ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భక్తులకూ భగవంతుడికీ నడుమ తగ్గిన దూరం

ABN, Publish Date - Jun 13 , 2025 | 01:34 AM

హిందువులకు ఆరాధ్యదైవం కొలువుండే తిరుమలను కూడా ఐదేళ్లు భ్రష్టు పట్టించారు. భక్తి క్షేత్రాన్ని రాజకీయ ప్రయోజనాలకు అడ్డంగా వాడేశారు. గుంపులతో దర్శనాలకు వచ్చి సామాన్య భక్తులకు క్యూలైన్లలో చుక్కలు చూపించారు. దర్శనాలు.. కాటేజీలు.. అన్నింటా బ్లాకువీరులు పెరిగిపోయారు.

హిందువులకు ఆరాధ్యదైవం కొలువుండే తిరుమలను కూడా ఐదేళ్లు భ్రష్టు పట్టించారు. భక్తి క్షేత్రాన్ని రాజకీయ ప్రయోజనాలకు అడ్డంగా వాడేశారు. గుంపులతో దర్శనాలకు వచ్చి సామాన్య భక్తులకు క్యూలైన్లలో చుక్కలు చూపించారు. దర్శనాలు.. కాటేజీలు.. అన్నింటా బ్లాకువీరులు పెరిగిపోయారు. బోర్డు సభ్యులే దుకాణాలు తెరిచారనే విమర్శలు ఎదుర్కొన్నారు. రాజకీయ ప్రసంగాలకు ఆలయ పరిసరాలను వేదికగా మలచుకున్నారు. చివరికి భక్తులకు ఇష్టమైన లడ్డూనే కల్తీ నెయ్యితో చేసి మచ్చ తెచ్చారు. ఆర్గానిక్‌ పేరుతో అన్నప్రసాదాలను రుచి కోల్పోయేలా చేశారు. తిరుపతి అభివృద్ది అంటూ నమ్మబలికి కమీషన్ల కోసం వందల కోట్ల టీటీడీ నిధులను అనవసర నిర్మాణాలకు మళ్లించారు. ఐదుళ్లూ, ప్రజలలాగే మౌనంగా ఉన్న స్వామి.. ఆ తర్వాత లెక్క తేల్చేశారు. తనకే ఎగనామం పెట్టిన దొంగభక్తులను రెండు నామాల సంఖ్యకే పరిమితం చేశారు. 2024 జూన్‌ 12న అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం ఈ పెనుసవాళ్లను స్వీకరించింది. తిరుమల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. భక్తులకూ భగవంతుడికీ నడుమ దూరం తగ్గించింది. ఏడాది కాలంలో తిరుమలలో జరిగిన మార్పుల సమాహారం ఇది...

- తిరుమల, ఆంధ్రజ్యోతి

లడ్డూకి రుచి వచ్చిందోచ్‌!

తిరుమల లడ్డూకి పూర్వపు రుచీ, శుచీ మళ్లీ వచ్చాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు తిరుమల లడ్డూ మీద దృష్టి పెట్టారు. జగన్‌ జమానాలో టీటీడీని ఏలిన ఆయన అనుంగులు, శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన లడ్డూని కూడా భ్రష్టు పట్టించేశారు. రూపమూ రుచీ కూడా పోయాయి. గిల్లుడుకు గురై లడ్డూ సైజు తగ్గిపోయేది. తిరుమల లడ్డూకి దశాబ్దాలుగా వారసత్వంగా వస్తున్న పరిమళం కూడా మాయమైపోయింది. అసలు ఇది తిరుపతి లడ్డేనా అనే అనుమానం కలిగేలా మారిపోయింది. అందుకు కారణం లడ్డూ తయారీకి వాడుతున్నది కల్తీ నెయ్యి కావడం అని తేలింది. అసలు అది నెయ్యే కాదనీ, జంతుకొవ్వు అవశేషాలున్నాయని తేలడంతో సకల భక్త ప్రపంచాన్నీ ఆందోళనకు గురైంది. కూటమి ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. సుప్రీంకోర్టు జోక్యంతో సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం రంగంలోకి దిగింది. కల్తీ నెయ్యిని సరఫరా చేసిన కొన్ని సంస్థలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. కొందరిని అరెస్ట్‌ చేయడంతో పాటు మరికొందరిని విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలోస్వచ్ఛమైన నెయ్యితోనే లడ్డూలను తయారు చేయడం తిరిగి మొదలుపెట్టారు. దీంతో ఒకప్పటి వాసన తిరిగి వచ్చింది. గతంలో పోలిస్తే ప్రస్తుతం లడ్డూల రుచి చాలా బాగుందని వీఐపీల నుంచి సాధారణ భక్తుల వరకు ప్రసంశలు కురిపిస్తున్నారు. అలాగే నెయ్యిని పూర్తిస్థాయిలో పరీక్షించేలా తిరుమల ల్యాబ్‌లో ‘గ్యాస్‌ క్రోమోటోగ్రాఫీ(జీసీ), హైఫెర్ఫామెన్స్‌ లిక్విడ్‌ క్రోమోటోగ్రాఫీ’ అనే రెండు అత్యధునిక పరికరాలను అమర్చారు.

