CM Chandrababu: 25శాతం పనులు పూర్తికాని నీటి ప్రాజెక్టులూ ముందుకే
ABN, Publish Date - Jul 09 , 2025 | 04:37 AM
సాగునీటి ప్రాజెక్టుల్లో 25శాతం పనులు కూడా పూర్తికాని వాటినీ చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.
సీఎం నిర్ణయం.. నేడు క్యాబినెట్ భేటీలో ప్రతిపాదన
రాజధాని నిర్మాణాలపై ప్రత్యేక సమీక్ష
అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టుల్లో 25శాతం పనులు కూడా పూర్తికాని వాటినీ చేపట్టాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై బుధవారం జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 2019లో వైసీపీ అదికారంలోకి వచ్చిన వెంటనే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 25 శాతం కంటే తక్కువ పనులు చేపట్టిన ప్రభుత్వ శాఖల పనులన్నింటినీ రద్దుచేసి మళ్లీ టెండర్లు పిలవాలని ఆదేశాలు జారీచేశారు. ఇలా రద్దు చేసినవాటిలో మెజారిటీ పనులకు తిరిగి టెండర్లు పిలువకుండా వదిలేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక.. గతంలో టెండర్లు పొందాక పనులు సకాలంలో చేపట్టని సంస్థలను తొలగించి కొత్త టెండర్లు పిలవాలని భావించింది. దీంతో.. ఏడాది కాలంగా 25 శాతం పనులు పూర్తిగాని సాగునీటి ప్రాజెక్టుల పనులు నిలిచిపోయాయి. ఇలా ఆగిన పలు ప్రాజెక్టులు స్థానికంగా ప్రాధాన్యం కలిగినవి కావడంతో.. వాటిని పూర్తిచేయాలంటూ కూటమి ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో.. సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని జలవనరుల శాఖను సీఎం ఆదేశించారు. ముఖ్యమైన ప్రాజెక్టులను పునఃప్రారంభించాలని బుధవారం జరిగే క్యాబినెట్ భేటీలో ప్రతిపాదించనున్నారు. దీనికి ఆమోదం లభిస్తే పాత ధరలకే పనులు పూర్తి చేయాలంటూ కాంట్రాక్టు సంస్థలతో ఆ శాఖ సంప్రదింపులు జరుపనుంది. క్యాబినెట్‌లో పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ జరుగనుంది. అలాగే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపైనా చర్చ జరుగనుంది.
Updated Date - Jul 09 , 2025 | 04:39 AM