గంగన్న శిరస్సుకు నిధులొచ్చేనా?
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:37 AM
పలమనేరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కౌండిన్య రిజర్వాయర్‌తో ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటి సరఫరా వీలు కాకపోవడంతో పదేళ్ల క్రితం రిజర్వాయర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగన్న శిరస్సు జలపాతం నీటిని మళ్లించాలని నిర్ణయించారు.
ఎమ్మెల్యే అమర్ చొరవతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు
రూ.30 కోట్ల వ్యయ అంచనాలతో పంపిన అధికారులు
పలమనేరు, జూలై 24 (ఆంధ్రజ్యోతి): పలమనేరు పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.కౌండిన్య రిజర్వాయర్‌తో ప్రజలకు ఏడాది పొడవునా తాగునీటి సరఫరా వీలు కాకపోవడంతో పదేళ్ల క్రితం రిజర్వాయర్‌కు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న గంగన్న శిరస్సు జలపాతం నీటిని మళ్లించాలని నిర్ణయించారు.ఇందుకోసం కౌండిన్య రిజర్వాయర్‌కు ఒక అనుబంధ ప్రాజెక్టు నిరించాలని అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్ణయించి దాదాపు 70 ఎకరాల స్థలాన్ని సేకరించారు. ఇందులో కొంత సెటిల్ మెంట్ భూమి, కొంత డీకేటీ భూములున్నాయి.ఇప్పటికే నష్టపరిహారం కొందరికి చెల్లించారు.అంతటితో ఆగిపోయిన ఈ ప్రాజెక్టు పనులపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యే అమరనాథరెడ్డి దృష్టి పెట్టారు.అవసరమైన ప్రతిపాదనలను ఇరిగేషన్ అధికారులతో సిద్ధం చేయించడంతో పాటు అటవీశాఖ క్లియరెన్స్ తీసుకురావడం జరిగిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.30 కోట్లు వ్యయం అవుతుందన్న అంచనాలతో అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది. ప్రభుత్వం నుంచి నిధులు విడుదలైన తర్వాత యుద్ధప్రాతిపదికన గంగన్న శిరస్సు ప్రాజెక్టు పూర్తిచేసి అక్కడి నుంచి కౌండిన్య రిజర్వాయర్‌కు నీటిని మళ్లించడం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో 58 వేల మంది జనాభా వుండగా 13 వేలకు పైగా గృహాలున్నాయి. చేతి పంపులు దాదాపు 110 వరకు ఉండగా.. అందులో కేవలం మూడింట ఒకవంతు మాత్రమే పనిచేస్తున్నాయి. రోజూ కనీసం 3.2 ఎంఎల్‌టీల నీటి సరఫరా కావాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న 88 బోర్ల నుంచి 2 ఎంఎల్‌టీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది.గత ఏడాది వర్షాలు నామమాత్రంగా కురవగా ఈ ఏడాది జూన్ నెలలో వర్షాలు ప్రారంభం అయినా నామమాత్రంగానే కురిశాయి.చెరువులకు నీరు చేరని పరిస్థితి.ఇక వర్షాలు కురిసి కౌండిన్య నది ప్రవహిస్తే గాని రిజర్వాయర్ నిండే అవకాశాలు కనిపించడం లేదు.
వట్టిపోయిన రిజర్వాయర్
పలమనేరుకు తాగునీటి కోసం మండలంలోని కాలువపల్లి వద్ద కౌండిన్య నదిపై నిర్మించిన రిజర్వాయర్ నిండితే దాదాపు రెండేళ్లపాటు తాగునీటికి ఇబ్బంది వుండదు.2022వ సంవత్సరంలో ఈ రిజర్వాయర్ నిండినా రెండేళ్లుగా వర్షాలు సరిగా కురవకపోవడంతో గత ఏడాది ఫిబ్రవరి నెలకే రిజ ర్వాయర్ పూర్తిగా వట్టిపోయింది. దీంతో పట్టణానికి తాగునీటి సరఫరా ఈ రిజర్వాయర్ నుంచి పూర్తిగా నిలిచిపోయింది.దీంతో మున్సిపల్ అధికారులు ఈ వేసవిలో ట్యాంకర్లతో తాగునీటిని సంపులకు నింపి సరఫరా చేస్తూ వస్తున్నారు.
Updated Date - Jul 25 , 2025 | 01:37 AM