Advocate General : నాటి ప్రభుత్వ పెద్దలతో కలిసి విక్రాంత్‌రెడ్డి కుట్ర!
ABN, Publish Date - Feb 19 , 2025 | 04:15 AM
అరబిందోకు బదలాయించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలతో కలిసి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి కుట్రపన్నారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు.
అరబిందోకు వాటాలు బదలాయించాలని కేవీరావుకు బెదిరింపులు
సీఐడీ తరఫున ఏజీ దమ్మాలపాటి వాదనలు
అమరావతి, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): ‘కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్ లో కేవీఆర్ గ్రూపు వాటాలు అరబిందోకు బదలాయించేందుకు అప్పటి ప్రభుత్వ పెద్దలతో కలిసి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్‌రెడ్డి కుట్రపన్నారని అడ్వకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ తెలిపారు. కేవీ రావు ఫిర్యాదు ఆధారంగా గత ఏడాది డిసెంబరు 2న మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదుచేసిన కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఏ-1 వై.విక్రాంత్‌రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై ఏజీ మంగళవారం సీఐడీ తరఫున వాదనలు వినిపించారు. ‘వాటాల బదలాయించేనాటికి పోర్టు లాభాల్లో నడుస్తోంది. రూ.2,600 కోట్లు విలువ చేసే 41శాతం వాటాను కేవలం రూ.480 కోట్లకే చేజిక్కించుకున్నారు. ఆడిట్ సంస్థ 2020 మార్చిలో నివేదిక ఇవ్వగా 2021 జనవరి వరకు మారిటైమ్ బోర్డు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. కాకినాడ పోర్టు, సెజ్‌లలో కేవీఆర్ గ్రూపు వాటాలన్నీ అరబిందోకు బదిలీ అయ్యి.. వాటికి ప్రభుత్వం ఆమోదం తెలిపేవరకు మౌనంగా ఉన్న బోర్డు ఆ తర్వాత చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వానికి రూ.9 కోట్లు మాత్రమే నష్టం జరిగిందని పీకేఎఫ్ సంస్థ సవరించిన ఆడిట్ రిపోర్టుకు ఆమోదం తెలిపింది. అప్పులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే రూ.400 కోట్లకు కాకినాడ సెజ్‌లోని కేవీరావు వాటాను కొనుగోలు చేసేందుకు జీఎంఆర్ సంస్థ ఒప్పందానికి వచ్చింది. అందుకు విరుద్ధంగా రూ.12 కోట్లు చెల్లించి సెజ్‌లోని వాటాలను అరబిందోకు బదలాయించారు.
కాకినాడ పోర్ట్, సెజ్‌లకు సంబంధించి 2020 మార్చిలో పీకేఎఫ్ ఆడిట్ సంస్థ నివేదిక సమర్పించాక అదే ఏడాది మే, జూన్ నెలల్లో అప్పటి ముఖ్యమంత్రి నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో అదనపు డీజీ పి.సీతారామాంజనేయులు, ఏసీబీ అధికారులు పాల్గొన్నారు. అందుకు సంబంధించి మీటింగ్‌లో పాల్గొన్న వ్యక్తి సీఆర్‌పీసీ సెక్షన్ 164 కింద మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. పిటిషనర్ అప్పటి ముఖ్యమంత్రికి దగ్గర బంధువు.. రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డికి కుమారుడు. వాటాల బదలాయింపు కోసం కేవీరావును బెదిరించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేయండి’ అని కోరారు. కేవీరావు తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, విక్రాంత్‌రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. అన్ని పక్షాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు న్యాయమూర్తి జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Updated Date - Feb 19 , 2025 | 04:15 AM