CM Chandrababu: జగన్‌కు తెలిసింది విధ్వంసమే
ABN, Publish Date - Aug 02 , 2025 | 04:37 AM
64 లక్షలమందికి ఏటా రూ.33 వేల కోట్ల విలువైన పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
ఐదేళ్లూ ఆయన చేసింది ఇదే
పడగొట్టడం తేలిక.. నిలబెట్టడమే కష్టం
నేను సంపద సృష్టిస్తా.. పేదలకు పంచుతా
2014-19లో సీమ ఇరిగేషన్‌పై 12 వేల కోట్ల ఖర్చు
2019-24లో జగన్ చేసిన ఖర్చు కేవలం 2 వేల కోట్లు
మేం చెప్పినట్లే సీమకు స్టీల్ ప్లాంట్.. తల్లికి వందనం..
7 నుంచి చేనేతకు ఉచిత విద్యుత్.. 15 నుంచి ఉచిత బస్
బంగారు కుటుంబాలు ప్రపంచానికి రోల్‌మోడల్: సీఎం
జమ్మలమడుగులో ‘ప్రజావేదిక’.. పింఛన్ల పంపిణీ
‘‘దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కుండ పాలల్లో ఒక చుక్క విషం వేస్తే చెడిపోతాయి, కానీ పాలు తయారుచేసిన వారికే ఆ కష్టం తెలుస్తుంది. ఎప్పుడుకూడా నిలబెట్టడం, అభివృద్ధి చేయడమే కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషం పని. ఐదేళ్లూ అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. చాలా సమస్యలు సృష్టించారు. రూ.10లక్షలకోట్లు అప్పు చేశారు. అప్పట్లో పింఛన్ ఒక నెల తీసుకోకపోతే రెండోనెల ఎగ్గొట్టేవారు. మేమొచ్చాక ఆ పరిస్థితిని సరిదిద్దాం. సాంకేతికతను జోడించి పంపిణీని సులభతరం చేశాం.’’
- చంద్రబాబు.
కడప, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): 64 లక్షలమందికి ఏటా రూ.33 వేల కోట్ల విలువైన పింఛన్లు ఇస్తున్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నేరుగా ఇంటికి వెళ్లి నిద్రలేపి పింఛన్ అందిస్తున్నామని, రూ.2,751 కోట్లు లబ్ధిదారుల చేతికి ఇస్తున్నామని తెలిపారు. జగన్ హయాంలో సాగిన విధ్వంసం, పింఛన్లలో గందరగోళం మొదలు, తాజాగా నెల్లూరు పర్యటనలో రెచ్చగొట్టే ప్రసంగాలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. శుక్రవారం కడప జిల్లా జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో జరిగిన ‘పేదల సేవలో ప్రజావేదిక’ కార్యక్రమానికి సీఎం హాజరయ్యారు. లబ్ధిదారులకు గ్రామంలో పింఛన్లు స్వయంగా అందించారు. సంపద సృష్టిస్తాం.. పేదలకు పంచుతాం అని ఈ సందర్భంగా చంద్రబాబు పునరుద్ఘాటించారు. ‘‘ఈ రోజు బంగారు కుటుంబం రేపటిరోజున మార్గదర్శులై మరికొన్ని బంగారు కుటుంబాలకు చేయూతను ఇవ్వాలి. సమాజానికి మనం ఏదైనా చేయాలి. మనతో పుట్టినవారు ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు.
