మహానాడులో నేతల సందడి
ABN, Publish Date - May 28 , 2025 | 02:23 AM
తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో తొలిరోజు చిత్తూరు,తిరుపతి జిల్లాల నేతలు కీలక పాత్ర పోషించారు.
తిరుపతి, మే 27 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమంలో తొలిరోజు చిత్తూరు,తిరుపతి జిల్లాల నేతలు కీలక పాత్ర పోషించారు. మహానాడు ప్రాంగణంలోకి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతినిధుల పేర్లు నమోదు చేసుకునే స్టాల్ వద్దకు రాగానే చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ పార్టీ కండువా కప్పి ఆహ్వానం పలికారు. ఆయన పేరు నమోదు చేయించి మహానాడు కిట్ అందజేశారు. మహానాడులో పార్టీకి తన వంతుగా రూ. 10,00,116 విరాళం అందజేశారు. శాప్ ఛైర్మన్ రవి నాయుడు ‘కార్యకర్తల సంక్షేమం’పై తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తిరుపతి రూరల్ మండల టీడీపీ అధ్యక్షుడు ఈశ్వరరెడ్డి ఈ తీర్మానాన్ని బలపరుస్తూ ప్రసంగించారు.శ్రీకాళహస్తి నియోజకవర్గ టీడీపీ సోషల్ మీడియా విభాగం యాక్టివిస్టు శశి ‘మాదక ద్రవ్యాల వినియోగంపై ఉక్కుపాదం’ అంశంపై తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం దక్కించుకున్నారు. ఆయన ప్రసంగం ఆకట్టుకుంది. చంద్రబాబు, లోకేశ్ ఆయన్ను అభినందించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ తనయుడు వినీల్ యువనేత నారా లోకేశ్‌తో పాటు పరిటాల శ్రీరామ్, భూమా జగద్విఖ్యాత్‌రెడ్డి తదితరులతో సన్నిహితంగా మసలుతూ ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ కనిపించారు. తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చంద్రబాబును కలిసి శుభాకాంక్షలు తెలపగా హోం మంత్రి అనిత, నందమూరి సుహాసిని తదితరులతో సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ సన్నిహితంగా గడిపారు. జిల్లా ఇంఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు, పలమనేరు ఎమ్మెల్యే అమరనాథరెడ్డి సమన్వయ కమిటీ సభ్యులుగా బిజీబిజీగా పనిచేస్తూ కనిపించారు. చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ, శాప్ ఛైర్మన్ రవినాయుడు, పంతగాని నరసింహ ప్రసాద్, అన్నమయ్య జిల్లా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిశోర్ కుమార్‌రెడ్డి, పులివర్తి వినీల్, శ్రీధర్ వర్మ, నీలాయపాలెం విజయ్‌కుమార్, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, కుప్పం టీడీపీ ఇంఛార్జి, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ పీఎస్ మునిరత్నం, జీడీనెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ ఎం.వి.థామస్, పీలేరుకు చెందిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్, మదనపల్లెకు చెందిన తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబు, తిరుపతి పార్లమెంటు ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి బాబు తదితరులు మహానాడు కమిటీల్లో తమకు అప్పగించిన బాధ్యతలను నిర్వర్తిస్తూ బిజీగా కనిపించారు.
Updated Date - May 28 , 2025 | 02:23 AM