గతంలో తిరుపతి లడ్డూ ఉన్న చోట నెయ్యితో కూడిన సువాసన గుభాళించేది. అది పోయింది. రెండుమూడు రోజులకే పాడయ్యేవి. ఇప్పుడు లడ్డూకి తిరిగి పాత రుచి, వాసన వచ్చాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. లడ్డూ పట్టుకుంటే నెయ్యి చేతికి అంటుతోంది.

-మురళీకృష్ణ, గుంటూరు’

మారిన అన్నప్రసాదాలు

శ్రీవారి అన్నప్రసాదాల నాణ్యతలోనూ ఏడాదిలో చాలా మార్పులు వచ్చాయి. వైసీపీ పాలకమండళ్ల కాలంలో దీనిపై వచ్చిన విమర్శలు అన్నీఇన్నీ కావు. ‘అసలు ఇది అన్నమేనా, ఎలా తినాలి. మనుషులమా, పసువులమా. కమీషన్లు తీసుకుని చెత్త భోజనం పెడుతున్నారు. మీ ఇంట్లో కూడా ఇలాంటి అన్నమే తింటారా, ఆకలితోనే లేచేశాం’ అంటూ అన్నప్రసాదాలపై తీవ్ర ఆవేదన చెందారు. గత ప్రభుత్వంలో ఆర్గానిక్‌ నైవేద్యం అంటూ రుచి, నాణ్యతలేని అన్నప్రసాదాలను పెట్టేవారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో టీటీడీ ఈవో, అదనపు ఈవోలు దీనిమీద శ్రద్ధ పెట్టారు. బియ్యం సరఫరా చేసే మిల్లర్లతో పాటు కూరగాయలు సరఫరా చేసే రైతులతో వరుస సమీక్షలు నిర్వహించారు. నాణ్యమైన బియ్యం, కూరగాయలు, ముడిసరులకు వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు పూర్వపు పద్ధతులనే అనుసరిస్తంన్నారు. దీంతో ప్రస్తుతం భక్తులు అన్నప్రసాదాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవుడికీ నైవేద్యం దిట్టం పెంచి భక్తులకూ స్వామి నైవేద్య ప్రసాదాలు అందేలా చర్యలు తీసుకున్నారు.

‘ ఇప్పుడు ఇంట్లో తింటున్న భావన కలుగుతోంది. గతంలో అన్నం గట్టిగా ఉండేది. స్వామి ప్రసాదం కావడంతో తప్పు పట్టకూడదని ఓ రెండు ముద్దలు తినేసి వెళ్లిపోయేవాళ్లం. ఇప్పుడు సాంబారు, రసం, చెట్నీ.. అన్నీ రుచిగా ఉన్నాయి. వడ కూడా పెడుతున్నారు. స్వామి దర్శనం చేసుకున్నంత తృప్తిగా తింటున్నాం.

- శిరీష, వైజాగ్‌’

దర్శనాల దందా తగ్గింది

తిరుమలలో రాజకీయ నాయకుల ఆర్భాటపు దర్శనాలు తగ్గాయి. వీఐపీ బ్రేక్‌ దర్శనాలు మునుపటిలాగే ఉన్నా, నాయకుల గుంపులు కనిపించడంలేదు. మరీ కొందరు వైసీపీ నాయకులైతే వారం తిరక్కుండానే కొండమీద తమ బృందాలతో కనిపించేవారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇష్టానుసారం వీఐపీ బ్రేక్‌ టికెట్లు కేటాయించేవారు. జిల్లాకు చెందిన మంత్రులకైతే రోజుకు 30 నుంచి 40 వీఐపీ బ్రేక్‌ దర్శనాలు కూడా కేటాయించేవారు. టికెట్ల బ్లాక్‌ అమ్మకాలు ఎక్కువయ్యాయనే విమర్శలూ ఉండేవి. బోర్డు సభ్యులే దుకాణాలు తెరిచేశారని ఆరోపణలు హోరెత్తేవి. ఫలితంగా సాధారణ భక్తులకు చుక్కలు కనిపించేవి. గంటలకు గంటలు పడిగాపులు తప్పేవి కావు. క్యూలైన్లలో వీరికి అన్నపానీయాలు సరిగా అందడంలేదనే విమర్శలుండేవి. ఈ ఏడాదిలో చాలా మార్పులు జరిగాయి. బ్లాక్‌ మార్కెట్‌ దాదాపుగా అరికట్టారు. దాదాపు వెయ్యి మందిపై కేసులు నమోదు చేశారు. వీఐపీలకు టికెట్ల కేటాయింపు పరిమితిని బాగా కుదించారు. క్యూలైన్‌లలో చంటిపిల్లలకు తిరిగి పాలు అందిస్తున్నారు. సులభంగా తక్కువ సమయంలో దర్శనం అయ్యేందుకు ఏఐ ఆధారిత వ్యవస్థను ఉపయోగించుకోవాలని టీటీడీ భావిస్తోంది.

