CM Chandrababu : ప్రజలపై ఇక భారం మోపలేం
ABN, Publish Date - Feb 05 , 2025 | 03:49 AM
ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఇప్పటికే వారి జీవితాల్ని దుర్భరం చేసిన వైసీపీ
కొత్త విధానాల్లో ఆదాయం పెంచుకోవాల్సిందే: సీఎం
ఆదాయార్జన శాఖల్లో పనితీరు మెరుగుపడాలి
రాష్ట్రంలో పన్ను ఎగవేతలు ఉండటానికి వీల్లేదు
అలాగని వ్యాపారులపై వేధింపులకు పాల్పడొద్దు
అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశం
పీ4 విధానంలో ఏపీలో పేదరిక నిర్మూలన
ఉగాది నుంచి ప్రారంభం.. సర్వేకు ప్రత్యేక పోర్టల్
అమరావతి, ఫిబ్రవరి 4 (ఆంధ్రజ్యోతి): ‘‘గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయి. ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థికవనరులు ఎంతో కీలకమన్న ఆయన... రోజువారీ పురోగతిని చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పని చేయాలని నిర్దేశించారు. వనరులు, ఆదాయ వృద్ధిపై చంద్రబాబు మంగళవారం సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ‘‘గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థికంగా కుదేలైన రాష్ట్రం మళ్లీ కోలుకుని అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వంలోని ఆదాయార్జన శాఖలు ఉత్తమ ఫలితాలు రాబట్టాలి. రాష్ట్ర ఖజానాకు రాబడులు పెంచేందుకు సరికొత్త ఆలోచనలు చేయాలి. రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాల్లోంచి బయటపడేసేందుకు సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. సాధారణ పనితీరుతో, సాధారణ లక్ష్యాలతో యథాలాపంగా పనిచేస్తే ఫలితాలు రావు. వినూత్న ఆలోచనలతో పని చేయాలి. టెక్నాలజీ వాడకం ద్వారా రెవెన్యూ ఆర్జనలో లోపాలను సరిదిద్ది ఆదాయం పెంచాలి’’ అని చంద్రబాబు సూచించారు. కాగా, వాణిజ్య పన్నుల విభాగంలో పన్ను ఎగవేతల అంశం సీఎం దృష్టికి అధికారులు తీసుకెళ్లారు. ఏ ఒక్కరూ పన్ను ఎగవేతకు పాల్పడకుండా చూడాలనీ, అలాగని వ్యాపారులను వేధింపులకు గురి చేయవద్దని సీఎం సూచించారు.
ఇప్పటికే గాడిన పడాలి...
సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి పనులకు ఆర్థికవనరులు ఎంతో కీలకమనీ, దీన్ని దృష్టిలో పెట్టుకుని రోజువారీ పురోగతి చూపేలా ఆదాయార్జన శాఖల్లో అధికారులు పని చేయాలని సీఎం సూచించారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రజల జీవన ప్రమాణాలు పడిపోయాయనీ, ఆదాయం కోసం ప్రజలపై అదనంగా భారం మోపలేమన్నారు. ఆదాయార్జనలో మరింత మెరుగైన ఫలితాలు సాధించడం మినహా మరొక మార్గం లేదని తెలిపారు. ‘‘కేంద్రం నుంచి నిధుల విషయంలో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం. 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియాను కలిసి 1.45గంటలపాటు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరించాను. ఈ తపనంతా రాష్ట్రం కోసమే. అధికారులు దీన్ని ఆర్థం చేసుకుని పని చేయాలి.’’ అని సూచించారు. అనంతరం రెవెన్యూ రాబడులపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ‘‘2023-24 సంవత్సరానికి వాణిజ్య పన్నుల విభాగంలో మొత్తం రూ.41,420కోట్లు రాగా.. ఈ ఏడాది ఇప్పటి వరకు రూ. 41,382కోట్లు ఆదాయం వచ్చింది. ఈ విభాగంలో ఫిబ్రవరి, మార్చిల్లో వృద్ధి ఉంటుంది. నూతన ఎక్సైజ్ విధానం కారణంగా ఈ శాఖలో గతేడాదితో పోల్చితే ఆదాయం పెరగనుంది. మైనింగ్ శాఖలో ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో రెవెన్యూ పెరగలేదు.’’ అని అధికారులు తెలిపారు.
