సిండి‘కేట్లు’!
ABN, Publish Date - May 13 , 2025 | 01:03 AM
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో సిండికేట్ రూపంలో మరో కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం మాఫియానే చూశాం. వీరిని కంట్రోల్ చేసే సిండి ‘కేట్లు’ ఇప్పుడు తెరమీదకు వచ్చారు. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోని సిండికేట్ సంస్కృతి ఉమ్మడి కృష్ణా జిల్లాకు కూడా పాకింది. ఈ సిండికేట్లకు రాజకీయ పరపతి తోడవటంతో మరింత శక్తివంతంగా తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి.
-రేషన్ బియ్యం వ్యాపారంలోకి కొత్త వ్యవస్థ!
- ఇన్నాళ్లూ రేషన్ మాఫియాదే రాజ్యం!
- ఇప్పుడు రేషన్ మాఫియాపై సిండికేట్ల పెత్తనం
- రాజకీయ అండదండలు పుష్కలం
- రేషన్ బియ్యాన్ని చివరిగా వీరికి అమ్మాల్సిందే!
- లేదంటే వేధింపులు.. భౌతిక దాడులు
- ఇక్కడి నుంచి ఆఫ్రికా దేశాలకు నేరుగా ఎగుమతులు
ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో సిండికేట్ రూపంలో మరో కొత్త వ్యవస్థ పుట్టుకొచ్చింది. ఇప్పటి వరకు రేషన్ బియ్యం మాఫియానే చూశాం. వీరిని కంట్రోల్ చేసే సిండి ‘కేట్లు’ ఇప్పుడు తెరమీదకు వచ్చారు. పొరుగున ఉన్న గుంటూరు జిల్లాలోని సిండికేట్ సంస్కృతి ఉమ్మడి కృష్ణా జిల్లాకు కూడా పాకింది. ఈ సిండికేట్లకు రాజకీయ పరపతి తోడవటంతో మరింత శక్తివంతంగా తయారవుతున్నాయి. ఇక్కడి నుంచి నేరుగా ఆఫ్రికా దేశాలకు ఎగుమతులు చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
రేషన్ బియ్యం అక్రమ రవాణాలో సిండికేట్లదే ఇప్పుడు అగ్రస్థానం. వారు చెప్పిందే శాసనం. రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసే మాఫియా శక్తులన్నీ కూడా ఈ సిండికేట్‌కు విక్రయించాల్సిందే. లేదంటే భయభ్రాంతులకు గురి చేయటం, అక్రమ కేసులు బనాయించటం, భౌతిక దాడులకు పాల్పడటం జరుగుతోంది. కృష్ణాజిల్లా పెనమలూరు మండలంలో రేషన్ మాఫియాపై సిండికేట్ దాడులు జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా జీ.కొండూరు, తిరువూరు మండలాల్లో ఈ తరహా దాడులు కొనసాగాయి. ఈ దాడుల తర్వాత రేషన్ మాఫియా కూడా సిండికేట్లకే తాము కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని విక్రయిస్తోంది. రేషన్ బియ్యం వ్యాపారులు, మాఫియా నుంచి కొనుగోలు చేసిన బియ్యాన్ని సిండికేట్లు పాత విధానంలోనే పోర్టులకు తరలించేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు రేషన్ మాఫియా చేసే పని.. ఇపుడు సిండికేట్లు చేస్తున్నారు.
ఈ సిండికేట్లు ఎవరంటే..