‘ఉచిత టోకెన్‌ తీసుకుని వచ్చాం. రెండు గంటల్లోనే దర్శనం పూర్తయింది. సెలవులు కదా ఎక్కువ సమయం పడుతుందేమో అనుకున్నాం. కానీ త్వరగానే బయటకు వచ్చేశాం. తోపులాటలు కూడా ఎక్కడా కనిపించలేదు. ఎక్కడిక్కడ అన్నప్రసాదాలు, మజ్జిగ, పాలు ఇస్తున్నారు.

- వెంకటలక్ష్మీ, విజయవాడ’

దర్శనం ఉంటేనే వసతి

తిరుమలలో ప్రశాంతంగా ఒకరోజు గడపాలంటే గతంలో కుదిరేది కాదు. వైసీపీ పాలనలో రెకమండేషన్‌ ఉంటేనే వసతి దొరికేది. బ్లాక్‌ వ్యాపారం విచ్చలవిడిగా సాగేది. మఠాలు కూడా లాడ్జీల్లా మారిపోయి డబ్బు చేసుకునేవి. ఈ ఏడాదిలో వసతి పొందే పద్ధతుల్లో అనేక మార్పులు జరిగాయి. నకిలీ ఆధార్‌లతో గదులను బ్లాక్‌లో అమ్ముతున్న ముఠాలను గుర్తించి కేసులు పెట్టారు. దర్శనం టికెట్‌ లేదా టోకెన్‌ ఉన్నవారికే ఇప్పుడు తిరుమలలో వసతి దొరుకుతోంది. గది తీసుకున్నవారే ఖాళీచేయాలనే నిబంధన పెట్టారు. ముఖగుర్తింపును ప్రవేశపెట్టడంతో బ్లాకువీరులకు గండిపడింది. ఖాళీ అయ్యేదాకా కొంత వేచి ఉండాల్సి వస్తోంది కానీ ఇప్పుడు తిరుమలలో వసతి దొరుకుతోందనే అభిప్రాయం భక్తుల్లో కలుగుతోంది.

కీలక నిర్ణయాలు..

కూటమి ప్రభుత్వంలో గతేడాది నవంబరు 6న బీఆర్‌ నాయుడు సారధ్యంలో టీటీడీ కొత్త ధర్మకర్తల మండలి ఏర్పాటయ్యాక అనేక మార్పులు జరిగాయి.

-తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలకు బ్రేక్‌ పడింది. ఉల్లంఘిస్తే కేసులు పెట్టేలా తీర్మానం చేశారు.

- జగన్‌ జమానాలో నిబంధనలతో నిమిత్తం లేకుండా యదేచ్ఛగా నిర్మాణాలు సాగించిన శారదమఠం లీజును రద్దు చేశారు.

-అన్యమత ఉద్యోగులను తిరుమల నుంచి పంపేలా నిర్ణయం తీసుకున్నారు.

-గత ప్రభుత్వంలో టూరిజం కోటా పేరుతో దర్శనాల వ్యాపారం సాగుతోందని గుర్తించి, దానిని రద్దు చేశారు.

-తిరుపతి, తిరుమల స్థానికులకు దర్శనం విధానాన్ని తిరిగి అమలుచేస్తున్నారు.

- టీటీడీ సేవలపై భక్తుల అభిప్రాయ సేకరణ కోసం ‘ఫీడ్‌బ్యాక్‌ సిస్టమ్‌’ను తీసుకువచ్చారు.

- తిరుమలలోని అతిథిగృహాలకు దాతల సొంతపేర్లును తొలగించి, ఆధ్యాత్మిక, దేవుళ్ల పేర్లు మాత్రమే ఉండేలా నిర్ణయం తీసుకున్నారు.

-ప్రతి రాష్ట్ర రాజధానిలోనూ శ్రీవారి ఆలయం నిర్మించాలని తీర్మానించారు.

- అలిపిరిలో ప్రయివేటు నిర్మాణాలు ఉండరాదంటూ ఆ భూములకు ప్రత్యామ్నాయ స్థలాను కేటాయించేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది.

Updated Date - Jun 13 , 2025 | 01:34 AM