మోసం చేసి సంపాదించావు
ABN, Publish Date - Jun 01 , 2025 | 12:57 AM
నువ్వు మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నావు. మేము అడిగిన డబ్బు పంపకుంటే కేసు పెడతాం’ అంటూ గతంలో బియ్యం వ్యాపారం చేసిన 74 ఏళ్ల వెంకటేష్ గుప్తాను సైబర్ నేరగాళ్లు శనివారం బెదిరించారు.
డబ్బులు పంపకుంటే కేసు పెడతాం
సైబర్ ఉచ్చుకు చిక్కి రూ.22.5 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు
తిరుపతి(నేరవిభాగం), మే 31(ఆంధ్రజ్యోతి): ‘నువ్వు మోసం చేసి డబ్బులు సంపాదిస్తున్నావు. మేము అడిగిన డబ్బు పంపకుంటే కేసు పెడతాం’ అంటూ గతంలో బియ్యం వ్యాపారం చేసిన 74 ఏళ్ల వెంకటేష్ గుప్తాను సైబర్ నేరగాళ్లు శనివారం బెదిరించారు. తిరుపతి వెస్ట్ ఎస్‌ఐ అనిల్‌కుమార్ కథనం మేరకు.. తిరుపతి నగరం కొత్తవీధిలోని వెంకటేష్ గుప్తా గతంలో బియ్యం వ్యాపారం చేసేవారు. ప్రస్తుతం వయస్సు మీద పడడంతో ఇంటి వద్దే ఉంటున్నారు. వ్యాపార లావాదేవాలకు సంబంధించి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. ఈ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్‌కు పోలీసు యూనిఫాంలో ఉన్న వాట్సాప్ పిక్‌తో దుండగులు వాట్సాప్ కాల్ చేశారు. ‘మీ ఆధార్ నెంబరు, మీ బ్యాంకు అకౌంటు నెంబర్లు మొత్తం మా వద్ద వున్నాయని మీరు బ్యాంకు లావాదేవీల్లో మోసాలు చేసి డబ్బులు సంపాదిస్తున్నారని బెదిరించారు. దీంతో పోలీసులే ఫోను చేస్తున్నారని ఆయన ఆందోళనకు గురయ్యారు. దీంతో వాళ్లు మరింతగా ఒత్తిడి తెచ్చారు. మీ బ్యాంకు అకౌంటు నుంచి మాకు డబ్బులు పంపకుంటే వెంటనే కేసు నమోదు చేస్తామనడంతో ఆయన భయపడి దాదాపు రూ.22.50 లక్షలు సైబర్ నేరగాళ్ల రెండు అకౌంట్లకు ట్రాన్స్‌ఫర్ చేశారు. తీరా వారితో మాట్లాడడానికి ప్రయత్నించగా వారి నెంబరు పనిచేయక పోవడంతో మోసపోయామని గుర్తించి వెస్ట్ ఎస్‌ఐ అనిల్‌కుమార్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.
Updated Date - Jun 01 , 2025 | 12:57 AM