ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Chandrababu: అమరావతిపై కక్షతో.. సింగపూర్‌పై బురద

ABN, Publish Date - Jul 25 , 2025 | 03:14 AM

రాజధాని అమరావతిపై కక్షతో జగన్‌ సింగపూర్‌పైనా బురదచల్లారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు సింగపూర్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు.

  • జగన్‌ నిర్వాకం వల్ల ఆ దేశంతో సంబంధాలు దెబ్బతిన్నాయ్‌: సీఎం

  • అవినీతిరహిత దేశాల్లో సింగపూర్‌ది మూడో స్థానం

  • అలాంటి దేశంపై స్వార్థరాజకీయంతో ఆరోపణలు

  • సత్సంబంధాల పునరుద్ధరణకే అక్కడికి వెళ్తున్నా

  • రాష్ట్రంలో పెట్టుబడులకు వారిని ఆహ్వానిస్తాం

  • వైసీపీ ఎన్ని తప్పుడు మెయిల్స్‌ పంపినా రూ.9 వేల కోట్లు సేకరించాం

  • ఆ పార్టీ కుట్రలను ఇన్వెస్టర్లు నమ్మడం లేదు

  • అక్రమ కట్టడాలను నిర్మించేటప్పుడే కూల్చేయాలి

  • అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • మంత్రివర్గ సహచరులతో చంద్రబాబు

వైసీపీ హయాంలో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది భయపడ్డారు. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పెట్టుబడిదారులనూ జగన్‌ వెళ్లగొట్టారు. అలాంటి వారిలో లులూ గ్రూప్‌, అపోలో టైర్స్‌ కూడా ఉన్నాయి.

- క్యాబినెట్‌ భేటీలో చంద్రబాబు

అమరావతి: రాజధాని అమరావతిపై కక్షతో జగన్‌ సింగపూర్‌పైనా బురదచల్లారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఇప్పుడు సింగపూర్‌తో సంబంధాలు పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో చంద్రబాబు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘రాష్ట్రం విడిపోయినప్పుడు విభజిత రాష్ట్రానికి అన్ని వనరులతో రాజధాని నిర్మించాలని తాపత్రయపడ్డాం. సింగపూర్‌ వంటి దేశాల సలహాలు, సూచనలు కోరాం. మనం చూపిన చొరవతో సింగపూర్‌ ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో సీడ్‌ కేపిటల్‌ను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ముందుకొచ్చింది. ఆ తర్వాత వచ్చిన జగన్‌ ప్రభుత్వం అవినీతి ముద్ర వేసి దానిని వెళ్లగొట్టింది. ఈ పరిణామంతో అంతర్జాతీయంగా తమ ప్రతిష్ఠకు భంగం కలిగిందని సింగపూర్‌ ప్రభుత్వం ఆవేదన చెందింది. ఇలాంటి పరిణామాలు రాష్ట్ర ఇమేజ్‌నూ దెబ్బతీస్తాయి. జగన్‌ నిర్వాకంతో దెబ్బతిన్న రాష్ట్ర ఇమేజ్‌ను సరిచేయడంతోపాటు సింగపూర్‌ ప్రభుత్వంతో సంబంధాలను పునరుద్ధరించుకోవాలన్న ఉద్దేశంతో సింగపూర్‌ పర్యటనకు వెళ్తున్నాం’ అని సీఎం చంద్రబాబు వివరించారు.

ప్రధానంగా రాజధాని నిర్మాణంలో సింగపూర్‌ సహకారం, ఏపీఎండీసీ బాండ్లు ఎవరూ కొనకుండా వైసీపీ పన్నిన కుయుక్తుల గురించి సహచరులకు ఆయన వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని.. సీడ్‌ కేపిటల్‌ తప్ప ఏ ప్రాంతంలోనైనా అభివృద్ధి ప్రాజెక్టుల్లో భాగస్వాములయ్యేందుకు సింగపూర్‌ ప్రభుత్వం సుముఖంగా ఉందని చెప్పారు. సీడ్‌ కేపిటల్‌పై సింగపూర్‌ ఎందుకు విముఖత చూపుతోందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ప్రశ్నించినప్పుడు సీఎం జవాబిస్తూ.. ‘అవినీతిరహిత దేశాల జాబితాలో సింగపూర్‌ 3వస్థానంలో ఉంది. అలాంటి దేశంపై జగన్‌ ప్రభుత్వం అవినీతి ముద్ర వేసింది. అమరావతిపై కక్షతో సీడ్‌ కేపిటల్‌ విషయంలో ఆ దేశ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించడంతో అటువైపు రావడానికి వారు సుముఖత చూపడం లేదు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం సుముఖంగా ఉన్నారు. నా పర్యటనలో పెట్టుబడులు పెట్టేందుకు వారిని ఆహ్వానిస్తా’ అని తెలిపారు.

