ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: జనమే బలం

ABN, Publish Date - Jul 12 , 2025 | 04:18 AM

జనమే బలమని, జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మొదటి అమరావతి సమ్మిట్‌కు ఆయన హాజరయ్యారు.

  • రాష్ట్రంలో జనాభా వృద్ధికి మంచి పాలసీ తెస్తాం

  • దేశమంటే మనుషులోయ్‌ అన్న గురజాడే స్ఫూర్తి

  • జనాభా ఇకముందు దేశానికి భారం కాదు.. ఆస్తి

  • ఆనాడు కుటుంబ నియంత్రణను ప్రోత్సహించా..

  • జనాభాను వృద్ధిచేయాలని నేడు నేనే చెబుతున్నా

  • అధిక జనాభా ఉన్న దేశాలవైపు ప్రపంచం చూపు

  • ఆఫీసుల్లో చైల్డ్‌కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తాం

  • ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ఊతమిస్తాం

  • జనాభా దినోత్సవ సదస్సులో చంద్రబాబు వెల్లడి

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): జనమే బలమని, జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీ తీసుకొస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా శుక్రవారం వెలగపూడి సచివాలయంలో నిర్వహించిన మొదటి అమరావతి సమ్మిట్‌కు ఆయన హాజరయ్యారు. ‘జనాభా నిర్వహణ విధానం- ప్రతి కుటుంబం ముఖ్యం - మీ అభిప్రాయం మార్గదర్శనం’ అనే భావనతో రూపొందించిన సర్వేను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశమంటే మట్టికాదోయ్‌ దేశమంటే మనుషులోయ్‌ అని చెప్పిన గురజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. ‘ఒకప్పుడు నేను కుటుంబ నియంత్రణను ప్రోత్సహించాను. ఇప్పుడు జనాభా వృద్ధి కావాలని కోరుతున్నాను. దేశానికి బలమైన ఆర్థిక వనరు జనాభాయే. జనాభా నియంత్రణపై కాదు.. నిర్వహణపై దృష్టి సారించాలి. జనాభాను భారంగా కాకుండా ఆస్తిగా భావించే కాలం వచ్చింది.’’ అని చంద్రబాబు తెలిపారు. వికసిత భారత్‌ -2047, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు జనాభా పెరుగుదల ఎంతో కీలకమన్నారు. రాబోయే 20 ఏళ్లలో వచ్చే పెనుమార్పులకు అంతా సిద్ధంగా ఉండాన్నారు. అభివృద్ధి ఉన్న చోటుకు ప్రజలు ఎలా వలస వస్తారనడానికి హైదరాబాద్‌ ఒక ఉదాహరణగా పేర్కొన్నారు. ఇంకా ఏమన్నారంటే...

