AP Agreements: గేట్స్‌తో బాబు భేటీ నేడు
ABN, Publish Date - Mar 19 , 2025 | 03:35 AM
సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒబెరాయ్ హోటల్‌లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను ఆయన కలుస్తారు.
ఇరువురి సమక్షంలో పలు ఒప్పందాలు
ఉదయం పార్లమెంటులో ప్రధానితో సీఎం సమావేశం?
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో కూడా
బనకచర్ల డీపీఆర్ అందించే అవకాశం
ఉదయం మోదీతో బాబు భేటీ?
న్యూఢిల్లీ, మార్చి 18(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు బుధవారం ఢిల్లీలో గేట్స్ ఫౌండేషన్‌తో కీలక ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు ఒబెరాయ్ హోటల్‌లో గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌ను ఆయన కలుస్తారు. వారిద్దరి సమక్షంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, పరిపాలన, వ్యవసాయం, ఉపాధి రంగాల్లో అవగాహన పత్రంపై సంతకాలు జరుగుతాయని అధికార వర్గా లు తెలిపాయి. అంతకుముందు ఉదయం ఆయన పార్లమెంటులో ప్రధాని మోదీని కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులను ప్రారంభించేందుకు ఆయన్ను ఆహ్వానించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా సమావేశమవుతారని.. పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం తాలూకు డీపీఆర్‌ను అందిస్తారని తెలుస్తోం ది. కాగా.. గేట్స్ ఫౌండేషన్‌తో ఆరోగ్య డేటా వ్యవస్థలు, టెలిమెడిసిన్, తక్కువ ఖర్చుతో వైద్య పరీక్షలు, వైద్య ఉపకరణాలు.. డిజిటల్ విద్య, జాతీయ విద్య సదస్సు, విద్యా రంగంలో సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు, ప్రజాసేవలు, వ్యవసాయంలో ఉపగ్రహ డేటా ద్వారా పారదర్శకంగా సబ్సిడీ పంపిణీ, ఉత్పాదకత, వివిధ రంగాల్లో ఉపాధి కల్పనపైనా ఒప్పందాలు కుదరనున్నాయి. ఈ రంగాలన్నిటిలో ప్రధానంగా ఏఐను అన్వయించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
దీర్ఘదృష్టి ఉన్న నేత: రాందేవ్
కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహన్ కుమారుల వివాహ రిసెప్షన్‌కు టీడీపీ ఎంపీలతో కలిసి చంద్రబాబు హాజరయ్యారు. అక్కడ ఎదురైన బాబా రాందేవ్ ఆయన్ను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యంగా కనిపిస్తున్నారని ప్రశంసించారు. ఈ దేశంలో అభివృద్ధి పట్ల దీర్ఘదృష్టి ఉన్న నాయకుడంటూ ఆయన్ను అక్కడు న్న ఇతర సాధువులకు పరిచయం చేశారు. కాగా.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా ఈ రిసెప్షన్‌కు హాజరయ్యారు.
రాజధాని పనులపై చంద్రబాబు సమీక్ష
రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభంపై ప్రధాని నరేంద్ర మోదీ ముందు ఉంచాల్సిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, మున్సిపల్ మంత్రి నారాయణ కలసి ఉన్నతాధికారులతో చర్చించారు.
Updated Date - Mar 19 , 2025 | 03:36 AM