ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

AP Govt : ‘బనకచర్ల’ సాధనే లక్ష్యం!

ABN, Publish Date - Jan 29 , 2025 | 02:56 AM

రాబోయే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడాలని సీఎం చంద్రబాబు అన్నారు.

  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడండి

  • టీడీపీ ఎంపీలకు చంద్రబాబు సూచన

అమరావతి, జనవరి 28(ఆంధ్రజ్యోతి): పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు కేంద్ర సాయం సాధించడం టీడీపీ ఎంపీల లక్ష్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడాలని వారికి సూచించారు. మంగళవారం సాయంత్రం ఆయన ఇక్కడ తన నివాసంలో పార్టీ ఎంపీలతో సుమారు మూడు గంటలపాటు సమావేశమై పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై సూచనలు, సలహాలు ఇచ్చారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌, పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, పార్లమెంటు సభ్యులు హాజరయ్యారు. పోర్టులు, కొత్త జాతీయ రహదారులు, విశాఖ, విజయవాడ మెట్రో ప్రాజెక్టులు సాధించడానికి గట్టి ప్రయత్నం చేయాలని చంద్రబాబు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ‘పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రం దశ, దిశ వేగంగా మారిపోతాయి. సముద్రంలో వృథాగా కలుస్తున్న గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవడానికి మనం దీనిని చేపడుతున్నాం. దీనిని సాధించడం మన లక్ష్యంగా ఉండాలి. నడికుడి-శ్రీకాళహస్తి, రేణిగుంట-గూడూరు, కోటిపల్లి-నరసాపురం, కడప- బెంగళూరు రైల్వే లైన్లు త్వరగా పూర్తయ్యేలా రైల్వే శాఖ నుంచి నిధులు సాధించాలి’ అని తెలిపారు.


చాలా ప్రాజెక్టులకు కేంద్ర సాయం..

బడ్జెట్‌కు ముందే కేంద్రం చాలా ప్రాజెక్టులకు రాష్ట్రానికి సాయం చేసిందని చంద్రబాబు ప్రశంసించారు. విశాఖ ఉక్కు కర్మాగారం కోసం రూ.11,500 కోట్లతో ప్యాకేజీ, నక్కపల్లి బల్క్‌ డ్రగ్‌ పార్క్‌ కోసం రూ.14 వేల కోట్లు, రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.15 వేల కోట్లు, పోలవరం మొదటి దశ నిర్మాణానికి రూ.12 వేల కోట్లు, కొప్పర్తి, ఓర్వకల్లు పారిశ్రామిక కారిడార్లకు రూ.5 వేల కోట్లు కేటాయించడానికి ముందుకిచ్చింది’ అని గుర్తుచేశారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బ తిందని.. ఈ సమయంలో రాష్ట్రం నిలదొక్కుకోవడానికి కేంద్రం సహాయం అవసరమని ప్రతి సందర్భంలో గుర్తు చేయాలని కోరారు. విభజన చట్టంలో అంశాలు ఇంకా కొన్నిటిని కేంద్రం పరిష్కరించాల్సి ఉందన్నారు. రాష్ట్రం రూపొందించిన పాలసీలను ఎంపీలు బాగా అధ్యయనం చేయాలని సూచించారు. విదేశాల్లో ఉన్న పాలసీలు, ప్రాజెక్టులపైనా అవగాహన పెంచుకుని రాష్ట్రానికి సమాచారమివ్వాలన్నారు. కంపెనీలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎ్‌సఆర్‌) నిధులను ఖర్చు చేసే సమయంలో వాటిపై జీఎస్టీ పడకుండా చూడాలని పెమ్మసాని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.


వక్ఫ్‌ బిల్లుపై చర్చ

కేంద్రం ప్రవేశపెట్టబోతున్న వక్ఫ్‌ బిల్లుపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. టీడీపీ కోరడం వల్లే దీనిని సెలెక్ట్‌ కమిటీకి పంపారని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)లో విస్తృత చర్చకు అవకాశం కలిగిందని కృష్ణదేవరాయలు చెప్పారు. ఈ బిల్లుకు 14 సవరణలు ఆమోదించగా అందులో 4 టీడీపీ పెట్టినవేనని తెలిపారు. ఇందులో ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయని ఒకరిద్దరు ఎంపీలు చెప్పగా.. బిల్లు చర్చకు వచ్చే సమయంలో వాటిపై ఏం చేయాలో ఆలోచిద్దామని బాబు బదులిచ్చారు. ఒకే దేశం- ఒకే ఎన్నికకు సంబంధించిన బిల్లు ఈసారి సమావేశాల్లో రాకపోవచ్చని ఎంపీలు అభిప్రాయపడ్డారు. దీని విధి విధానాలేంటో లోతుగా అధ్యయనం చేయాలని, భవిష్యత్‌లో రాబోయే సమస్యలను ఇప్పుడే అంచనా వేయకపోతే తర్వాత చాలా తలనొప్పులు వస్తాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు.


ఎమ్మెల్యేలపై వదిలేయొద్దు..

ఎంపీలు తమ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించాలని, ఎమ్మెల్యేలపై వదిలేసి ఊరుకోవద్దని సీఎం సూచించారు. ‘కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు మీరు రావడానికి అభ్యంతరపెడతారు. అయినా ఎంపీలుగా మీ విధి నిర్వర్తించాల్సిందే. ఎమ్మెల్యేలతో సమన్వయం పెంచుకోండి. ఉపాధి హామీ పథకం కింద ప్రతిపాదనలు తయారు చేసే సమయంలో వారి అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోండి’ అని చెప్పారు. పార్లమెంటులో టీడీపీ ఎంపీల పనితీరును ఆయన ప్రశంసించారు. మన ఎంపీల హాజరు జాతీయ సగటు కంటే అధికంగా ఉందన్నారు. ప్రశ్నలు అడగడంలో జాతీయ సగటు 9ు ఉంటే టీడీపీ ఎంపీలు 23 శాతంలో ఉన్నారని తెలిపారు. ఇదే పనితీరు ఇక ముందు కూడా చూపించాలని, కింది స్థాయి సమస్యలను పార్లమెంటులో సమర్థంగా లేవనెత్తాలని సూచించారు. సమావేశంలో మంత్రి లోకేశ్‌ కూడా పాల్గొన్నారు.


బడ్జెట్‌లో మెరుగైన కేటాయింపులు: కేశినేని చిన్ని

డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ తోడ్పాటుతో ఈసారి బడ్జెట్‌లో ఏపీకి మెరుగైన కేటాయింపులు ఖాయంగా ఉంటాయని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఆశాభావం వ్యక్తం చేశారు. టీడీపీపీ సమావేశానికి హాజరయ్యే ముందు పలువురు ఎంపీలు విలేకరులతో మాట్లాడారు. చిన్ని మాట్లాడుతూ.. ఇప్పటికే సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిసి రాష్ట్రానికి సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారని తెలిపారు. విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ.. ఏడు వెనుకబడిన జిల్లాలకు సాయం, స్టీల్‌ ప్లాంట్‌ ప్యాకేజీ, అమరావతి, పోలవరానికి నిధులు ఈ ఏడు నెలల్లో తెచ్చామన్నారు. కళ్లుండీ చూడలేని వైసీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.


For AndhraPradesh News And Telugu News

Updated Date - Jan 29 , 2025 | 02:56 AM