CM Chandrababu : కబ్జాలకు కళ్లెం!
ABN, Publish Date - Mar 06 , 2025 | 03:51 AM
ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టంతో రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జగన్ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు జరిగాయని..
భూ ఆక్రమణలపై ఉక్కుపాదం.. నిషేధ బిల్లు ఆమోదించండి.. అమిత్‌షాకు చంద్రబాబు వినతి
నిర్మల, నితిన్ గడ్కరీలతోనూ భేటీ
అమరావతికి 8 వరుసల ఓఆర్‌ఆర్‌ను ఆమోదించాలని అభ్యర్థన
నదుల అనుసంధానానికి కేంద్ర సహకారం కోరిన సీఎం
అభివృద్ధి, ఆదాయం, సంపద సృష్టి.. సంక్షేమం.. ఇదే మా విధానం
పోలవరం-బనకచర్ల అనుసంధానంలో వేరే రాష్ట్రాల పాత్ర లేదు
ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు వచ్చాక పీడీ కేసులు
ప్రతి పది కేసుల్లో ఆరు భూ వివాదాలవే: సీఎం
న్యూఢిల్లీ, మార్చి 5 (ఆంధ్రజ్యోతి): ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ నిషేధం చట్టంతో రాష్ట్రంలో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. జగన్ ఐదేళ్ల పాలనలో విచ్చలవిడిగా భూ ఆక్రమణలు జరిగాయని, చివరికి అటవీ భూములను సైతం వదల్లేదని చెప్పారు. ప్రైవేటు భూములను బలవంతంగా 22ఏ జాబితాలో చేర్చారని విమర్శించారు. ల్యాండ్ గ్రాబింగ్ బిల్లును అసెంబ్లీ, మండలి ఆమోదించాయని.. కేంద్రం కూడా ఆమోదముద్ర వేయాలని కోరారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సీఎం భేటీ అయ్యారు. దేశ, రాష్ట్ర రాజకీయాలు, ఎన్డీఏ పాలన, ఆంధ్రప్రదేశ్‌కు చేయూత తదితర అంశాలపై గంటకు పైగా చర్చించారు. తర్వాత ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. అనంతరం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో.. కేంద్ర మంత్రులతో చర్చించిన అంశాలను వివరించారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ ఆక్రమణలు, అక్రమాలు, దందాను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని పది కేసులు నమోదైతే అందులో 6 కేసులు భూ వివాదాలకు సంబంధించినవే ఉంటున్నాయని చెప్పారు. భూ వివరాల కంప్యూటరీకరణ ప్రక్రియలో సరైన తనిఖీ, నియంత్రణ లేకపోవడం వల్ల పెద్దఎత్తున అక్రమాలు జరిగాయని, ప్రైవేటు భూములను కూడా 22ఏ కింద చేర్చారని అన్నారు.
రాష్ట్రంలో గంజాయి రవాణాపై చర్యలు తీసుకుంటున్నట్లు అమిత్ షా దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. గంజాయి సాగును సమర్థంగా నియంత్రించేందుకు ఈగల్ దళాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించగా, అమిత్ షా ప్రశంసించారని తెలిపారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలపై ఆయనతో చర్చించానని, ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీఏ ఎలా ముందుకెళ్లాలనే అంశం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందన్నారు. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ బిల్లు అంశంపై చర్చ జరిగిందన్నారు. గుజరాత్‌లో ఇదే తరహా బిల్లును విజయవంతంగా అమలు చేశారని, ఏపీ బిల్లును కూడా త్వరగా ఆమోదించాలని కోరినట్లు చెప్పారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మరో బిల్లు తీసుకొస్తున్నామన్నారు. రెండు బిల్లుల గురించి చర్చించానని, అమిత్ షా సానుకూలంగా స్పందించారని తెలిపారు.
ఆర్థిక పునరుజ్జీవనానికి చేయూతనివ్వండి...