చైనానూ వెనక్కునెట్టాం

‘‘జనాభా ఎప్పటికీ భారం కాదు. అదే మనకు తిరుగులేని ఆస్తి. 140 కోట్ల జనాభాతో మన దేశం చైనాను వెనక్కు నెట్టింది. అయితే, ప్రపంచవ్యాప్తంగా జనాభాతోపాటు జననాల రేటు కూడా తగ్గిపోతోంది. యువశక్తి తగ్గిపోయి వృద్ధులు పెరుగుతున్నారు. ఏ దేశంలో వయోజన సమస్య వస్తుందో అక్కడ వృద్ధిరేటు నిలిచిపోతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, పిల్లలను కనేవారికి కొన్ని దేశాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. జపాన్‌లో పిల్లలు స్కూల్‌కు వెళ్లేవరకు చైల్డ్‌ కేర్‌ సేవలను అందించడంతోపాటు చదువుకు ఆర్థిక సాయం లేదా ఉచిత విద్య అందిస్తున్నారు. ఎక్కువ మంది పిల్లలుంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థికసాయంతోపాటు తక్కువకు ఇల్లు అద్దెకు ఇస్తున్నారు. దక్షిణ కొరియాలో నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు అందించడంతోపాటు వివాహం, కాన్పులకు సాయం చేస్తున్నారు. సింగపూర్‌లో బేబీ బోనస్‌ స్కీమ్‌ కింద పుట్టిన ప్రతి శిశువుకు కొంత నగదు అందిస్తున్నారు. మ్యాచ్‌ సేవింగ్స్‌ కింద ప్రభుత్వ సొమ్మును జోడించి పిల్లల ఖాతాల్లో వేస్తున్నారు. రష్యాలో రెండో బిడ్డను కంటే ఫ్రీ హెల్త్‌కేర్‌ కింద గర్భిణీలకు ఉచిత వైద్యం అందిస్తున్నారు. హంగరీలో నలుగురి కంటే ఎక్కువ పిల్లలు ఉన్న వారికి జీవితాంతం ఆదాయ పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నారు. చైనాలో ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే రూ.12 లక్షలు సాయం చేస్తున్నారు. మన వద్ద ఖర్చులు పెరుగుతున్నాయని పిల్లల్ని కనడానికి ఎక్కువమంది ఇష్టపడటం లేదు. ఈ పరిస్థితి మారాలి. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. కుటుంబ వ్యవస్థ మనకు వారసత్వంగా వచ్చింది. గత కొన్నేళ్ల వరకు ఇంట్లో ప్రతి ఒక్కరికీ 5 కేజీలు చొప్పున బియ్యం ఇచ్చేవాళ్లం. ఐదుగురు ఉంటే 25 కేజీలు ఇచ్చేవాళ్లం. అంతకంటే ఎక్కువ మంది ఉంటే బియ్యం ఇచ్చేవాళ్లం కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఒక కుటుంబంలో పది మంది ఉన్నా 50 కేజీల కంటే ఎక్కువ ఇచ్చే దానిపై ఆలోచిస్తున్నాం. నేను మహిళా పక్షపాతిని. ఇంటికే పరిమితమైన మహిళల కోసం నేను డ్వాక్రా, మెప్మా సంఘాలు పెట్టి ఆర్థిక చేయూత అందించాను. నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేటప్పుడు పడిన కష్టం చూసి ఏ ఆడబిడ్డకు అలాంటి కష్టం రాకూడదని దేశంలోనే మొదటిసారిగా దీపం పథకం కింద ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇచ్చాం.

కుప్పంలో తొలి జనాభా నిర్వహణ సంస్థ..

కుప్పంలో మైనా మహిళా ఫౌండేషన్‌ అనే సంస్థ జనాభా నిర్వహణ కోసం పనిచేస్తోందని సీఎం తెలిపారు. ఇలాంటి సంస్థ రాష్ట్రంలోనే మొదటిదని తెలిపారు. కార్యక్రమంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ మహేంద్రదేవ్‌, ఉన్నతాధికారులు పీయూశ్‌ కుమార్‌, ఎంటీ కృష్ణబాబు, సూర్యకుమారి, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్‌ కుమార్‌, రామాంజనేయులు, మైనా మహిళా ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు సుహానీ జలోటా, పబ్లిక్‌ హెల్త్‌ స్పెషలిస్ట్‌ ఎమ్‌.ప్రకాశమ్మ, సంజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సర్వేలో ఇద్దరు పిల్లలకే అత్యధికుల ఓటు

శుక్రవారం సచివాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో ‘జనాభా నిర్వహణ విధానం... ప్రతి కుటుంబం ముఖ్యం... మీ అభిప్రాయం మార్గదర్శనం’ అనే కాన్సె్‌ప్టతో సర్వేను ప్రారంభించారు. హాజరైన వారికి అక్కడి టేబుళ్లపై ఉంచిన క్యూఆర్‌ కోడ్‌ను తమ సెల్‌ఫోన్‌లో స్కాన్‌ చేయాలని సూచించారు. స్కాన్‌ చేయగానే.. తెలుగు, ఇంగ్లీషు భాషల్లో కనిపించిన 9 ప్రశ్నలకు సమాధానాలు పూర్తి చేయాలన్నారు. అలా సభికుల నుంచి సేకరించిన అభిప్రాయాలను సీఎం సభాముఖంగా వెల్లడించారు. ఈ సర్వే సందర్భంగా ఇద్దరు పిల్లలుండాలని 67.41 శాతం మంది, ఒక్కరే ఉండాలని 12.34శాతం, ముగ్గురు ఉండాలని 19.88 శాతం మంది అభిప్రాయపడ్డారని సీఎం వివరించారు.