రాజకీయ నాయకుల ఆశీస్సులు బలంగా ఉన్నవారు. రాజకీయ నాయకులకు ఫండింగ్ ఇచ్చే స్థాయి కలిగిన వారు. రేషన్ బియ్యం వ్యాపారం రూ.కోట్ల వర్షం కురిపిస్తుండటంతో ఈ వ్యాపారంలోకి రాజకీయ సిండికేట్లు రంగ ప్రవేశం చేశాయి. క్షేత్ర స్థాయిలో చూస్తే ఉమ్మడి జిల్లాలో రేషన్ బియ్యం కొనుగోళ్లు వివిధ రూపాల్లో ఉంటుంది. ప్రధానంగా ఎండీయూ ఆపరేటర్ల ద్వారా కొనుగోళ్లు జరుగుతున్నాయి. డోర్ డెలివరీ చేపట్టే ఎండీయూ ఆపరేటర్లు ప్రజలకు తూకం వేసి బియ్యం ఇచ్చి మళ్లీ ఆ బియ్యాన్నే కార్డుదారుల నుంచి ఎదురుకొంటున్నారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని ఎండీయూ ఆపరేటర్లు నిల్వ చేస్తూ నియోజకవర్గ స్థాయిలో ఉన్న రేషన్ వ్యాపారులకు విక్రయిస్తుంటారు. ఇంకాస్త తెలివి, ధైర్యం ఉన్న వారు ఏకంగా రేషన్ మాఫియాకే బియ్యాన్ని విక్రయిస్తుంటారు. ఇది రేషన్ బియ్యం కొనుగోలులో మొదటి ప్రక్రియ. రెండో ప్రక్రియ ఏమిటంటే.. ఎండీయూ ఆపరేటర్ల దగ్గర నుంచి బియ్యం కొనుగోలు చేసిన కార్డుదారుల నుంచి వీధి వ్యాపారులు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని వీరు మండల స్థాయిలో ఉన్న వ్యాపారులకు విక్రయిస్తారు. ఈ వ్యాపారులు నియోజకవర్గ స్థాయిలో ఉన్న వ్యాపారులకు కానీ, నేరుగా బియ్యం మాఫియాకు కానీ విక్రయిస్తారు. ఇక మూడో స్థాయిలో చూస్తే.. రేషన్ డీలర్లు తాము ఎండీయూలకు ఇవ్వాల్సిన బియ్యం బస్తాలను తమ దగ్గరే ఉంచుకుంటారు. కార్డుదారుల్లో నూటికి 30 శాతం మంది మాత్రమే రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేస్తారని డీలర్లకు తెలుసు. ప్రస్తుతం డీలర్లు స్టాకిస్టులుగా మాత్రమే పరిమితమయ్యారు. ఎండీయూ ఆపరేటర్లకు స్టాకు మాత్రమే ఇస్తారు. ఎండీయూ ఆపరేటర్, డీలర్ మధ్యన అవగాహన కారణంగా బియ్యం బస్తాలను కొన్నింటిని తన దగ్గరే డీలర్ ఉంచుకుంటాడు. ఇలా ఉంచుకున్న బియ్యాన్ని రేషన్ మాఫియాకు విక్రయిస్తాడు. ఇలా మూడంచెల విధానంలో పేదల బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ మూడంచెలు కూడా రేషన్ మాఫియా శక్తులకు వెళతాయి. ఉమ్మడి జిల్లాలో ఇలాంటి రేషన్ మాఫియా శక్తులు పాతిక మంది వరకు ఉన్నారు. ఈ రేషన్ మాఫియా శక్తులే తాము మూడంచెల విధానంలో కొనుగోలు చేసిన బియ్యాన్ని జిల్లా, రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటించే బాధ్యత తీసుకుంటారు. విదేశాలకు రవాణా చేయటానికి పోర్టుల్లో మాస్టర్ ట్రేడర్లు ఉంటారు. మాస్టర్ ట్రేడర్లు, రేషన్ మాఫియా శక్తులకు సంబంధాలు ఉంటాయి.
రవాణా బాధ్యత కూడా వారిదే..
రేషన్ వ్యాపారంలో సిండికేట్ల ప్రవేశంతో రేషన్ మాఫియా శక్తులు మాస్టర్ ట్రేడర్లతో సంబంధాలను తెగతెంపులు చేసుకోవాల్సి వస్తోంది. పోర్టుల్లో ఉండే మాస్టర్ ట్రేడర్లతో ఇపుడు రేషన్ సిండికేట్లు సంబంధాలు నెరుపుతున్నాయి. వ్యాపార విధానం ఒకటే అయినా వ్యక్తులు, వ్యవస్థలు మాత్రమే మారుతున్నాయి. ఉమ్మడి కృష్ణాజిల్లాలో ప్రస్తుతం క్రియాశీలకంగా అరడజను మంది రేషన్ సిండికేట్లలో ఉన్నారు. రేషన్ సిండికేట్లే నేరుగా రవాణా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. కొత్తగా వ్యాపారంలోకి వచ్చిన రేషన్ సిండికేట్లు వ్యాపార విధానాన్ని అర్థం చేసుకున్నాక మరింత ఎదిగిపోతున్నాయి. ఏ స్థాయిలో అంటే పోర్టుల్లో ఉండే మాస్టర్ ట్రేడర్లను కూడా పరిగణనలోకి తీసుకోకుండా నేరుగా విదేశాల్లో ఉన్న వ్యాపారులతో సంబంధాలు నెరుపుతున్నాయి. కాకినాడ, ముంబయి పోర్టులకు తరలించి అక్కడి నుంచి నేరుగా ఆఫ్రికా దేశాలకు తరలిస్తున్నాయి. భవిష్యత్తులో ఆయా దేశాల్లో కూడా రేషన్ సిండికేట్ల మనుషులే అక్కడ కూడా వ్యాపారం నిర్వహించినా ఆశ్చర్యపోనక్కర లేదు.
Updated Date - May 13 , 2025 | 01:03 AM