Madhav Reddy: పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డి అరెస్టు
ABN, Publish Date - Apr 25 , 2025 | 03:38 AM
మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల దహన కేసులో మాధవరెడ్డిని సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, నేతలు విచారణలో ఉన్నారు, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముంది.
తిరుపతి సీఐడీ ఆఫీసుకు తరలింపు
త్వరలో పెద్ద తలకాయల వంతు?
మదనపల్లె ఫైళ్ల దహనం కేసులో సీఐడీ దూకుడు
9 నెలలుగా ముందస్తు బెయిల్‌పై ఉన్న మాధవరెడ్డి
బెయిల్ రద్దు చేయించి మరీ అరెస్టు చేసిన సీఐడీ
రొంపిచర్ల ఫాంహౌ్‌సలో అదుపులోకి
రాయచోటి/తిరుపతి నేరవిభాగం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అనుచరుడు మాధవరెడ్డిని గురువారం సాయంత్రం సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండల పరిధిలోని తన ఫాంహౌ్‌సలో ఉండగా.. ఆయన్ను అదుపులోకి తీసుకుని తిరుపతి సీఐడీ కార్యాలయానికి తరలించారు. గత ఏడాది జూలై 21వ తేదీ రాత్రి అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్లు కాలిపోయాయి. వైసీపీ హయాంలో సబ్‌కలెక్టర్ కార్యాలయ పరిధిలో పెద్దిరెడ్ది, ఆయన అనుచరులు అనేక భూఅక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వం మారాక ఈ అక్రమాలు వెలుగులోకి రాకుండా చేసేందుకే.. ఫైళ్లను దహనం చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనకు మాధవరెడ్డిని సూత్రధారిగా పేర్కొంటూ మదనపల్లె వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు(క్రైమ్ నంబరు 138/2024) నమోదైంది. ఆయన ఇంట్లో సోదాలు నిర్వహించిన సీఐడీ పోలీసులు బస్తాలకొద్దీ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత మాధవరెడ్డి పోలీసులకు చిక్కకుండా.. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కొంతకాలం తర్వాత హైకోర్టులో ముందస్తు బెయిల్ పొందారు. 9 నెలలుగా ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. ఆ బెయిల్‌ను దర్యాప్తు బృందం తాజాగా రద్దు చేయించింది. తిరుపతి సీఐడీ డీఎస్పీ కొండయ్యనాయుడు, సీఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ఎవరూ ఊహించని విధంగా రొంపిచర్లలోని ఫాంహౌ్‌సలో గురువారం సాయంత్రం మాధవరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ కేసులో మూడు నెలల క్రితం సబ్‌కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ గౌతమ్‌తేజ్‌ను అరెస్టు చేశారు. మరో నిందితుడైన పూర్వపు ఆర్డీవో మురళి ఏసీబీ అదుపులో ఉన్నారు. మాధవరెడ్డి పట్టుబడడంతో త్వరలో మరిన్ని పెద్దతలకాయలను సీఐడీ పోలీసులు అరెస్టు చేసే అవకాశం ఉందని.. పెద్దిరెడ్డితో పాటు ఆయన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డి, ఆయన సోదరుడు, తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డిని అదుపులోకి తీసుకోవచ్చని అంటున్నారు. మదనపల్లెకు చెందిన కొందరు కీలక వైసీపీ నాయకులు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు చెబుతున్నారు.
చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం వంకమద్దికి చెందిన మాధవరెడ్డి వ్యవసాయం చేసుకునేవారు. 1985లో మదనపల్లె వచ్చి వ్యాపారాలు చేస్తూ స్థిరపడ్డారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆనాటి మంత్రి పెద్దిరెడ్డి వద్ద చేరారు. మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రొంపిచెర్ల తదితర ప్రాంతాల్లో ఖరీదైన భూములు కబ్జా చేయడం, అడ్డొచ్చిన వారిని బెదిరించడం, తప్పుడు కేసులు బనాయించే వారన్న ఆరోపణలున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక.. తమ భూ కుంభకోణాలు బయటకు వస్తాయని కొందరు రెవెన్యూ అధికారులు, వైసీపీ నేతలు, మాజీ మంత్రి అనుచరులతో కలసి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో కీలక ఫైళ్ల దహనానికి మాధవరెడ్డి పాల్పడ్డారని పోలీసులు అంటున్నారు.
Also Read:
ఇలా నడిస్తే బోలెడు ప్రయోజనాలు..
లామినేషన్ మిషన్‌ను ఇలా వాడేశాడేంటీ...
ప్రధాని నివాసంలో కీలక సమావేశం..
For More Andhra Pradesh News and Telugu News..
Updated Date - Apr 25 , 2025 | 03:38 AM