AP Govt: ఏపీలోనూ స్వచ్ఛత అవార్డులు
ABN, Publish Date - Jul 15 , 2025 | 05:13 AM
స్వచ్ఛ భారత్ తరహాలోనే రాష్ట్రంలోనూ స్వచ్ఛత అవార్డులు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
వ్యర్థరహితంగా ‘కుప్పం’ మోడల్ ప్రాజెక్టు
స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై సమీక్షలో చంద్రబాబు
అమరావతి, జూలై 14(ఆంధ్రజ్యోతి): స్వచ్ఛ భారత్ తరహాలోనే రాష్ట్రంలోనూ స్వచ్ఛత అవార్డులు అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర సాధనకు వీలుగా స్థానికసంస్థల మధ్య బలమైన పోటీ ఉండేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. దీని కోసం ఒక స్వతంత్ర సంస్థతో మూల్యాంకనం చేయించాలన్నారు. స్వచ్ఛభారత్‌లో అవార్డులు సాధించిన విశాఖ, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమహేంద్రవరం కార్పొరేషన్లలో ఈ నెల 21న ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీల్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం తగ్గేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్టోబరు 2వ తేదీ నాటికి 17 కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పర్యావరణ హిత చర్యల్లో భాగంగా సింగిల్‌యూజ్ ప్లాస్టిక్ లేకుండా కార్యాచరణ అమలు చేస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు కాగా, సర్క్యులర్ ఎకానమీ ద్వారా రాష్ట్రంలో వ్యర్థాలు లేకుండా చూడటమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాలని సీఎం.. అధికారులను ఆదేశించారు. దీనికోసం ఆయా పరిశ్రమలకు ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. తిరుపతి, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, సత్యసాయి, గోదావరి జిల్లాల్లో సర్క్యులర్ ఎకానమీ క్లస్టర్ల ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వ్యర్థరహితంగా కుప్పం మున్సిపాలిటీలో మోడల్ ప్రాజెక్టును అమలు చేస్తున్నామని, వ్యర్థాల సేకరణపై ఈ విధానాన్ని పరిశీలించాలని సీఎం తెలిపారు. సమీక్షలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 15 , 2025 | 05:13 AM