వారిని ఆదుకునేందుకే పీ4 కార్యక్రమం. మన బంగారు కుటుంబాలు ప్రపంచానికి రోల్‌మాడల్‌గా మారుతాయి’’ అని ముఖ్యమంత్రి తెలిపారు. పింఛన్ ఎక్కడ, ఎప్పుడు ఇచ్చారో తెలుసుకునేందుకు టెక్నాలజీ ఉపయోగిస్తున్నామన్నారు.‘మీకు పింఛన్ వస్తుంది...పంపిస్తున్నాం...తీసుకోండి’ అని ముందురోజు మెసేజ్ పంపిస్తున్నాం. పింఛన్ ఇచ్చే సమయంలో లంచాలు అడుగుతున్నారా దురుసుగా ప్రవర్తించారా అని అదే రోజు సాయంత్రం మెసేజ్ పెడుతున్నాం. అవసరమైతే భవిష్యత్తులో వాట్సప్ సేవలు అందుబాటులోకి తెస్తాం. ఎవరికైనా పింఛను అందకుంటే అందులో మెసేజ్ పెట్టవచ్చు. వెంటనే అందిస్తాం.’’ అని చంద్రబాబు వివరించారు. ఈనెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్ సౌకర్యం అందుబాటులోకి తెస్తామన్నారు. చేనేత దినోత్సవం సందర్భంగా ఈనెల 7 నుంచి పవర్‌లూమ్స్‌కు హ్యాండ్‌లూమ్స్‌కు విద్యుత్ ఉచితంగా అందిస్తామని ప్రకటించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
‘‘కొంతమంది వితండవాదులు ఉంటారు. ఆరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నాను. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని జగన్ మీడియా ప్రసారం చేసింది. అదేరోజు మధ్యాహ్నానికి మాటమార్చారు. తెల్లవారే సరికి పేపర్‌లో నారాసుర రక్తచరిత్ర అంటూ నా చేతిలో కత్తి. ఆ తర్వాత నేనేదో ఆదినారాయణరెడ్డికి చెప్పానంట, బీటెక్ రవికి చెప్పానంట. రోజురోజుకు మాట మార్చారు. నెల్లూరుకు (జగన్) వెళ్లారు. ప్రశాంతిరెడ్డి... ప్రభాకర్‌రెడ్డి సతీమణి, ఎమ్మెల్యే. ఆమె క్యారెక్టర్ గురించి నోరుపారేసుకున్న వ్యక్తిని మందలించాల్సింది పోయి నేరుగా అక్కడకు వెళ్లి ఆయనను ఇంకా రెచ్చగొట్టారు. ‘ఇంకా తిట్టు..నేను ఉన్నా’నంటూ ఽభుజం తట్టారు. ఇలాంటి వారు రాజకీయాల్లో ఉండాలా? నిన్న ఆయన నెల్లూరుకు వెళ్లారు. చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం వెళ్లినపుడు వచ్చిన జనాభా వీడియో తీసుకొని నిన్న జగన్ మీడియాలో ప్రసారం చేశారు. జగన్ పత్రికలో వచ్చేదాన్ని మీరు నమ్మితే కుక్కతోక పట్టుకొని గోదావరిని ఈదినట్లే జాగ్రత్త. మంచిగా ఎక్కడ జగన్ తిరిగినా నాకేం బాధలేదు. కానీ ప్రజలకు అసౌకర్యం కలిగించారంటే ఊరుకోం. తోక తిప్పితే కట్‌చేస్తా’’
రుణం తీర్చుకుంటా..
‘‘దేన్నైనా చెడగొట్టడం, పడగొట్టడం చాలా సులభం. కుండ పాలల్లో ఒక చుక్క విషం వేస్తే చెడిపోతాయి, కానీ పాలు తయారుచేసిన వారికి కష్టం తెలుస్తుంది. ఇప్పుడుకూడా నిలబెట్టడం కష్టం, అభివృద్ధి చేయడం కష్టం, విధ్వంసం చేయడం ఒక నిమిషం పని. ఐదేళ్లు అదే జరిగింది. రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. రాయలసీమ ప్రాంతానికి కావాల్సింది నీళ్లు. కూటమి ప్రభుత్వం రాగానే హంద్రీనీవా వెడల్పు చేసి లైనింగ్ వేసి పనులు పూర్తిచేసి రూ.3800కోట్లతో 3900క్యూసెక్కుల నీరు వెళ్లేందుకు పనులు ప్రారంభించాం, 2024లో పదికి ఏడు సీట్లు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పదికి పది సీట్లూ ఇచ్చేందుకు మీరు సిద్ధమయ్యారు. మీరుణం (కడప) తీర్చుకుంటాను.’’
