AP Government Officials : కన్సల్టెంట్ల పెత్తనం!
ABN, Publish Date - Feb 19 , 2025 | 03:35 AM
ఇప్పుడు వీరిని కాదని... మరో కొత్త వర్గం మొదలైంది! వారే... కన్సల్టెంట్లు! ‘భగవంతునికీ - భక్తునికీ మధ్య’ అన్నట్లుగా... కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్ల మధ్య వీరు తయారయ్యారు! అయితే... వీరిది అనుసంధానం కాదు! అచ్చంగా అడ్డుగోడలా!
అన్ని శాఖల్లో కలిపి వంద మందికిపైగా కన్సల్టెంట్లు
ఉద్యోగులకు సమాంతరంగా ప్రైవేట్ వ్యవస్థ
‘వాళ్లే కావాలి’ అంటున్న కొందరు కార్యదర్శులు
రొటీన్ నివేదికలు, పనులకూ కన్సల్టెంట్లే
ఎస్‌వోలు, ఏఎ్‌సవోలు ఇచ్చే సమాచారానికి హైఫై ఇంగ్లీషు అద్దడమే వీరి పని
జగన్ హయాంలో వచ్చిన కన్సల్టెంట్ రాజ్
ఇప్పుడూ మారకపోగా.. మరింత అధికం!
అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నిధులతో చేపట్టే ప్రాజెక్టుల అమలుకు కన్సల్టెంట్ల నియామకం తప్పనిసరి. నిధుల వినియోగం, నివేదికల రూపకల్పనకు వీరిని నియమిస్తారు. ఒప్పందంలోనే దీని గురించి ఉంటుంది.
అంతర్జాతీయ విధానాలకు అనుగుణంగా వినూత్నమైన పాలసీలు రూపొందించేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ.. జగన్ ప్రభుత్వం వచ్చాక భారీ స్థాయిలో ‘కన్సల్టెన్సీ రాజ్’ తీసుకొచ్చారు. ఇప్పుడు అది మరింత పెరిగింది.
బడ్జెట్ రూపకల్పన కోసం ఎవరైనా ఆర్థిక నిపుణుడి సలహా తీసుకోవచ్చు. సలహాదారుగా నియమించవచ్చు. కేంద్రం నుంచి, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల నుంచి నిధులు ఎలా సమీకరించవచ్చు... తదితర అంశాలపై సలహాలు ఇచ్చేందుకు కన్సల్టెంట్లను నియమించుకోవడంలో తప్పులేదు. కానీ.. ప్రతిఏటా జరిగే బడ్జెట్ రూపకల్పనకూ వీరినే ఆశ్రయిస్తున్నారు. బిల్లులు, చట్టాలను కూడా కన్సల్టెంట్లతో చేయిస్తున్నారు.
ప్రస్తుతం 16వ ఆర్థిక సంఘాన్ని అడగాల్సిన నిధుల కోసం ఆర్థిక శాఖలో ఏకంగా 11 మంది కన్సల్టెంట్లు పనిచేస్తున్నారు.
కన్సల్టెంట్లలో ఎక్కువమంది బెంగళూరు, చెన్నై నుంచి వస్తారు. రావడం.. పోవడం.. అంతా వాళ్లిష్టం. జీతాలు మాత్రం లక్షల్లోనే!
సచివాలయంలో ఎస్‌వోలు, ఏఎ్‌సవోలు అనుభవజ్ఞులు! విషయ పరిజ్ఞానం ఎక్కువ. కన్సల్టెంట్లకు ఉన్న అర్హత... హైఫై ఇంగ్లీష్ వాడటమే!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
రాష్ట్ర సచివాలయం అంటే... ప్రధాన కార్యదర్శి, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లు! ఇప్పుడు వీరిని కాదని... మరో కొత్త వర్గం మొదలైంది! వారే... కన్సల్టెంట్లు! ‘భగవంతునికీ - భక్తునికీ మధ్య’ అన్నట్లుగా... కార్యదర్శులు, సెక్షన్ ఆఫీసర్ల మధ్య వీరు తయారయ్యారు! అయితే... వీరిది అనుసంధానం కాదు! అచ్చంగా అడ్డుగోడలా! ఈ కన్సల్టెంట్ల వ్యవహారం ఇప్పుడు సచివాలయంలో చర్చనీయాంశంగా మారింది.
ప్రభుత్వం కన్సల్టెంట్ల సేవలు తీసుకోవడం కొత్తేమీ కాదు! ఎప్పటినుంచో జరుగుతున్నదే! కానీ... కొన్ని ప్రత్యేకమైన ప్రాజెక్టులు, అంతర్జాతీయ స్థాయి ప్రణాళికలు, వినూత్నమైన ఆలోచనల అమలు తదితర సేవలకు మాత్రమే కన్సల్టెంట్లను వినియోగించుకోవడం రివాజు! ఆయా రంగాల్లో నిష్ణాతులైన వారిని కన్సల్టెంట్లుగా నియమించుకుంటే ప్రాజెక్టు నివేదికల తయారీ, సంప్రదింపులు సులువుగా, సాఫీగా సాగుతాయి. ఇప్పుడు పరిస్థితి ‘అంతకు మించి’ అన్నట్లుగా తయారైంది. ప్రభుత్వ యంత్రాంగం చేయగలిగే రొటీన్ కార్యకలాపాల్లోనూ కన్సల్టెంట్లు వేలు పెడుతున్నారు. సచివాలయంలోని అన్ని శాఖల్లో కలిపి వంద మందికిపైగా కన్సల్టెంట్లు ఉన్నా రు. ఆర్థిక శాఖ, దాని పరిధిలోని ప్రణాళిక శాఖలోనే 31 మంది కన్సల్టెంట్లు ఉన్నారు. వీరందరికీ ప్రభుత్వ అధికారులతో సమానంగా, కొందరికి ఇంకా ఎక్కువగానే వేతనాలు అందిస్తున్నారు. వెరసి... సెక్రటేరియట్‌లో ప్రభుత్వ యంత్రా ంగానికి సమాంతరంగా ఒక ప్రైవేటు వ్యవస్థ నడుస్తోంది.
