స్విమ్స్‌ను అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దుతాం
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:06 AM
స్విమ్స్‌ను దేశంలో అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని స్విమ్స్ చాన్సలర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని మహతితో బుధవారం జరిగిన స్విమ్స్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు.
స్నాతకోత్సవంలో చాన్సలర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు
తిరుపతి(వైద్యం), జూన్ 11(ఆంధ్రజ్యోతి): స్విమ్స్‌ను దేశంలో అత్యుత్తమ వ్యవస్థగా తీర్చిదిద్దుతామని స్విమ్స్ చాన్సలర్, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పేర్కొన్నారు. తిరుపతిలోని మహతితో బుధవారం జరిగిన స్విమ్స్ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ఏటా స్విమ్స్‌కు టీటీడీ రూ.వంద కోట్లు వెచ్చిస్తూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందన్నారు. వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల కొరత లేకుండా మరో రూ.71 కోట్ల వరకు వెచ్చించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. భవిష్యత్తులో ఏఐ ఆధారిత వైద్య సేవలు, రోబోటిక్ శస్త్ర చికిత్సలు, అన్‌లైన్ ఓపీడీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. స్విమ్స్‌లో వేల మంది రోగులకు వైద్యసేవలతో పాటు వర్సిటీలో ఏటా వందల మంది వైద్యులను, సిబ్బందిని తీర్చిదిద్దుతుండటం గొప్ప విషయమని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ధనార్జనే ధ్యేయంగా కాకుండా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి వారి ప్రాణాలు నిలబెట్టడంలో ప్రతిభ చూపాలని ముఖ్య అతిథి, ఎయిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈవో డాక్టర్ హనుమంతరావు డాక్టర్లకు సూచించారు. అధునాతన వైద్య పరిజ్ఞానంతో వైద్య సేవలు అందించాలని వైద్య విద్యార్థులకు చెప్పారు. అనంతరం వైద్య విద్య పూర్తి చేసుకున్న 501 మందికి డాక్టర్ పట్టాలు, వైద్య విద్యలో ఉత్తమ ప్రతిభ చూపిన 40 మందికి బంగారు పతకాలు, ఎంబీబీఎ్‌సలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన డాక్టర్లు అభిఘ్న, నికిత గిద్వానికి రూ.25 వేల నగదు బహుమతి, ఎక్కువ మార్కులు సాధించిన డాక్టర్లు నాగేంద్రప్రసాద్, బుద్దగారి ప్రేమ్‌కు మెరిట్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. రోగులకు నిస్వార్థ సేవ అందిస్తామంటూ డాక్టర్ పట్టాలు అందుకున్న వారితో స్విమ్స్ డైరెక్టర్ ఆర్వీకుమార్ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఇంకా టీటీడీ సభ్యులు సుచిత్ర ఎల్లా, సదాశివరావు, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, డీఎంఈ అకడమిక్ డాక్టర్ రఘునందన్, స్విమ్స్ డీన్ అల్లాడి మోహన్, రిజిస్ర్టార్ అపర్ణ ఆర్ బిట్లా, వైద్య విభాగాధిపతులు నరేంద్ర, జానకి, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 01:06 AM