వైసీపీ కుట్రలు విఫలం..

ఏపీ బ్రాండ్‌ పునరుద్ధరణలో కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌ వెళ్లగొట్టిన పెట్టుబడిదారులందరిలో నమ్మకం పెంచి.. తిరిగి తీసుకొస్తున్నామని తెలిపారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ఎవ్వరూ నమ్మడం లేదని.. ఏపీఎండీసీ బాండ్లకు వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనమని తెలిపారు.

భవన క్రమబద్ధీకరణపై చట్టం..

ఎల్‌ఆర్‌ఎ్‌స(ల్యాండ్‌ రెగ్యులరైజేషన్‌ స్కీం) విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకున్నా.. బీపీఎ్‌స(బిల్డింగ్‌ పీనలైజేషన్‌ స్కీం) విషయంలో మరింత అధ్యయనం చేయాలని కేబినెట్‌లో నిర్ణయించారు. బీపీఎ్‌సను అమలు చేస్తే అక్రమంగా భవన నిర్మాణాలు చేసే వారిలో భయం ఉండదని, తన నియోజకవర్గ పరిధిలో 160 గజాల్లో ఆరు అంతస్థులు కట్టేశారని, ఇలాంటి వాటికి బీపీఎస్‌ ద్వారా లబ్ధి చేకూరితే అక్రమ కట్టడాలను ప్రభుత్వమే ప్రోత్సహించినట్లు అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ వ్యాఖ్యానించారు. దీనికి సీఎం కూడా అంగీకరించారు. పకడ్బందీగా అధ్యయనం చేయాలని.. మనం అమలు చేసేదే చివరి బీపీఎస్‌ కావాలని చెప్పారు.

రాష్ట్రంలో ఇల్లులేని పేదలు ఉండకూడదని సీఎం స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం పేదలకు సెంటు పట్టాల పేరుతో వారిని దగా చేసి కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడిందని కానీ మనం పేదలు గౌరవప్రదంగా ఉండేందుకు గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు స్థలాన్ని ఇద్దామని.. ఈ దిశగా మంత్రులు దృష్టి సారించాలని సూచించారు. వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాల అభివృద్ధిపై దృష్టిపెట్టాలని దిశానిర్దేశం చేశారు. ఆయా జిల్లాల్లో వనరుల ఆధారంగా ప్రాజెక్టులు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేయాలన్నారు. క్వాంటమ్‌ వ్యాలీ మాదిరి గ్రీన్‌ హైడ్రోజన్‌ వ్యాలీలో కూడా రాష్ట్రం అందరికంటే ముందుండాలని, ఇలాంటి విషయాలపై మంత్రులు తాజా సమాచారంతో అప్‌డేట్‌గా ఉండాలని సూచించారు.

‘హరిహర వీరమల్లు’ విజయంపై పవన్‌ కల్యాణ్‌కు అభినందనలు

మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత సహచర మంత్రులతో కలిసి చంద్రబాబు భోజనం చేశారు. భేటీకి ముందు డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ను పిలిచి మరీ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చి అభినందించారు. ఆయన నటించిన ‘హరిహరవీరమల్లు’ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని ప్రశంసించారు. లోకేశ్‌ కూడా సినిమా విజయంపై అభినందనలు తెలుపడంతో పవన్‌ కల్యాణ్‌ ఆయన్ను ఆలింగనం చేసుకుని కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jul 25 , 2025 | 09:04 AM