రాయలసీమకే వలసలు వచ్చేలా చేస్తా..
‘‘2014-2019 మధ్య రూ.12,241 కోట్లు ఖర్చుచేసి ముఖ్యమైన ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తిచేశాం. 2019-2024 మధ్య రూ.2వేలకోట్లు మాత్రమే అప్పటి ప్రభుత్వం ఖర్చుచేసింది. సముద్రంలోకి పోయేనీళ్లను వాడుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు కరువు సమస్య తొలగిపోతుంది. రాయలసీమలో అనేక వనరులు ఉన్నాయి, పరిశ్రమలు రావల్సిన అవసరం ఉంది. కొప్పర్తి, ఓర్వకల్లు, ఇండస్ర్టియల్‌లో రూ.5వేలకోట్లు పెట్టి అభివృద్ధి చేస్తున్నాం. రాయలసీమలో ఆటోమొబైల్, స్పేస్ టెక్నాలజీ, డిఫెన్స్, ఎయిరోస్పేస్, ఎలక్ర్టానిక్, డ్రోన్ సిటీ పెట్టి గ్రీన్ ఎనర్జీ హబ్‌గా తయారుచేస్తున్నాం.. ఇవన్నీ వస్తే మన పిల్లలు ఉద్యోగాల వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. వేరే ప్రాంతాల వాళ్లే రాయలసీమకు వలస వస్తారు.’’
సింగపూర్‌లో తెలుగుహవా..
‘‘నేను 25ఏళ్ల ముందు సింగపూర్‌కు వెళితే తెలుగువారు ఒక్కరుండేవారు కాదు. కానీ నిన్న 40వేల మంది ఒక్క సింగపూర్‌లో ఉన్నారంటే మిగిలినదేశాల్లో ఎంతమంది ఉన్నారో ఆలోచించాలి. అక్కడి స్థానికులకంటే మనవాళ్ల తలసరి ఆదాయం అధికం. అమెరికా, ఆస్ర్టేలియా, సింగపూర్, ఐర్లాండ్‌లలో స్థిరపడి సంపాదిస్తున్నారంటే అది నాలెడ్జ్ ఎకానమీలో మనవాళ్లకుండే తెలివితేటలే కారణం.’’ అని చంద్రబాబు తెలిపారు.
2028 చివరికి స్టీల్ ప్లాంట్ తొలిదశ పూర్తి
‘‘మొన్ననే కడప మహానాడులో రాయలసీమకు స్టీల్‌ప్లాంట్ వస్తుందని చెప్పాను. అన్నట్టే స్టీల్‌ప్లాంట్ శాంక్షన్ చేశాం, డెవలపర్‌ను ఎంపిక చేశాం. జిందాల్ కంపెనీ పనులు మొదలుపెట్టింది. 2028 డిసెంబర్‌నాటికి ఫేజ్ -1 పూర్తిచేయాలని స్పష్టంగా ఆదేశాలిచ్చాం. మొదటి దశ రూ.4,500కోట్లు, రెండవ దశ రూ.11, 850కోట్లతో ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది. 2029కల్లా ప్రొడక్షన్ ప్రారంభమవుతుంది. గాలేరునగరి కాల్వలు కడప వరకు తీసుకెళ్తామని చెప్పాం, వచ్చే ఏడాది మొదటికల్లా కడప వరకు గాలేరునగరి కాల్వలను పూర్తిచేస్తాం. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకు తల్లికి వందనం ఇస్తామన్నాం, చెప్పినట్లుగానే ఇచ్చాం.’’
ఆటో ఎక్కి ప్రజా వేదిక వద్దకు.. మీరొచ్చాక రోడ్లు బాగుపడ్డాయి సార్..