జనాభాపై ఏపీ ఆలోచనలు భేష్‌

మహేంద్ర దేవ్‌

జనాభా నిర్వహణ పాలసీ విషయంలో ఏపీ ఆలోచనలు వినూత్నంగా ఉన్నాయని ప్రధాని ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ మహేంద్రదేవ్‌ సంతృప్తి చేశారు. ఏపీ పాలసీని పరిశీలించి దేశవ్యాప్తంగా అమలుకు ప్రయత్నిస్తామన్నారు. ‘ఏ దేశానికైనా జనాభా పెద్ద పెట్టుబడి. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని స్మార్ట్‌ పాపులేషన్‌ స్ట్రాటజీలను అమలు చేయాలి. ఈ విషయంలో చంద్రబాబు చాలా ముందుచూపుతో వ్యవహరిస్తున్నారు. జనాభా పాలసీలో ఏపీని మోడల్‌గా నిలిపారు. దేశానికి మార్గదర్శకంగా నిలిచారు.’ అని మహేంద్రదేవ్‌ ప్రశంసించారు.

ఏఐ, క్వాంటమ్‌ల కంటే మనిషే గొప్ప

మానవ వనరును మించిన సంపద లేదు: సీఎం

మనిషి సృజనాత్మకతను భర్తీ చేసే సాంకేతికత ఎప్పటికీ రాలేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తొలి అమరావతి సమ్మిట్‌లో భాగంగా పలువురు సభికులతో ఆయన కాసేపు మాట్లాడారు.

డి. రామకృష్ణ (సోషల్‌ టీచర్‌, బాపట్ల జిల్లా): జనాభా పెరిగితే మన దేశ సంపద అందరికీ సరిపోతుందా? పెరుగుతున్న టెక్నాలజీ వల్ల అందరికీ ఉపాధి సాధ్యమా?

సీఎం: మానవ వనరుల గొప్పతనంపై బిల్‌ గేట్స్‌ ఓ మంచి విషయం చెప్పారు. ‘ఇంకా వంద సంవత్సరాలు అయినా మానవవనరులను రీప్లేస్‌ చేసే సాంకేతికత రాదు. ఏఐ వస్తుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వస్తుంది. కానీ సృజనాత్మకత అనే సాంకేతికత మాత్రం రాదు’ అన్నారు. మానవ వనరులతో ఎంత సంపద అయినా సృష్టించవచ్చు, అసలు జనాభానే లేకుండా నియంత్రించుకుంటూ పోతే కొత్త ఆవిష్కరణలు ఎవరి కోసం చేయాలి?

శేఖర్‌ (ప్రభుత్వ టీచర్‌): నా కుమారుడితోపాటు కోడలు కూడా ఉద్యోగం చేసేది. పాప పుట్టిన తర్వాత ఉద్యోగానికి ఆమె రాజీనామా చేసింది. పాపను చూసేవారు లేక ఈ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా సర్‌?

సీఎం: సమాజంలో చాలామంది సంపాదించింది ఇతరులతో పంచుకోవాల్సి వస్తోందనే కారణంగా విడిపోతున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కోసం కూడా మరికొందరు విడిపోతున్నారు. దీనిపై ఆలోచన చేస్తాం. ఎక్కువ మంది పిల్లల్ని కనే వారికి ప్రోత్సాహకాలు ఇస్తాం.

మంజులవాణి (మహిళా శిశుసంక్షేమ శాఖ ఉద్యోగిని, అనకాపల్లి): గతంలో ఎంతమంది పిల్లలు అని అడిగేవారు తప్ప ఎంత ఆస్తి ఉందని అడిగేవారు కాదు,. ఇప్పుడు మళ్లీ ఆ పరిస్థితిని రాష్ట్రంలో చూడగలమా?

సీఎం: మన పెద్దలు పిల్లలను సంపదగా భావించేవారు. ఎన్టీఆర్‌ తాతమ్మ కల అని ఓ సినిమా తీశారు. ఎంత మంది ఎక్కువ పిల్లలు ఉంటే అంత ఆనందం ఉంటుందని చూపారు.

సుమిత్ర (దివ్యాంగురాలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, కంచికచర్ల): నేను ఎస్వీ యూనివర్సిటీ నుంచి ఎంఏ ఇంగ్లిషు చేశాను. నాకు కంటి చూపు సమస్య ఉన్నా చంద్రబాబు స్ఫూర్తితో ఉన్నతస్థానానికి రావాలని తపించి ఇప్పుడు అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ స్థాయికి చేరుకున్నాను. ఉమ్మడి కుటుంబం ఉన్నత కుటుంబం, పెద్ద కుటుంబం ప్రేమగల కుటుంబం అనే నినాదాలతో జనాభా నిర్వహణ కార్యక్రమాన్ని ప్రచారం చేయాలి సర్‌..

సీఎం: అలాగే చేద్దాం.

Updated Date - Jul 12 , 2025 | 07:36 AM