ఉద్యోగులను దూరం చేస్తూ...
ప్రభుత్వంలో సెక్రటరీల పేరుతో పాలనా వ్యవహారాలు నడుస్తాయి. సెక్రటరీలకు సాయం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులు వివిధ కేడర్లలో ఉంటారు. కానీ, ఇప్పుడు చాలామంది కార్యదర్శులు కన్సల్టెంట్లు లేకుండా ఒక్క అడుగు కూడా వేయలేకపోతున్నారు. పోనీ, ఆయా సబ్జెక్టుల్లో నైపుణ్యం ఉన్న వారినే కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నారా అంటే అదీ లేదు. కేవలం ప్రపంచస్థాయి ఇంగ్లీషు వస్తే చాలన్నట్టుగా కన్సల్టెంట్ల నియామకాలు జరుగుతున్నాయి. ఈ కన్సల్టెంట్లకు ప్రత్యేకమైన టాస్క్‌లు కూడా అప్పగించడంలేదు. ముఖ్యమంత్రికి ప్రజెంటేషన్ ఇవ్వాలన్నా, నోట్ రాయాలన్నా, కేంద్ర ప్రభుత్వ శాఖలకు ప్రతిపాదనలు పంపాలన్నా కన్సల్టెంట్లనే పిలుస్తున్నారు. ఆ కన్సల్టెంట్లు... సంబంధిత సబ్జెక్టు చూసే సెక్షన్ ఆఫీసర్ల దగ్గరకు వెళ్లి వివరాలు తీసుకొని, వాటి ఆధారంగా ప్రజంటేషన్లు, లేఖలు సిద్ధం చేస్తున్నారు. ఈ మాత్రం పని ఎస్‌వోలు, ఏఎస్వోలు చేయలేరా? అంటే... కచ్చితంగా చేయగలరు. అయినప్పటికీ కన్సల్టెంట్లదే పెత్తనం! దీంతో సెక్రటరీలకు, సచివాలయ అధికారులకు మధ్య అంతరం పెరుగుతోంది.
అనుభవాన్ని పక్కనపెట్టి...
సచివాలయంలో కార్యదర్శులు నిర్ణయం తీసుకునేందుకు ఒక విధానం అమలులో ఉంది. కొందరు కార్యదర్శులు తన కింది స్థాయిలో ఉండే అధికారులను పిలిచి మాట్లాడుతారు. మరికొందరు అధికారులు ఆ సెక్షన్‌కు సంబంధించిన ఏఎ్‌సవో, ఎస్‌వో, ఏఎస్, డీఎస్ ఇలా అందరినీ పిలిచి అభిప్రాయాలు తీసుకుని... ఒక నిర్ణయం తీసుకుంటారు. ఉదాహరణకు... రాష్ట్రంలో పన్ను ఆదాయం ఎలా పెంచాలి, ఎందుకు తగ్గుతోంది, ఎక్కడ లోపం జరుగుతోంది అని ప్రశ్నిస్తే కన్సల్టెంట్లకంటే ఆర్థిక శాఖ అధికారులే సాధికారికంగా జవాబు చెప్పగలరు. ఎందుకంటే... ఆర్థిక శాఖ ఉద్యోగులకు బదిలీలు ఉండవు. రిటైర్ అయ్యే వరకు అదే శాఖలో పని చేస్తారు. అన్ని పరిణామాలను గమనిస్తుంటారు. ఇదే ప్రశ్న కన్సల్టెంట్లను అడిగితే గూగుల్‌లో సెర్చ్ చేస్తారు. పోనీ... నిధులు రాబట్టడంలో వీళ్లేమైనా అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారా అంటే అదీ లేదు. ఉద్యోగులను నమ్మలేం, అందుకే కన్సల్టెంట్లతో పనులు చేయిస్తున్నామని కొందరు అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. ఉద్యోగులకు చెప్పలేని రహస్యాలను ప్రైవేట్ వ్యక్తులైన కన్సల్టెంట్లకు మాత్రం ఎలా చెబుతారు? పైగా డేటా లీకైతే ప్రభుత్వ ఉద్యోగులను శిక్షించడానికి నిబంధనలు ఉన్నాయి. కానీ, ప్రైవేట్ వ్యక్తులపై ఎలాంటి చర్యలూ తీసుకోలేరు కదా!
‘నైపుణ్యం’ ఎందుకు?
ప్రభుత్వ ఉద్యోగుల్లో నైపుణ్యాలు పెంచడం కోసమంటూ ప్రణాళిక శాఖ మంగళవారం ఒక జీవో జారీ చేసింది. ఇందుకోసం ఏపీ స్టేట్ కెపాసిటీ బిల్డింగ్ కమిటీ, కేంద్రం పరిధిలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో ఏపీ నాలెడ్జ్ సొసైటీ, కెపాసిటీ బిల్డింగ్ పాలసీ-2025ను ఆమోదిస్తున్నట్టు ఆ జీవోలో పేర్కొన్నారు. అత్యాధునిక టెక్నాలజీకి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం ఈ పాలసీ ఉద్దేశం. ఓ వైపు కన్సల్టెంట్లను మితిమీరి ప్రోత్సహిస్తూ... ఉద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దుతామనడమే విచిత్రం!
Updated Date - Feb 19 , 2025 | 03:35 AM