, Publish Date - Jul 28 , 2025 | 03:34 AM
జగన్ ప్రభుత్వం చేసిన పాపాలు రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి.
కేంద్రం ఇచ్చిన రూ.208 కోట్లను ఇతర పథకాలకు మళ్లించిన జగన్
రాష్ట్ర వాటా రూ.139 కోట్లు గాలికి.. రూపాయి కూడా కేటాయించని వైనం
తామిచ్చిన సొమ్ముపై కేంద్రం ఆరా
గ్రాంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం
208 కోట్లు వడ్డీతో తిరిగిచ్చేయాలని ఆరోగ్య శాఖకు కేంద్రం ఘాటు లేఖ
కొవిడ్ రోగుల వైద్యంపై వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం.. భారీగా మృతులు
మందులు సరఫరా చేసిన వారికీ బిల్లులు చెల్లించని జగన్ ప్రభుత్వం
ఇరకాటంలో పడ్డ ప్రస్తుత సర్కారు
అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వం చేసిన పాపాలు రాష్ట్రాన్ని ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక అవకతవకలు ప్రస్తుత ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ముఖ్యంగా కేంద్రం ఇచ్చిన నిధులను నిర్దేశిత పనులకు వెచ్చించకుండా ఇతర పథకాలకు మళ్లించడంతో ఆయా నిధులను తిరిగి వెనక్కి ఇచ్చేయాలంటూ కేంద్రం ఒత్తిడి చేస్తోంది. జగన్ జమానాలో జరిగిన తప్పులకు ప్రస్తుత ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కొవిడ్-19 నియంత్రణ కోసం నిధులు విడుదల చేసింది. కేంద్రం ఏ కార్యక్రమానికి నిధులిచ్చినా 60శాతమే ఇస్తుంది.
మిగిలిన 40శాతం నిధులను రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద కేటాయించి.. నిర్దేశిత కార్యక్రమాల కోసం ఖర్చు చేయాలి. కొవిడ్ రెండో దశలో కేంద్రం టెస్టింగ్ కిట్స్, రోగులకు అవసరమైన మందులు, ఇతర అవసరాల నిమిత్తం రూ.300కోట్లకుపైగా కేటాయిచింది. దీనిలో కేంద్ర వాటా రూ.208 కోట్లు. ఈ మొత్తాన్నీ 2022-23 సంవత్సరంలోనే విడుదల చేసింది. దీనికి మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్రప్రభుత్వం మరో రూ.139 కోట్ల ను కేటాయించాల్సి ఉంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వ వాటాను ఇవ్వడంలో అప్పటి జగన్ ప్రభుత్వం విఫలమైంది. కేంద్రం నుంచి నిధులు వస్తే కొవిడ్ అవసరాలకు ఖర్చు చేయడం, లేదంటే లేదు.. అన్నట్టుగా వ్యవహరించింది. కేంద్రం తన వాటా కింద నిధులు ఇచ్చినా.. రాష్ట్ర వాటా కింద నిధులు కేటాయించి కొవిడ్‌ను కంట్రోల్ చేద్దామన్న ఆలోచనే చేయలేదు. ఈ నిర్లక్ష్యమే రోగుల ప్రాణాలు పోయేలా చేసింది.
ఎందుకు ఇవ్వలేదు?
2022-23లో కేంద్రం ఇచ్చిన రూ.208 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడంతో కేంద్రం సీరియస్ అయింది. తాము కొవిడ్ కోసం నిధులిచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం ఏమిటని ప్రశ్నించింది. తమ నిధులకు వెంటనే మ్యాచింగ్ గ్రాంట్ విడుదల చేయాలని అల్టిమెటం జారీ చేసింది. లేదంటే రూ.208 కోట్లకు రెండేళ్ల పాటు వడ్డీతో సహా వెనక్కి ఇవ్వాలని ఘాటు లేఖ రాసింది. ఈ మేరకు గత శుక్రవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు కేంద్రం నుంచి లేఖ అందింది. కేంద్రం నుంచి వచ్చిన లేఖను చూసి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు షాకయ్యారు. తమ నిధులను వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని కోరుతూ రాష్ట్రానికి కేంద్రం లేఖ రాయడం ఇదే తొలిసారి. గత ప్రభుత్వ తప్పులకు ఇప్పుడు కూటమి సర్కారు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలావుంటే, కేంద్రం మ్యాచింగ్ గ్రాంట్ నిధులపై గతంలోనే రాష్ట్రానికి పలుమార్లు లేఖలు రాసింది. వాటికి రాష్ట్రం స్పందించలేదు. ఈ క్రమంలోనే కేంద్రం తమ నిధు లు వెనక్కిచ్చేయాలని హెచ్చరించింది.
నష్టపోయిన సరఫరా దారులు..
కొవిడ్ సమయంలో ప్రభుత్వానికి మందులు, సర్జికల్ ఐటమ్స్, టెస్టింగ్ కిట్స్ సరఫరా చేసిన సప్లయిర్స్ గుల్ల అయిపోయారు. కరోనా సమయంలో అప్పటి జగన్ ప్రభుత్వం ఇష్టారాజ్యంగా మందులు, కిట్స్, మాస్క్‌లు, పీపీఈ కిట్లు కొనుగోలుచేసింది. సప్లయిర్స్ కూడా కొవిడ్ సమయంలో కష్టమైనా ప్రభుత్వం అడిగిన మందులు, కిట్స్ సరఫరా చేశారు. గత ప్రభుత్వం కేం ద్రం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించుకోవడమే కాకుండా రూపాయి కూడా విడుదల చేయలేదు. ఇప్పటికే రెండేళ్లు గడుస్తున్నా చాలా మందికి బిల్లులు చెల్లించలేదు. దీంతో వారు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు.
Updated Date - Jul 28 , 2025 | 08:47 AM