దుర్గమ్మ ఆలయానికి సంపూర్ణ స్వర్ణ తాపడం!
ABN, Publish Date - Jun 24 , 2025 | 12:28 AM
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి సంపూర్ణ స్వర్ణ తాపడం చేయించేందుకు దేవస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం ఆలయ గోపురానికి మాత్రమే బంగారు తాపడం ఉంది. పూర్తి స్థాయిలో ఆలయానికి మొత్తం బంగారు తాపడం చేయించాలని తాజాగా దేవస్థాన అధికారులు ప్రతిపాదన తీసుకువచ్చారు.
- ప్రతిపాదన తయారు చేసిన దేవస్థాన అధికారులు
- టీటీడీ, దాతల సహకారంతో పూర్తి చేసేందుకు నిర్ణయం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయానికి సంపూర్ణ స్వర్ణ తాపడం చేయించేందుకు దేవస్థానం నిర్ణయించింది. ప్రస్తుతం ఆలయ గోపురానికి మాత్రమే బంగారు తాపడం ఉంది. పూర్తి స్థాయిలో ఆలయానికి మొత్తం బంగారు తాపడం చేయించాలని తాజాగా దేవస్థాన అధికారులు ప్రతిపాదన తీసుకువచ్చారు. ఈ విషయాన్ని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి కూడా తీసుకువెళ్లారు. గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సహకారంతో అమ్మవారి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం పనులు జరిగాయి. ప్రస్తుతం అమ్మవారి ఆలయ గోపురం, దిగువున ఉన్న ఆలయ గోడలన్నింటికి కూడా స్వర్ణతాపడం పనులు చేయాలని నిర్ణయించారు. స్వర్ణతాపడం పనులు ఖరీదైన వ్యవహారం కావటంతో పాటు కోట్లాది రూపాయల నిధులు కావాల్సి ఉంది. దీని కోసం దుర్గగుడి అధికారులు మళ్లీ తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులను సంప్రదించారు. టీటీడీ అధికారులు బ్యాలెన్స్ బంగారు తాపడం పనులకు సంబంధించి ప్రణాళికలు కూడా రూపొందించారు. నిధుల సంగతి తేలాల్సి ఉంది. దుర్గగుడి అధికారులు దాతల సహాయాన్ని కూడా తీసుకుని దుర్గమ్మ ఆలయానికి సంపూర్ణ స్వర్ణతాపడం పనులు పూర్తి చేయాలని భావిస్తున్నారు.
Updated Date - Jun 24 , 2025 | 12:29 AM