Banakacharla Lift Irrigation: ఢిల్లీకి బనకచర్ల
ABN, Publish Date - Jul 15 , 2025 | 06:32 AM
తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్రం సమాయత్తమైంది. తమ తమ ఎజెండాలతో ఢిల్లీ రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలను...
రేపు చంద్రబాబు, రేవంత్‌తోకేంద్ర జలశక్తి మంత్రి భేటీ
గోదావరి-బనకచర్ల అనుసంధానమే ప్రధానాంశం
ఎజెండాతో రావాలని ఇద్దరు సీఎంలకూ సూచన
సీఎస్‌లకు సమాచారం
ట్రైబ్యునళ్ల తీర్పులు, వాప్కోస్ నివేదిక కేంద్రం ముందు ఉంచేందుకు రాష్ట్రం సన్నద్ధం
200 టీఎంసీలు వాడటం వల్ల తెలంగాణకు నష్టం లేదని పునరుద్ఘాటన
అమరావతి, జూలై 14 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల మధ్య నదీ జలాల హక్కులపై నెలకొన్న వివాదాలు, సమస్యల పరిష్కారానికి కేంద్రం సమాయత్తమైంది. తమ తమ ఎజెండాలతో ఢిల్లీ రావాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్‌రెడ్డిలను కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ కోరారు. బుధవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు జలశక్తి భవన్‌లో వారిద్దరితో ఆయన సమావేశం కానున్నారు. ఈ మేరకు ఉభయ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు విజయానంద్, రామకృష్ణారావులకు జలశక్తిశాఖ నుంచి సమాచారం అందింది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మంగళవారం ఢిల్లీ వెళ్తున్నారు. రాత్రికి అక్కడే బసచేసి బుధవారం రేవంత్‌రెడ్డితో కలసి సీఆర్ పాటిల్‌ను కలుస్తారు. ఈ భేటీలో పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకమే ప్రధానాంశం కానుంది. గోదావరి నుంచి కడలిపాలయ్యే వరద జలాల్లో 200 టీఎంసీలను రోజుకు రెండు టీఎంసీల చొప్పున 100 రోజుల పాటు ఎత్తిపోసి బనకచర్ల హెడ్ రెగ్యులేటర్‌కు తరలిస్తామని ఏపీ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. రూ.81,900 కోట్ల అంచనా వ్యయంతో కేంద్ర జల సంఘానికి ముందస్తు సాధ్యాసాధ్యాల నివేదిక(పీఎ్‌ఫఆర్)ను కూడా అందజేసింది.
తెలంగాణ ప్రభుత్వం, అక్కడి పార్టీలు ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో.. కేంద్ర పర్యావరణ, అటవీశాఖకు చెందిన నిపుణుల మదింపు కమిటీ (ఈఏసీ) ఈ ప్రాజెక్టు ప్రతిపాదనను వెనక్కి పంపింది. వరద జలాల అందుబాటుపై కొర్రీవేసింది. ఈ నేపథ్యంలో ఏపీ తన వాదనలను జలశక్తి శాఖ ముందుంచనుంది. గోదావరి, కృష్ణా ట్రైబ్యునళ్ల తీర్పులను సమర్పించనుంది. తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ నీటి ప్రాజెక్టుల గురించీ ప్రస్తావించే అవకాశముంది. ఇంకోవైపు.. బనకచర్ల ప్రాజెక్టుపైన, కేంద్రం లేవనెత్తిన సందేహాలపైన కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వాప్కోస్ రాష్ట్రప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. గడచిన 15 ఏళ్ల లెక్కలు చూస్తే.. గోదావరి నుంచి ఏటా 2,842 టీఎంసీల వరద జలాలు సముద్రంలోకి పోతున్నట్లు పేర్కొంది. అందులో కేవలం 200 టీఎంసీలను సద్వినియోగం చేసుకోవడం వల్ల ఎగువన ఉన్న తెలంగాణకు ఎలాంటి నష్టమూ లేదని సీఎం చంద్రబాబు ఇప్పటికే స్పష్టంచేశారు. బుధవారం కూడా ఇదే పునరుద్ఘాటించనున్నారు. వాప్కోస్ రిపోర్టును పాటిల్‌తో జరిగే సమావేశంలో సమర్పించనున్నారు.
Updated Date - Jul 15 , 2025 | 06:36 AM