అభివృద్ధి, సంపద సృష్టి, ఆదాయం పెంపొందించడం, సంక్షేమం అనేది తమ ప్రభుత్వ విధానమని సీఎం పునరుద్ఘాటించారు. ‘సంపద సృష్టించలేని వాడికి సంక్షేమం పేరుతో పంపకం చేసే హక్కు లేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో చర్చించా. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల రుణాలు, బకాయిల భారం తమపై మోపిన విషయాన్ని వివరించా. జగన్ ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని, అయినప్పటికీ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వృద్ధి రేటు ఎలా పుంజుకుందో తెలియజెప్పా. మొత్తమ్మీద వృద్ధి రేటు 12.94 శాతం ఉంటే అందులో ఒక్క వ్యవసాయ రంగంలోనే 15.86 శాతం వృద్ధిని నమోదు చేశాం. సేవా రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రుణాలపై ఆధారపడకుండా సంపదను సృష్టించడానికి స్థిరంగా 15 శాతం వృద్ధి రేటు సాధించాలి’ అని స్పష్టం చేశారు.
నదుల అనుసంధానంతో నీటి భద్రత...: జలవనరుల నిర్వహణ తమ చర్చల్లో మరో ముఖ్యమైన అంశమని ముఖ్యమంత్రి తెలిపారు. ‘వంశధార-నాగావళి, గోదావరి-కృష్ణా-పెన్నా నదులతోపాటు పోలవరం నుంచి గోదావరి జలాలను బనకచర్లకు అనుసంధానించాలని కేంద్రానికి ప్రతిపాదించాను. రాజమండ్రి దాటిన తర్వాత గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి.
ప్రస్తుతం వృథాగా పోతున్న 200 టీఎంసీల నీటిని వ్యవసాయం, తాగునీటి అవసరాలకు మళ్లించవచ్చు. దీనివల్ల అనేక ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయి. ఈ నదుల అనుసంధానంలో వేరే రాష్ట్రాల పాత్ర, ప్రమేయం ఏదీ లేదు’ అని తేల్చిచెప్పారు.
జాతీయ రహదారులకు సహకారం..
189 కి.మీ. విస్తీర్ణంలో ఉన్న అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేపట్టి పూర్తి చేయాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరినట్లు సీఎం తెలిపారు. హైదరాబాద్ ఓఆర్‌ఆర్ తన ఆలోచనేనన్నారు. అదిప్పుడు ఎంతగా ఉపయోగపడుతుందో అందరికీ తెలుసన్నారు. ‘హైదరాబాద్ ఓఆర్‌ఆర్ తరహాలోనే అమరావతికీ ఎనిమిది వరుసల ఓఆర్‌ఆర్ అవసరమని కేంద్ర మంత్రిని కోరా. జాతీయ రహదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని చెప్పా. తమ వైపు నుంచి కూడా వేగంగా చర్యలుంటాయని గడ్కరీ హామీ ఇచ్చారు. విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డుపైనా చర్చించాం. శ్రీశైలం వద్ద ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడానికి ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణం సహా వివిధ పరిష్కార మార్గాలను ప్రతిపాదించాను. అమరావతి నుంచి వినుకొండ రోడ్డుతోపాటు కోస్టల్ హైవేపై చర్చించా. వైజాగ్ నుంచి మూలపేటకు తీరప్రాంత రహదారి ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ నుంచి మచిలీపట్నం పోర్టుకు నేరుగా రహదారి నిర్మించే అంశాన్ని పరిశీలించాలి. ఇది ఏపీతోపాటు తెలంగాణకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అన్నింటికీ డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. ఆ తర్వాత టెండర్లు పిలుస్తాం. కొన్నిటికి టన్నెళ్ల నిర్మాణం, అటవీ అనుమతులు వంటివి అవసరం ఉన్నాయి. వాటిపై కేంద్ర మంత్రితో చర్చించా’ అని వివరించారు. ఆయన వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర సహాయ మంత్రులు శ్రీనివాస వర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సీఎం రమేశ్, దగ్గుమళ్ల ప్రసాదరావు ఉన్నారు. నిర్మలా సీతారామన్‌ను కలిసిన వారిలో రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఉన్నారు.
Updated Date - Mar 06 , 2025 | 03:52 AM