Delhi Visit: 15, 16 తేదీల్లో సీఎం ఢిల్లీ పర్యటన
ABN, Publish Date - Jul 13 , 2025 | 03:20 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశం కానున్నారు.
అమిత్‌షాతో సహా పలువురు కేంద్రమంత్రులతో భేటీ
బనకచర్లపై జలశక్తి మంత్రితో సమావేశం
అమరావతి, జూలై 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళుతున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో సీఎం సమావేశం కానున్నారు. రాష్ట్రంలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించిన అంశాలను ఆయా మంత్రిత్వ శాఖలతో సీఎం చర్చించనున్నారు. 15వ తేదీ ఉదయం అమరావతి నుంచి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు అదే రోజు మధ్యాహ్నం కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో భేటీ కానున్నారు. అదే రోజు కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్, ఢిల్లీ మెట్రో రైల్ ఎండీ డాక్టర్ వికాస్ కుమార్‌తో ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. సాయంత్రం 4.30కు ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం లైబ్రరీలో జరగనున్న మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించనున్నారు. 16న కేంద్ర కార్మిక ఉపాధి కల్పనా మంత్రి మన్సుఖ్ మాండవీయతో సీఎం సమావేశమవుతారు. అనంతరం నార్త్ బ్లాక్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు, వాటికి అవసరమైన నిధులు, పోలవరం - బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై ఆయనతో చర్చించనున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సాయంత్రం భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించే బిజినెస్ కాన్ఫరెన్స్‌కు సీఎం హాజరవుతారు. 17 ఉదయం 9.30కు సీఎం ఢిల్లీ నుంచి అమరావతి బయలుదేరి వస్తారు.
Updated Date - Jul 13 , 2025 | 03:24 AM