మందలించాడని మట్టుబెట్టారు!
ABN, Publish Date - Jul 25 , 2025 | 01:40 AM
చిన్నపాటి ఘర్షణ వల్లే తవణంపల్లె మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు రంగయ్యనాయుడి హత్య చేసినట్లు తేలింది. ఈనెల 20వ తేదీన తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తవణంపల్లె మండలంలోని తెల్లగుండ్లపల్లెలో నివాసం ఉంటున్న రంగయ్యనాయుడి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి.. ఇంటి ముందున్న ట్రాక్టర్ షెడ్డుకు ఉరేసి హత్య చేసిన విషయం తెలిసిందే.
బాలుడితో కలసి మాజీ వైస్ ఎంపీపీని ఉరేసి చంపిన 18యేళ్ల యువకుడు
తవణంపల్లె, జూలై 24 (ఆంధ్రజ్యోతి): చిన్నపాటి ఘర్షణ వల్లే తవణంపల్లె మాజీ వైస్ ఎంపీపీ, టీడీపీ నాయకుడు రంగయ్యనాయుడి హత్య చేసినట్లు తేలింది. ఈనెల 20వ తేదీన తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తవణంపల్లె మండలంలోని తెల్లగుండ్లపల్లెలో నివాసం ఉంటున్న రంగయ్యనాయుడి కాళ్లు, చేతులను తాళ్లతో కట్టేసి.. ఇంటి ముందున్న ట్రాక్టర్ షెడ్డుకు ఉరేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఎస్పీ ఆదేశాలతో చిత్తూరు డీఎస్పీ సాయినాథ్ ఆధ్వర్యంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టి కేసును ఛేదించాయి. వివరాలిలా ఉన్నాయి. తవణంపల్లె మండలంలోని తెల్లగుండ్లపల్లె గ్రామ పంచాయతీ దిగువతోటరాగనపల్లెకు చెందిన భాస్కర్ కుమారుడు మనుపాటి బాలాజి(18) తమ్ముడు చెడు మార్గంలో వెళుతున్నాడని ఈనెల 19వ తేదీన రంగయ్యనాయుడు మందలించి, చేయి చేసుకున్నాడు. ఈ విషయం బాలాజీకి తెలియడంతో అదేరోజున మాజీ వైస్ ఎంపీపీతో చిన్నపాటి ఘర్షణకు దిగి ఆ తర్వాత వెళ్లిపోయాడు. ఎలాగైనా రంగయ్య నాయుడిని హత్య చేయాలని నిర్ణయించుకుని ఆరోజు రాత్రంతా ఆయన ఇంటికి సమీపంలో తన స్నేహితుడైన ఓ బాలుడితో కలిసి బాలాజి కాపు కాశాడు. 20వ తేదీ తెల్లవారు జామున ఇంటి బయటకు వచ్చిన మాజీ వైస్ ఎంపీపీపై దాడి చేసి, పిడిగుద్దులు గుద్దాడు. కిందపడ్డ ఆయన్ను తన స్నేహితుడి సాయంతో తాడుతో కట్టేసి ట్రాక్టర్ షెడ్డుకు ఉరేసి చంపేశాడు. తర్వాత అక్కడినుంచి ఇద్దరూ వెళ్లిపోయారు. సంఘటన స్థలంలో లభించిన వేలిముద్రల ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. గురువారం తిరుపతి- బెంగళూరు జాతీయ రహదారిపై ఐరాల మండలం బొమ్మసముద్రం బ్రిడ్జి వద్ద ఉండగా ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. బాలాజీని అరెస్టు చేసి, బాలుడిని జువైనల్ హోమ్‌కు తరలించారు.
Updated Date - Jul 25 , 2025 | 01:40 AM