వీఆర్వోను లైంగికంగా వేధించారని వాకాడు తహసీల్దార్ సస్పెన్షన్
ABN, Publish Date - Aug 01 , 2025 | 02:04 AM
నాయుడుపేటలో ఓ మహిళా వీఆర్వోను వాకాడు తహసిల్దార్ లైంగికంగా వేధించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు జిల్లాలో సంచలనం సృష్టించాయి.
సోహల్ మీడియాలో తహసిల్దార్ నగ్న వీడియోలు
వేధింపులా, బ్లాక్‌మెయిలా?
నాయుడుపేట/వాకాడు, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నాయుడుపేటలో ఓ మహిళా వీఆర్వోను వాకాడు తహసిల్దార్ లైంగికంగా వేధించారంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు జిల్లాలో సంచలనం సృష్టించాయి. వీడియోలో ఉన్న తహసిల్దార్ రామయ్యను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేయడంతో పాటూ సంఘటనపై విచారణకు ఆదేశించారు. అయితే ఈ సంఘటనపై భిన్న వాదనలు వినిపిస్తుండగా, ఇద్దరు విలేకర్ల పాత్రపై ఆరోపణలు వెలువడుతున్నాయి.
వీడియోల్లో ఏముంది?
వాకాడు తహసీల్దార్ రామయ్య నాయుడుపేటలోని పెళ్లకూరు మండలం తాళ్వాయిపాడు వీఆర్వో కళ్యాణి ఇంట్లో నగ్నంగా ఉండగా ఆయనపై వీఆర్వో తల్లి చీపురుతో దాడి చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆయన ప్యాంటు తొడుక్కుని బయటకు వెళ్లే ప్రయత్నాన్ని కొందరు అడ్డుకుంటున్నట్టు వీడియోల్లో ఉంది. జూన్ 24న ఈ సంఘటన జరగ్గా, 31న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లైంగికంగా వేధించారు: వీఆర్వో
పెళ్లకూరు మండలం తహసీల్దారుగా రామయ్య పనిచేస్తున్నప్పటి నుంచి కూడా తనను లైంగికంగా వెధిస్తున్నారని వీఆర్వో కళ్యాణి ఆరోపిస్తున్నారు. తన తల్లికి ఈ విషయం చెప్పానన్నారు. 24వ తేదీన తన ఇంటికి వచ్చి లైంగిక దాడికి దిగారని చెప్పారు. దాంతో తనకు సన్నిహితులైన ఇద్దరు విలేకర్లకు ఫోన్ చేసి పిలిపించానని తెలిపారు.
ఇదంతా బ్లాక్ మెయిల్ కుట్ర: తహసిల్దారు
తనను కుట్రపూరితంగా ఇరికించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని తహసిల్దార్ రామయ్య చెబుతున్నారు. వీఆర్వో కళ్యాణి పథకం ప్రకారం తనను ఇంటికి రప్పించి ఇద్దరు విలేకరులతో కలిసి తన నుంచి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేయాలని పథకం వేశారన్నారు. ఇద్దరు విలేకర్లు కోటి రూపాయలు ఇవ్వాలంటూ తనను బెదిరించడంతో బుధవారం కలెక్టర్‌కు, గురువారం ఎస్పీకి ఫిర్యాదు చేశానని తహసీల్దారు రామయ్య ఆంధ్రజ్యోతికి తెలిపారు.
తహసీల్దారు సస్పెన్షన్
వీఆర్వో కళ్యాణి చేసిన ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న కలెక్టర్ వెంకటేశ్వర్ గురువారం రాత్రి తహసిల్దారు రామయ్యను సస్పెండ్ చేశారు. విచారణకు సైతం ఆదేశించారు. తిరుపతి కలెక్టరేట్‌లో ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్‌లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రోజ్‌మాండ్‌ను విచారణాధికారిగా నియమించారు. కాగా గురువారం రాత్రి వాకాడు తహసిల్దారు రామయ్య చేసిన ఫిర్యాదుతో ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా విచారణకు ఆదేశించారు. స్పెషల్ బ్రాంచి సీఐకి విచారణ బాధ్యతలు అప్పగించారు.
విలేకర్ల పాత్రపై ఆరోపణలు
ఈ సంఘటనపై విలేకర్ల పాత్ర మీద కూడా విమర్శలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 24న సంఘటన జరిగితే ఇన్ని రోజులు ఎందుకు వెలుగులోకి తీసుకురాలేదని ప్రశ్నిస్తున్నారు. డబ్బులు గుంజే ప్రయత్నం ఫలించకపోవడంతోనే వీడియోలు వైరల్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇందువల్ల బాధితురాలైన వీఆర్వో ప్రతిష్టకు సైతం వారు తీవ్రంగా నష్టం కలిగించారని నెటిజన్లు మండిపడుతున్నారు. తనను కోటి రూపాయలు డిమాండ్ చేశారని తహసిల్దార్ రామయ్య ఎస్పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక విలేకరి వారంలోగా రూ.35 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, ఆ తర్వాత నెల రోజులకు మరో రూ.35లక్షలు ఇవ్వాలన్నారని ఆయన పేర్కొన్నారు. లేకుంటే తన ప్రతిష్ట దెబ్బతినేలా వీడియోలు బయట పెడతామని బెదిరించారన్నారు. ఆ విలేకర్లే బలవంతంగా తన బట్టలు పీకేసి వీడియోలు తీశారని ఆయన పేర్కొన్నారు. భిన్న వాదనలు వినిపిస్తున్న ఈ సంఘటనపై లోతుగా దర్యాప్తు జరిపితేనే వాస్తవాలు వెలుగు చూస్తాయి.
Updated Date - Aug 01 , 2025 | 02:04 AM