Diesel: టాపాయిండ్లు కేంద్రంగా డీజిల్ దందా
ABN, Publish Date - Jul 14 , 2025 | 12:23 AM
60.. తమ యజమానులకు తెలియకుండా లారీ డ్రైవర్లు డీజిల్‌ను దుకాణదారులకు అక్రమంగా అమ్మే ధర ఇది.
దొరవారిసత్రం, జూలై 13 (ఆంధ్రజ్యోతి): డీజల్ అక్రమ విక్రయాలకు దొరవారిసత్రం మండలం టపాయిండ్లు కేరా్‌ఫగా మారింది. సూళ్లూరుపేట టోల్ ప్లాజాకు చేరువలో ఉన్న ఈ గ్రామంలో జాతీయ రహదారికి రెండు వైపులా ఇళ్లున్నాయి. ఇళ్ల వద్ద దుకాణాలు ఏర్పాటు చేసుకొని లారీల నుంచి డీజిల్ కొనుగోలుచేసి విక్రయిస్తున్నారు. ఇలా పది మంది దీనినే వ్యాపారంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. వేలాది లీటర్ల డీజిల్ నిల్వ చేసి ఉంచుతున్నారు. గతేడాది డిజిల్ విక్రయాల దుకాణలు మరిన్ని పెరిగాయి. తమ దుకాణల వద్ద డీజిల్ కొనుగోలుకు ఒక సంకేతంలా వాటర్ క్యాన్లు, డీజిల్ క్యాన్లను జాతీయ రహదారి పక్కన వేలాడ కడుతున్నారు. వీటిని చూసిన లారీ డ్రైవర్లు ఆ దుకాణల వద్ద ఆపి.. ఆ లారీల నుంచి లీటర్ రూ.60 వంతున డీజిల్ అక్రమంగా అమ్మేస్తుంటారు. వచ్చిన కాడికి లాభం అనుకుని ఇలా తమ యజమానులను మోసం చేస్తున్నారు డ్రైవర్లు. ఈ డీజిల్‌ను కొనే దుకాణదారులు స్థానికంగా ట్రాక్టర్లు యజమానులకు, ఇతర వాహనాలకు లీటర్‌ను రూ.89 లెక్కన ఇస్తున్నారు. ఇద్దరు దుకాణదారులైతే పెద్ద ఎత్తున్న నిల్వలు చేసి సూళ్లూరుపేటలోని ఓ పెట్రోల్ బంకు యాజమాన్యంకు అమ్మకాలు చేస్తున్నట్లు సమాచారం. ఓ మినీ డీజిల్ ట్యాంకర్ ఈ దుకాణల వద్దకు వచ్చి తీసుకెళుతుండటం గమనార్హం. ఇలా నెలకు లక్షలాది లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతున్నాయి.
అధికారుల దాడులు.. కేసుల్లేవు మరి
స్థానికుల ఫిర్యాదు నేపథ్యంలో ఇక్కడి డీజిల్ విక్రయాలపై శనివారం గూడూరు సెక్షన్‌కు చెందిన తూనికల కొలతలు (లీగల్ మెట్రాలజీ) శాఖ అధికారులు దాడులు చేశారు. ఇన్‌స్పెక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో 10 దుకాణాలపై దాడులు జరిపారు. రెండు దుకాణాల్లో సుమారు నాలుగు వేల లీటర్ల డీజిల్ ఉన్నట్లు గుర్తించారు. మరో నాలుగు దుకాణాల్లో 5 వేల లీటర్లు ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. డీజిల్ అక్రమ నిల్వలపై ఎలాంటి కేసులు నమోదు కాలేదు. చర్యలూ తీసుకోలేదు. జరిమానా పేరిట చేసిన వసూళ్లకూ ఎలాంటి రశీదులు ఇవ్వలేదు.
జరిమానాలు విధించాం
ఈ వ్యవహారంపై తూనికల కొలతల ఇన్‌స్పెక్టర్ ప్రసాద్‌ను వివరణ కోరగా.. టపాయిండ్లు వద్ద డీజిల్ విక్రయాల దుకాణాలపై దాడులు చేశామని తెలిపారు. నాలుగు దుకాణాలకు రూ.37 వేల జరిమానా విధించామన్నారు. దుకాణదారులకు జరిమాన రశీదులు ఇచ్చారా అని అడగ్గా.. సమాధానం దాటవేశారు. పంచనామాలు రాసుకొచ్చినట్లు చెప్పారు. డీజిల్ అక్రమంగా విక్రయిస్తున్న దుకాణాలను సీజ్ చేశారా అనగా.. విజిలెన్స్‌కు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.
Updated Date - Jul 14 , 2025 | 07:35 AM