సాగుపై సందిగ్ధం!
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:17 AM
ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై రైతులు సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వచ్చిన రుతు పవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో భూములు సాగుకు సిద్ధమయ్యాయి. అయితే పంట కాలువలు అధ్వానంగా ఉండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులు ఇప్పటి వరకు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల తేదీపై స్పష్టత రాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.
- ముందుగానే వచ్చిన రుతుపవనాలు
- గుర్రపు డెక్క, తూడుతో నిండిన కాలువలు
- నేటికీ ప్రారంభం కాని తొలగింపు పనులు
- నీటి విడుదలపై రాని స్పష్టత.. అయోమయంలో రైతులు
ఈ ఏడాది ఖరీఫ్ సాగుపై రైతులు సందిగ్ధం వ్యక్తం చేస్తున్నారు. ముందుగానే వచ్చిన రుతు పవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో భూములు సాగుకు సిద్ధమయ్యాయి. అయితే పంట కాలువలు అధ్వానంగా ఉండటం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. నీటి ప్రవాహానికి ఆటంకంగా మారిన గుర్రపు డెక్క, తూడు తొలగింపు పనులు ఇప్పటి వరకు చేపట్టకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీటి విడుదల తేదీపై స్పష్టత రాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు.
(ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం)
జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఈ నెల 3వ తేదీన 42వ జిల్లా సాగునీటి సలహా మండలి (ఐఏబీ) సమావేశం నిర్వహించారు. పంట కాలువలు, డ్రెయినేజీల్లో గుర్రపు డెక్క, నాచు, కిక్కిస, తూడు పేరుకుపోయాయని, ఇప్పటి వరకు పూడికతీత, కాలువల నిర్వహణ (ఓఅండ్‌ఎం) పనులు ప్రారంభించలేదు.. కాలువల గండ్లు పూడ్చలేదు.. ఇటువంటి పరిస్థితుల్లో కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేస్తే చివరి ప్రాంతాలకు నీరు చేరదని, కాలువల్లో పనులు చేశాకే సాగునీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యేలు, సాగునీటి సంఘాల అధ్యక్షులు గళమెత్తారు. సాధ్యమైనంత త్వరగా ఓఅండ్‌ఎం పనులు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే కాలువల్లో ఓఅండ్‌ఎం పనులు నేటికీ ప్రారంభించలేదు. రూ.10 లక్షల విలువైన పనులను కాంట్రాక్టర్లతో పనిలేకుండా సాగునీటి సంఘాలకు నామినేషన్ పద్ధతిన కేటాయించి, ఈ నెల 1వ తేదీన పనులు చేసేందుకు అనుమతులు ఇచ్చారు. అయినా ఇప్పటి వరకు పనులు ప్రారంభంకాలేదు.
అధ్వానంగా పంట కాలువలు
పామర్రు నియోజకవర్గంలో ఐనంపూడి, గేదెలకోడు, బొప్పాయికోడు, భీమనది డ్రెయిన్‌లు ఉన్నాయి. వీటిలో పూర్తిస్థాయిలో గుర్రపు డెక్క, తూడు నాచు పేరుకుపోయాయి. ఈ ఏడాది నిర్వహణ పనులను ఇంతవరకు ప్రారంభించలేదు. ఇదే విషయాన్ని పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార రాజా ఇటీవల జరిగిన ఐఏబీ సమావేశంలో అధికారులు దృష్టికి తీసుకువచ్చారు. పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పినా ఇంతవరకు పనులు ప్రారంభం కాలేదని ఆ ప్రాంత రైతులు అంటున్నారు. రానున్న