AP Prisons Dept: కొందరిపైనే వివక్ష!
ABN, Publish Date - Feb 21 , 2025 | 04:34 AM
జైళ్ల శాఖలో ఒకే తప్పునకు సంబంధించి ఉన్నతాధికారుల హెచ్చరికలు ఎదుర్కొన్న వారిలో కొందరికే చార్జిమెమోలు జారీ చేయడం వివాదమవుతోంది.
ఒకే తప్పునకు ఇద్దరికి వార్నింగ్, బదిలీ, సస్పెన్షన్
మిగిలినవారికి హెచ్చరికతో సరిపెట్టిన అధికారులు
విశాఖ సెంట్రల్ జైల్లో ఖైదీ ఆత్మహత్య ఘటనపై రచ్చ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
యూనిఫాం సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగులు క్రమశిక్షణ తప్పితే ఆ శాఖ మాన్యువల్ లేదా విధివిధానాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారు. కానీ జైళ్ల శాఖలో ఒకే తప్పునకు సంబంధించి ఉన్నతాధికారుల హెచ్చరికలు ఎదుర్కొన్న వారిలో కొందరికే చార్జిమెమోలు జారీ చేయడం వివాదమవుతోంది. రాష్ట్ర జైళ్లశాఖలో ఘటనలు తరచూ వివాదాస్పదంగా మారుతున్నాయి. విశాఖలో గంజాయి కలకలం, సిబ్బంది ఆందోళన.. రాజమహేంద్రవరంలో ఖైదీపై అధికారి దాడి, గన్ ఫైరింగ్... నెల్లూరులో ఖైదీల బంధువులను డబ్బులు అడిగిన సూపరింటెండెంట్ ఆడియో.. కడప జైలు అధికారులపై పులివెందులలో కేసు నమోదు.. తదితర ఘటనలు జైళ్ల శాఖ పరువును రోడ్డున పడేశాయి. ఉన్నతస్థాయి అధికారుల గ్రూపు రాజకీయాలు, సిబ్బంది వర్గాలుగా విడిపోవడం, రెండేళ్లుగా జైళ్ల శాఖకు పూర్తిస్థాయి డీజీ లేకపోవడం దీనికి కారణాలుగా తెలుస్తోంది. తాజాగా ఒక ఖైదీ ఆత్మహత్య ఘటనలో అధికారుల చర్యలు అగ్నికి ఆజ్యం పోస్తున్నాయి. విశాఖపట్నం సెంట్రల్ జైలులో గతేడాది జూలై 30న ఉప్పాడ గౌరీశంకర్ అనే ఖైదీ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ చేసిన జైళ్లశాఖ ఉన్నతాధికారులు.. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ పలువురికి రాతపూర్వకంగా హెచ్చరికలు జారీ చేశారు. జైలు సూపరింటెండెంట్ ఎస్.కిశోర్‌కుమార్‌ను అనంతపురం, అడిషనల్ సూపరింటెండెంట్ ఎం.వెంకటేశ్వర్లును నెల్లూరు బదిలీ చేశారు. విశాఖలో ఉంటున్న తన కుటుంబాన్ని నెల్లూరు తీసుకొచ్చేందుకు అనుమతివ్వాలని వెంకటేశ్వర్లు కోరగా.. ‘వైజాగ్ వెళ్తే అక్కడ ట్యాంపరింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.. వెళ్లడానికి వీల్లేదు’ అంటూ ఆశ్చర్యకరమైన కారణం చూపి నిరాకరించారు. కంటి ఆపరేషన్‌కు విశాఖలో వైద్యులు సమయం ఇచ్చారని ఆ తేదీకి వెళ్లాలని కిశోర్‌కుమార్ విన్నవించుకుంటే తిరస్కరించారు.
అంతటితో ఆగకుండా ఆ ఇద్దరినీ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో వీరిద్దరూ 25 ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ 1998 నుంచి 2024 వరకూ పలు సందర్భాల్లో ఇచ్చిన మెమోలు చూపించి వారిపై వేటేశారు. అయితే ఇదే తరహా ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ గతంలో వార్నింగ్ ఇచ్చిన ఏడుగురి గురించి మాత్రం అధికారులు నోరెత్తడం లేదు. అందులో కొందరు విశాఖలోనే పని చేస్తున్నారు. వారెవరూ టాంపరింగ్‌కు పాల్పడరా.? అనే ప్రశ్న సిబ్బంది వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది.
వివాదాల అధికారి వల్లే..
జైళ్లలో ఖైదీలను చిత్రహింసలు పెట్టడం.. నోరెత్తిన సిబ్బందిపైవేటువేయడం లాంటి వివాదాల్లో తరచూ వినిపించే ఒక అధికారి పేరు ఈ వ్యవహారంలోనూ గట్టిగా వినిపిస్తోంది. కొందరిపై వివక్ష.. మరికొందరిపై ఆపేక్ష.. చూపిస్తూ ఆయన ఇచ్చిన తప్పుడు సిఫారసులతో ఉన్నతాధికారులు ఇలాంటి చర్యలకు పాల్పడటం అన్యాయమని సిబ్బంది అంటున్నారు. అధికారుల మెమోలు సూచనలేగాని, చర్య తీసుకునే స్థాయిలో ఉండవని అంటున్నారు. నచ్చినవారికి వత్తాసు పలకడం, నచ్చనివారిపై చర్యలు తీసుకోవడం సరికాదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Updated Date - Feb 21 , 2025 | 04:34 AM