వెంకన్న దయతలిస్తే టాప్‌లో కూర్చుంటా!
ABN, Publish Date - Jul 27 , 2025 | 01:51 AM
తిరుమల ఏడుకొండలస్వామి నా పక్కన వుండి నడిపిస్తే పోయి టాప్‌లో కూర్చుంటానని యువ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.ఆయన హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం శనివారం రాత్రి తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో వైభవంగా జరిగింది.
తిరుపతి అర్బన్, జూలై 26 (ఆంధ్రజ్యోతి) : తిరుమల ఏడుకొండలస్వామి నా పక్కన వుండి నడిపిస్తే పోయి టాప్‌లో కూర్చుంటానని యువ హీరో విజయ్ దేవరకొండ అన్నారు.ఆయన హీరోగా నటించిన ‘కింగ్‌డమ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం శనివారం రాత్రి తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్‌లో వైభవంగా జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ప్రతిసారిలాగే ఈ సినిమాకు కూడా ప్రాణంపెట్టి గట్టిగా పనిచేశాం. ఇక మిగిలింది ఆ వెంకన్నస్వామి దయ, మీ అందరి ఆశీస్సులు.ఈ రెండూ నా వెంటవుంటే నన్ను ఎవరూ ఆపలేరు,సినిమా విడుదల రోజైన 31న థియేటర్‌లో మిమ్మల్ని మళ్లీ కలుస్తా, అప్పటి వరకు బాగా చూసుకో స్వామీ, ఏడుకొండలవాడా గోవిందా గోవిందా’ అని చిత్తూరు యాసలో మాట్లాడుతూ యువతను ఆకట్టుకున్నారు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ‘తిరుపతి నాకు చాలా స్పెషల్, ఇక్కడికి వస్తేనే పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది, చేసింది ఒక్క సినిమానే అయినా మీరంతా నామీద చూపిస్తున్న ప్రేమ మరువలేను’ అన్నారు. చక్కటి టీం వర్కుతో పనిచేశామని, కింగ్‌డం సినిమా ఆద్యంతం అలరిస్తుందని చెప్పుకొచ్చారు.క్లాస్, మాస్ వాతావరణంలో జరిగిన ట్రైలర్ రిలీజ్ మధురానుభూతినిచ్చిందన్నారు.అంతకుముందు మూవీ ట్రైలర్ రిలీజ్ చేయగానే కుర్రకారు లేచినిలబడి కేరింతలు కొడుతూ సందడి చేశారు.యువత ఉత్సాహం మితిమీరడంతో పోలీసులు రంగంలోకి దిగి అదుపుచేశారు.దర్శకుడు గౌతమ్‌తిన్ననూరి, సంగీత దర్శకుడు అనిరుధ్, నిర్మాత నాగవంశీ తదితరులు పాల్గొన్నారు. కాగా గతంలో గిరిజనులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హీరో విజయ్‌దేవరకొండను అరెస్టు చేయాలని గిరిజన సంఘాల జేఏసీ ప్రతినిధులు మైదానం వెలుపల ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు.
Updated Date - Jul 27 , 2025 | 01:51 AM