బాధ్యతగా పనిచేయకుంటే ఎలా?
ABN, Publish Date - May 18 , 2025 | 01:43 AM
లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమాచారం మీకు తెలియదా వైద్యాధికారులపై కలెక్టర్ అసహనం
చిత్తూరు అర్బన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ‘బాధ్యతగా పనిచేయకుంటే ఎలా? లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న సమాచారం మీకు తెలియదా?’ అని వైద్యాధికారులపై కలెక్టర్ సుమిత్‌కుమార్ అసహనం వ్యక్తం చేశారు. శనివారం కలెక్టరేట్‌లో పీసీపీఎన్ డీటీ యాక్ట్ 1994 డిస్ర్టిక్ట్ లెవల్ అడ్వయిజరీ కమిటీ సమావేశం జరిగింది. జిల్లా జడ్జి రమే్‌షతోపాటు వైద్య, ఆరోగ్యశాఖ అఽధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు జిల్లాకు సరిహద్దులో ఉండటంతో జిల్లా కేంద్రంలో చాలాకాలంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారన్నారు. ఆశా, ఏఎన్‌ఎంలు స్థానికంగా ఉన్నప్పటికీ మొదటి, రెండుసార్లు ఆడబిడ్డలు పుట్టినప్పుడు మూడోసారి ఆ మహిళ గర్భం దాల్చిన విషయాన్ని ఎందుకు తెలుసుకోలేక పోతున్నారో చెప్పాలన్నారు. పదేళ్లలో సీడీపీవోలు, మెడికల్ ఆఫీసర్లతో కలిసి ఒక్కసారైనా సమావేశాలు పెట్టారా అని నిలదీశారు. అబార్షన్లతో ఆడ బిడ్డల నిష్పత్తి పూర్తిగా తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 జనాభా లెక్కల ప్రకారం ప్రతి వెయ్యిమంది పురుషులకు 947 మంది స్ర్తీలు ఉన్నారని, ఈ నిష్పత్తిని ఇతర జిల్లాలో పోల్చితే చాలా తక్కువగా ఉందన్నారు. అధికారులు బాధ్యతగా పనిచేస్తే లింగనిర్ధారణ పరీక్షలను అడ్డుకోవచ్చన్నారు. పలమనేరు, నగరి, పుంగనూరు. వి.కోట మండలాల్లోని ప్రైవేటు ఆస్పత్రుల్లో అనుమతి లేకుండా జరుగుతున్న అబార్షన్ల శాతం మిగిలిన మండలాలతో పోల్చితే ఎక్కువగా ఉందన్నారు. డివిజన్లవారీగా ఆర్‌ఎంపీ డాక్టర్లతో సమావేశాలు నిర్వహించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. స్కానింగ్ యంత్రాలను అనధికారికంగా అమ్ముతున్న వారిపైనా నిఘా ఉంచాలని పోలీస్ అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో సుధారాణి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, డీఐవో హనుమంతరావు, సంబంధితశాఖల అధికారులు పాల్గొన్నారు.
Updated Date - May 18 , 2025 | 01:43 AM