CM Chandrababu: గ్రీన్‌ట్యాక్స్ తగ్గింపునకు కట్టుబడి ఉన్నాం
ABN, Publish Date - Jul 09 , 2025 | 06:58 AM
ఎన్నికల హామీల్లో భాగంగా ఏడేళ్ల కాలపరిమితి దాటిన రవాణా వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్ తగ్గింపు నిర్ణయానికి కట్టుబడి వెంటనే జీవో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు.
త్వరలోనే జీవో విడుదల: ముఖ్యమంత్రి చంద్రబాబు
విజయవాడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల హామీల్లో భాగంగా ఏడేళ్ల కాలపరిమితి దాటిన రవాణా వాహనాలపై గ్రీన్‌ట్యాక్స్ తగ్గింపు నిర్ణయానికి కట్టుబడి వెంటనే జీవో విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ది కృష్ణా డిస్ర్టిక్ట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు నాగుమోతు రాజా, ఆంధ్రప్రదేశ్ లారీఓనర్ల సంఘం అధ్యక్షుడు పి.గోపాల్‌నాయుడు, ఆలిండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ కాంగ్రెస్ సౌత్‌జోన్ ఉపాధ్యక్షుడు వై.వి.ఈశ్వరరావు సచివాలయంలో సీఎం చంద్రబాబుకు రవాణా సమస్యలపై మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా హరిత పన్ను తగ్గింపుపై ప్రభుత్వ ఉత్తర్వులను వెంటనే విడుదల చేయాలంటూ అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రవాణా సమస్యల సత్వర పరిష్కారానికి ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటు చేస్తామని లారీ ఓనర్లకు హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వ గ్రాంటుతో ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లను ఏర్పరచి, రాష్ట్రప్రభుత్వమే నడిపితే ఫిట్‌నెస్ ఫీజుల రూపంలో ప్రభుత్వానికి కోట్లలో ఆదాయం అందుతుందని వారు ముఖ్యమంత్రికి వెల్లడించారు. ఈ సెంటర్లను ప్రైవేటీకరించకుండా ప్రభుత్వమే నిర్వహించాలని వారు కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రవాణారంగ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా అంబుడ్స్‌మన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని లారీ ఓనర్ల సంఘం ప్రతినిధులు సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య 11 సంవత్సరాలుగా నిలిచిపోయిన కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల జారీ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
Updated Date - Jul 09 , 2025 | 06:59 AM