AP P4 Program: ఎవరు మార్గదర్శులు
ABN, Publish Date - Jul 29 , 2025 | 03:58 AM
ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి! కొందరు అధికారులు చేస్తున్నది మరొకటి,పీ4లో భాగంగా పేద కుటుంబాల బాగోగుల బాధ్యతను తీసుకునే మార్గదర్శులపై గందరగోళం ఏర్పడుతోంది.
స్వచ్ఛంద కార్యక్రమంపై నిర్బంధ ఉత్తర్వులు
కొన్ని జిల్లాల్లో ఎక్సైజ్ అధికారులకు టార్గెట్లు
లిక్కర్ లైసెన్సీలపైనా ఒత్తిడి తెచ్చే యత్నం
టీచర్లపై జారీ చేసిన ఉత్తర్వులు రద్దు
‘ఆంధ్రజ్యోతి’ వార్తకు స్పందన
నమోదు, సాయం స్వచ్ఛందమే: ప్రభుత్వం
పీ4పై కలెక్టర్ల ఆదేశాలతో గజిబిజి
అమరావతి, జూలై 28 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి ఉద్దేశం ఒకటి! కొందరు అధికారులు చేస్తున్నది మరొకటి! ‘పీ4’లో భాగంగా పేద కుటుంబాల బాగోగుల బాధ్యతను తీసుకునే ‘మార్గదర్శు’లపై గందరగోళం ఏర్పడుతోంది. ఈ కార్యక్రమం పూర్తిగా స్వచ్ఛందమని ప్రభుత్వం చెబుతుండగా... కొందరు అధికారులేమో ఉద్యోగులకు టార్గెట్లు విధించడం వివాదాస్పదంగా మారుతోంది. ‘మార్గదర్శులుగా టీచర్లు’, ‘మార్గదర్శులుగా లిక్కర్ లైసెన్సీలు’ అంటూ ఆదేశాలు ఇస్తున్నారు. ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీఈవో ఉపాధ్యాయులను మార్గదర్శులుగా నమోదు చేయించాలని ఉత్తర్వులు జారీ చేశారు. కొందరు కలెక్టర్లు ఎక్సైజ్ శాఖకు ఈ పథకంలో లక్ష్యాలు నిర్దేశిస్తున్నారు. మద్యం లైసెన్సీలను మార్గదర్శులను చేయించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు స్థానిక మద్యం లైసెన్సీలకు పీ4 పేరుతో టార్గెట్లు పెడుతున్నట్లు తెలిసింది. ఈ గందరగోళమంతా అవగాహన లోపం వల్లే జరుగుతోందని అర్థమవుతోంది. పీ4 కార్యక్రమంలో ఒక కుటుంబాన్ని ఎవరైనా దత్తత తీసుకోవడం అనేది పూర్తిగా స్వచ్ఛందం. ఎవరికైనా ఈ కార్యక్రమంపై ఆసక్తి ఉంటే పేదలను పైకి తీసుకొచ్చే సదుద్దేశంతో మార్గదర్శిగా నమోదు చేసుకోవచ్చు. అయితే మద్యం వ్యాపారులు ధనవంతులు కాబట్టి కొన్ని కుటుంబాలను వారికి అనుసంధానం చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొన్నిచోట్ల పీ4 అని కాకుండా కొంత నగదు ఇవ్వాలని ఎమ్మెల్యేలు అడుగుతున్నట్లు తెలిసింది. ఆ నగదుతో కుటుంబాలను దత్తత తీసుకునే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మద్యం వ్యాపారులు మార్గదర్శులుగా మారితే కొత్త చిక్కులు వస్తాయేమోనని ఎక్సైజ్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థికంగా కుటుంబాలను ఆదుకునే సాకుతో మద్యం వ్యాపారంలో ఉల్లంఘనలకు పాల్పడే అవకాశం ఉంటుందనేది వారి అభిప్రాయం. ప్రభుత్వం పీ4లో రెండు రకాలుగా కుటుంబాలను దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తోంది.
ఆర్థిక సాయంతో కుటుంబాలను పైకి తీసుకురావడం ఒక విధానం. ఎలా పైకి రావాలనే దానిపై కుటుంబాలకు మార్గదర్శనం చేయడం మరొక విధానం. వివిధ శాఖల అధికారులకు కలెక్టర్లు వ్యక్తిగతంగా టార్గెట్లు పెడుతుండగా వారు రెండో విధానాన్ని ఎంచుకుంటున్నారు. కలెక్టర్లకు ప్రభుత్వం టార్గెట్లు పెట్టినందువల్లే ఇలా వివిధ మార్గాల్లో మార్గదర్శులను పెంచే ప్రయత్నం చేస్తున్నారని మరో వాదన వినిపిస్తోంది.
ఆ ఉత్తర్వులు ఉపసంహరణ
ఉపాధ్యాయులను మార్గదర్శులుగా నమోదుచేయాలని ఇచ్చిన ఉత్తర్వులను ఏలూరు డీఈవో ఉపసంహరించుకున్నారు. ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లను తప్పనిసరిగా మార్గదర్శులుగా నమోదు చేయించాలని కొద్దిరోజుల కిందట డీఈవో ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో 190 మంది టీచర్లను కచ్చితంగా నమోదుచేయించాలని స్పష్టంచేశారు. దీనిపై ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నుంచి పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ‘మార్గదర్శకులుగా టీచర్లా’ శీర్షికతో సోమవారం ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ప్రచురించింది.
ఎవరినీ ఒత్తిడి చేయట్లేదు: కుటుంబరావు
పీ4 పూర్తిగా స్వచ్ఛంద కార్యక్రమమని, దీని నిర్వహణకు ఎలాంటి ఒత్తిళ్లూ చేయడం లేదని స్వర్ణాంధ్ర ఫౌండేషన్ ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పష్టం చేశారు. ఎవరికి ఇష్టమైతే వారు చేయవచ్చని, ఇష్టం లేకపోతే చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ సర్వే ద్వారా ముందే లబ్ధి అవసరమైన కొన్ని కుటుంబాలను బంగారు కుటుంబాలుగా ఎంపికచేసినట్టు తెలిపారు. ఇప్పటి వరకు 50 వేలమందికిపైగా నమోదు చేసుకున్నారని తెలిపారు.
Updated Date - Jul 29 , 2025 | 04:00 AM