రోజుల్లో భారీ వర్షాలు కురిస్తే చుక్కనీరు దిగువకు పోదని, పొలాలు నారుమడుల దశలో, పైరు దశలో మునిగిపోతాయని ఆందోళన చెందుతున్నారు. మచిలీపట్నం మండలంలోని శివగంగ, తాళ్లపాలెం, లంకపల్లి డ్రెయినేజీల్లో గుర్రపు డెక్క పేరుకుపోయింది. అయినా ఈ డ్రెయినేజీల్లో ఓఅండ్‌ఎం పనులను నేటికీ ప్రారంభించలేదు. కంకిపాడు వద్ద బందరు కాలువ లాకులు శిథిలావస్థకు చేరుకున్నాయని, వాటికి కనీస మరమ్మతులైనా చేయాలని రైతులు కోరుతున్నారు. వీటితో పాటు ప్రఽధాన కాలువలకు సంబంధించి రెగ్యులేటర్‌లు, లాకులు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
బందరు కాలువలో పెరిగిన గుర్రపు డెక్క
యనమలకుదురు లాకుల వద్ద ప్రారంభమై మచిలీపట్నంలోని గిలకలదిండి వరకు 76 కిలోమీటర్ల మేర ప్రవహించి 1.25 లక్షల ఎకరాలకు సాగునీరందించే బందరు కాలువ పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. కాలువలోని పలు ప్రాంతాల్లో గుర్రపు డెక్క, నాచు పెరిగి నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. మచిలీపట్నం మండలం మల్లవోలు లాకుల దిగువన సీతారామపురం వద్ద బందరు కాలువలో గుర్రపు డెక్క పెరిగి చుక్కనీరు దిగువకు వెళ్లడంలేదు. గుర్రపు డెక్కను తొలగించాలని నీటిపారుదలశాఖ అధికారుల చుట్టూ రైతులు తిరుగుతున్నారు. అయినా నేటివరకు ఈ పనులను ప్రారంభించలేదు. బందరు కాలువ స్థితి ఇలా ఉంటే ఈ ఏడాది పొలాలకు సాగునీరు అందడం కష్టమవుతుందని రైతులు అంటున్నారు. దివిసీమ ప్రాంతంలోని గుండేరు, చిల్లలవాగు తదితర డ్రెయినేజీల్లో ఇంతవరకు ఓఅండ్‌ఎం పనులను ప్రారంభించలేదు. వేసవిలోనే గుర్రపు డెక్క, తూడు, నాచులను తొలగించేందుకు రసాయనాలను పిచికారీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ తరహా పనులు చేయకపోవడం గమనార్హం. పూర్తిస్థాయిలో వర్షాలు కురిసిన తర్వాత పనులు ప్రారంభిస్తే ఉపయోగం ఉండదని ఘంటసాల మండల రైతులు అంటున్నారు.
సబ్సిడీ విత్తనాల ఊసేది?
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో జిల్ల్లాలో 1.62 లక్షల హెక్టార్లలో వరి సాగు జరుగుతుందని వ్యవసాయశాఖ అంచనా. చెరకు 3,549, మినుము 1,340, వేరుశెనగ 724, పత్తి 298, వివిధ రకాల పంటలు 133 హెక్టార్లలో సాగు చేయనున్నారు. ఈ ఏడాది 11,600 క్వింటాళ్ల వరి విత్తనాలను క్వింటాలుకు రూ.500 సబ్సిడీగా ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇప్పటి వరకు 6,200 క్వింటాళ్ల విత్తనాలను ఆయా మండలాల్లోని వ్యవసాయశాఖ కార్యాలయాలకు పంపామని జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్సిడీపై ఇచ్చే వరి విత్తనాలు ఇంకా అందుబాటులోకి రాలేదని రైతులు అంటున్నారు. కంకిపాడు, గన్నవరం, తోట్లవల్లూరు, ఉయ్యూరు. పామర్రు, చల్లపల్లి, మొవ్వ, తదితర మండలాల్లో బోరునీటి ఆధారంగా ఇప్పటికే 250 ఎకరాల్లో నారుమడులు పోశారు. కాలువలకు సాగునీటిని విడుదల చేస్తే గుడ్లవల్లేరు, పెడన, బంటుమిల్లి, గుడివాడ, గూడూరు, మచిలీపట్నం తదితర మండలాల్లో వెదజల్లే పద్ధతిన వరినాట్లు వేసేందుకు, నారుమడులు పోసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు.
Updated Date - Jun 12 , 2025 | 01:17 AM