చంద్రబాబుకు వివరించిన జగదీశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు జమ్మలమడుగు సమీపంలోని గూడెంచెరువు లో శుక్రవారం పెన్షన్లు పంపిణీ చేశారు. ఉలసాల అలివేలమ్మ అనే లబ్ధిదారు ఇంటికి వెళ్లి వితంతు పింఛను అందించారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో ముచ్చటించి వారి జీవనస్థితిగతులు ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆమె పెద్దకుమారుడు వేణుగోపాల్‌కు చెందిన చేనేత మగ్గాన్ని సీఎం పరిశీలించారు. తమకు తల్లికి వందనం లబ్ధి చేకూరిందని వేణుగోపాల్ వివరించారు. అనంతరం అలివేలమ్మ చిన్నకుమారుడు ఆటోడ్రైవరు జగదీశ్‌తో మాట్లాడారు. అదే ఆటోలో సీఎం చంద్రబాబు సమీపంలో ఉన్న ప్రజావేదిక వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో జగదీశ్‌తో సరదాగా ముచ్చటించారు. చంద్రబాబు తనతో సంభాషించడం పట్ల జగదీశ్ సంతోషం వ్యక్తం చేశారు. వారి మధ్య సంభాషణ ఇలా సాగింది.
సీఎం: ఏం తమ్ముడు ఎలా ఉంది?
జగదీశ్: సార్ రోడ్లన్నీ బాగున్నాయి. ప్రభుత్వం మంచి పనిచేస్తోంది.
సీఎం : ఎన్ని రోజుల నుంచి ఆటో నడుపుతున్నావు?
జగదీశ్ : 12 ఏళ్ల నుంచి నడుపుతున్నా సార్
సీఎం: గతంలో ఎలాగుండేది?
జగదీశ్: రోడ్లన్నీ గుంతలుగా ఉండేవి సార్. గ్రావెల్స్ రోడ్లు, రోడ్డుపై వెళ్లేటప్పుడు ఆటోకు ప్రతిసారీ రిపేర్లే, ఇప్పుడు అలాంటివేమీ లేవు. సీసీరోడ్లు వేశారు. కరెంటు రెగ్యులర్‌గా ఉంటుంది. పైపులైను వేశారు. అంతా బాగుంది సార్.
సీఎం: ఆటోలన్నింటినీ ఎలక్ట్రికల్ వెహికల్స్‌గా మారిస్తే బాగుంటుంది కదా.. ఇంట్లోనే చార్జింగ్ చేసుకోవచ్చు.
జగదీశ్: అవును సార్. మాకు మంచి ఆదాయం వస్తుంది.
సీఎం: మనమిత్ర యాప్ తెలుసా? అది ఎలా పనిచేస్తుందో తెలుసా?
జగదీశ్ : కొంచెం తెలుసు.
సీఎం: మనమిత్ర యాప్‌లో అన్ని వివరాలు ప్రభుత్వం పొందుపరిచింది. డ్రైవింగ్ లైసెన్సుతో పాటు సర్టిఫికెట్లు, మీ ఇంటి నుంచే పొందవచ్చు
జగదీశ్ : సార్ మీరు యువతకు రోల్‌మోడల్.
సీఎం: ఆన్‌లైన్ కోర్సులు పెడుతున్నాం. నువ్వు ఆటో నడుపుతూ కూడా చదువుకునే అవకాశంఉంది. స్టీలు ప్లాంటు ఇక్కడికి వస్తే ఎలాగుంటుంది.?
జగదీశ్ : స్టీలు ప్లాంటు వస్తే ఈ ప్రాంతమంతా పూర్తిగా అభివృద్ధి అవుతుంది సార్.
( ప్రజావేదిక రావడంతో ఆటో ఆగడంతో చంద్రబాబు దిగారు. ఆయనకు చంద్రబాబు డబ్బు (ఆటోబాడుగ) ఇచ్చారు.
Updated Date - Aug 02 , 2025 | 04:47 AM