కోర్టు కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి
కోర్టు కేసుల పరిష్కారం, అనుమతుల మంజూరు వంటి చర్యల ద్వారా మైనింగ్ శాఖలో ఆదాయాన్ని పెంచాలని సీఎం సూచించారు. రాష్ట్రానికి ఉన్న మైనింగ్ వనరుల దృష్టా.. ఈ విభాగంలో అత్యధిక ఆదాయం రావాలని నిర్దేశించారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వ్యాట్, జీఎస్టీ, ఎక్సైజ్, వృత్తి-వాణిజ్య పన్నుల ద్వారా వచ్చే ఆదాయం స్వల్పంగా పెరుగుతుందని అధికారులు అంచనావేశారు. మొత్తం మీద 2024-25లో రాష్ట్రప్రభుత్వ రెవెన్యూ రూ. 1,02,154 కోట్లు ఉండొచ్చని తెలిపారు. ఆదాయార్జన విషయంలో ఇకపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తానని, అధికారులు తమ శాఖలను బలోపేతం చేసుకుని ఫలితాలు చూపాలని చంద్రబాబు అన్నారు. సమావేశంలో ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. కాగా, పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం ప్రతిపాదించిన పీ4 విధానాన్ని (పబ్లిక్ - ప్రైవేటు-పీపుల్- పార్టనర్‌షిప్) ఉగాది నుంచి ప్రారంభించనున్నట్లు సీఎం తెలిపారు. సచివాలయంలో ప్లానింగ్‌శాఖపై సమీక్ష సందర్భంగా పీ4 కార్యక్రమం ప్రారంభంపై చర్చించారు. సమాజంలో ఆర్థికంగా అగ్రస్థానంలో ఉన్న 10ుమంది అట్టడుగున ఉన్న 20ు మందికి చేయూతని ఇచ్చేలా ఈ విధానం ఉండాలన్నారు. దీనిపై సమగ్ర విధి విధానాలను రూపొందించేందుకు ప్రజల నుంచి సలహాలు, సూచనలు, అభిప్రాయాలను తీసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే పలువురు పారిశ్రామికవేత్తలు తమ సొంత ఊళ్లు , మండలాలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వచ్చారని.. అలా ఆసక్తి ఉన్న వారిని స్వయంగా ఆహ్వానించి ఉగాది రోజున పీ 4 కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్, ప్లానింగ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
ముందుచూపు ఉన్న నేత బాబు
మాడుగుల నాగఫణి శర్మ
దేశంలో సీఎం చంద్రబాబు వంటి ముందుచూపు ఉన్న నేత లేరని ప్రముఖ అవధాని, సరస్వతీ ఉపాసకులు మాడుగుల నాగఫణి శర్మ అన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రోత్సహించడంలో ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు తీసుకున్న చర్యలను ఆయన కొనియాడారు. పద్మశ్రీ వచ్చిన సందర్భంగా నాగఫణి శర్మను అమరావతికి ఆహ్వానించిన సీఎం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. శాలువా కప్పి సన్మానించారు. అనంతరం నాగఫణి శర్మ సచివాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘చంద్రబాబు విజన్ వల్లనే హైద్రాబాద్‌కు ఐటీ వచ్చింది. ఆయన ముందుచూపు లక్షల మంది జీవితాల్లో వెలుగులు తెచ్చింది. చంద్రబాబు కీర్తి మరింత ఇనుమడిస్తుంది. ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షం అవుతుంది. ప్రజల కోసం చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అమరావతి రాజధాని పూర్తయి ప్రపంచంలో మేటి నగరం అవుతుంది. పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తయి ప్రజలకు మేలు జరుగుతుంది. రాష్ట్రానికి మోదీ, చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలయిక చాలా మంచి చేస్తుంది. సంపద, విద్య, అధికారం... అందరికీ అందేలా ప్రణాళికను సీఎం రూపొందిస్తున్నారు’ అని నాగఫణి శర్మ అన్నారు. సీఎం చంద్రబాబును ఆయన ఆశీర్వదించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక సమావేశం
శ్రీకాకుళం పట్టణానికి కొత్త శోభ: రామ్మోహన్ నాయుడు
తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Feb 05 , 2025 | 03:50 AM