నేడు టీటీడీ బోర్డు సమావేశం
ABN, Publish Date - Jul 22 , 2025 | 01:18 AM
45 అజెండా అంశాలపై చర్చ
తిరుమల, జూలై21(ఆంధ్రజ్యోతి): టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశం మంగళవారం జరుగనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన సభ్యులు సమావేశం కానున్నారు. దాదాపు 45 అంశాలతో రూపొందించిన అజెండాపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. ఇందులో ప్రధానంగా టీటీడీలోని కాంట్రాక్ట్ డ్రైవర్లను, విద్యాసంస్థల్లోని కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయడం, తిరుమలలోని పాత భవనాలను నూతన డోనార్ స్కీం కింద పునర్నిర్మించే అంశం, వేదపారాయణదారులకు నిరుద్యోగ భృతి కింద నెలకు రూ.3 వేలు అందజేసే అంశాలపై చర్చించి తీర్మానాలు చేయనున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న క్రమంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై కూడా చర్చ జరగనుంది. శ్రీవాణి ట్రస్టు ద్వారా వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న ఆలయాల నిర్మాణానికి పెండింగ్‌లో ఉన్న నిధుల విడుదల అంశంపై కూడా చర్చించి నిర్ణయాలు తీసుకోన్నారు. టీటీడీలో అన్యమత ఉద్యోగుల అంశం ఇటీవల తీవ్రస్థాయిలో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.టీటీడీలో దాదాపు వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారంటూ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంజయ్ వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే టీటీడీ ఐదుగురు ఉద్యోగులను సస్పెండ్ చేయడంతో పాటు మరికొందరిపై విజిలెన్స్ విభాగంతో విచారణ చేయిస్తోంది. అయితే పూర్తిస్థాయిలో టీటీడీ నుంచి అన్యమత ఉద్యోగుల తొలగింపుపై మరోమారు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. అలాగే టీటీడీలో పనిచేస్తున్న ఉద్యోగుల ఇళ్లను విజిలెన్స్ ద్వారా తనిఖీ చేయించి అన్యమతస్తులను గుర్తించేలా బోర్డు తీర్మానం చేస్తామంటూ బోర్డు సభ్యుడు భానుప్రకా్‌షరెడ్డి ప్రకటన చేశారు. దీనిపై కూడా చర్చ జరగనున్నట్టు తెలిసింది.
అధికారులపై చైర్మన్ అసహనం
ఇప్పటివరకు బోర్డులో చేసిన తీర్మానాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ టీటీడీ బోర్డు చైర్మన్ అధికారులుపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. తిరుమలలో మంగళవారం ధర్మకర్తల మండలి సమావేశం జరుగనున్న నేపథ్యంలో సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథిగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. చైర్మన్‌తో పాటు ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈవో వీరబ్రహ్మం, వివిధ విభాగాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. నూతనంగా పెట్టబోయే అజెండా అంశాలపై చర్చిస్తున్న క్రమంలో ఇప్పటికే తీర్మానం చేసిన వాటి అమలులో ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ ఈవోపై చైర్మన్ ఆగ్రహించినట్లు తెలిసింది. వ్యక్తిగత అజెండాలు ఎవరికి లేవనీ, పరిపాలనపరంగా సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తూ అన్నిటిని ఒక్కొక్కటిగా అమలుచేస్తూ వస్తున్నామని ఈవో కూడా బదులిచ్చినట్లు సమాచారం. కొంతసమయానికే అందరు సర్దుకుని సమావేశాన్ని ముగించినట్లు తెలిసింది.
Updated Date - Jul 22 , 2025 | 01:18 AM