గాలివాన బీభత్సం
ABN, Publish Date - May 05 , 2025 | 01:48 AM
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. తిరుపతిలో దాదాపు రెండు గంటల పాటు వణికించింది. ఈదురు గాలులకు పలు చెట్లు నేలకొరిగాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు కూలాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో పాటు ఓ మోస్తరు వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు నీరు పొంగి పొర్లాయి.
తిరుపతి, మే 4 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలుచోట్ల ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. తిరుపతిలో దాదాపు రెండు గంటల పాటు వణికించింది. ఈదురు గాలులకు పలు చెట్లు నేలకొరిగాయి. హోర్డింగులు, ఫ్లెక్సీలు కూలాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులతో పాటు ఓ మోస్తరు వర్షం కురవడంతో రోడ్లపై వర్షపు నీరు పొంగి పొర్లాయి. దాదాపు రెండు గంటలపాటు వాహనదారులు రోడ్లపైకి వచ్చేందుకు భయపడ్డారు. నాయుడుపేట, గూడూరులో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఈక్రమంలో పడిన పిడుగులకు నాయుడుపేట, ఓజిలి, చిల్లకూరు మండలాల్లో ముగ్గురు మృతిచెందారు. రేణిగుంట రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండు సమీపంలో వర్షపు నీరుతో పాటు మురుగునీరు రోడ్డుపైకి రావడంతో యాత్రికులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు మామిడి కాయలు నేలరాలడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
తిరుపతిలో విరిగిన వందేళ్ల వృక్షం
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ ఆలయ సమీపంలో వందేళ్ల నాటి వృక్షం ఈదురుగాలులకు సగ భాగం విరిగి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ ఆటో డ్రైవర్‌కు చిన్నపాటి గాయాలయ్యాయి. కర్నాల వీధిలో మరో చెట్టు నేలకొరిగింది,. సాయినగర్‌లో చెట్టుకొమ్మ విరిగి పడడంతో ఆటో ధ్వంసమైంది. ద్వంసమైంది. వేర్వేరు చోట్ల చెట్లు పడి ఓ కారు, జీపు, రెండు బైకులు దెబ్బతిన్నాయి.
విద్యుత్తు సరఫరాకు అంతరాయం
గాలులకు పలు కరెంటు స్తంభాలు నేలకొరిగాయి. పలుచోట్ల చెట్లు, ఫ్లెక్సీలు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. ఈ ఘటనలతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్తు శాఖ అధికారులు స్పందించి త్వరితగతిన సరఫరాను పునరుద్ధరించారు. ఇక, తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో ఈదురుగాలుల కారణంగా ట్రాన్స్‌ఫార్మర్‌పై చెట్టుకూలింది. ఇక్కడ మరమ్మతులు చేయడానికి వెళ్లిన సచివాలయ జేఎల్‌ఎం మురళి గాయపడగా, ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కేవీబీపురంలో విద్యుత్ సబ్ స్టేషన్‌పై చెట్టు కూలడంతో సరఫరా ఆగింది. ఇలా.. వర్షం కారణంగా తిరుపతి నగరంలో పలుచోట్ల చెట్లకొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. కార్పొరేషన్, ఎస్పీడీసీఎల్ అధికారులు రంగప్రవేశం చేసి సాయంత్రానికి సమస్యలను పరిష్కరించారు.
జాతర వాన అంటూ..
ప్రతిసారి తిరుపతి గంగజాతర చాటుకు ముందు చిన్నపాటి గాలులతో కూడిన వర్షం పడుతుందని స్థానికులు చెబుతుంటారు. ఈ క్రమంలో గంగజాతరకు మంగళవారం జరగనున్న చాటింపునకు ముందు వర్షం పడడంపై జాతరవానగా భక్తులు విశ్వసిస్తున్నారు. జాతర మొదలవ్వబోతుందన్న సంకేతాన్ని గాలివాన ద్వారా వచ్చిందని, వర్షంతో నగరం చల్లబడిందని సోషల్ మీడియాలో అమ్మవారి భక్తులు పోస్టులు పెడుతున్నారు.
బడుగులపై ‘పిడుగు’
వద్దిగుంట కండ్రిగలో వ్యవసాయ కూలీ మృతి
నాయుడుపేట టౌన్, మే 1 (ఆంధ్రజ్యోతి): నాయుడుపేట మండలం వద్దిగుంట కండ్రిగ గ్రామంలో వరినాట్లు వేయడానికి వ్యవసాయ కూలీ ఆనాల భాస్కర్(50) వెళ్లారు. ఒక్కసారిగా ఉరుములు మెరుపులతో భారీ వర్షం రావడంతో సమీపంలోని చెట్టుకిందకు చేరారు. అదే సమయంలో పిడుగుపడడంతో అక్కడికక్కడే కుప్పకూలారు. స్థానికులు ఆయన్ను నాయుడుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
బాతుల కాపరి మృతి
చిల్లకూరు మండలం కాకువారిపాళెం సమీపంలోని పొలాల్లో ఆదివారం పిడుగుపడి బాతుల కాపరి మునీంద్ర (30) మృతిచెందారు. వాకాడు మండలం బాలిరెడ్డిపాళేనికి చెందిన ఈయన కాకువారిపాళెం సమీపంలోని పొలాల్లో బాతులు మేపుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు.
తాటికాయలు తీసుకొస్తుండగా..
ఓజిలి మండలం గ్రద్దగుంట పంచాయతీ గొల్లపాళేనికి చెందిన మారుబోయిన కార్తీక్ (12) తాటికాయులు తీసుస్తుండగా పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. నాయుడుపేటలో ఏడో తరగతి చదువుతున్న ఇతడు, వేసవి సెలవుల్లో ఇంటికొచ్చాడు. మరో బాలుడితో కలిసి ఆదివారం సమీప పొలాల్లో తాటికాయల కోసం వెళ్లాడు. కార్తీక్ బాబాయి వారికి తాటికాయలు కొట్టించి.. వర్షం వస్తుండటంతో ఇంటికి పంపేశారు. ఇంటికి సమీపానికి వచ్చేసరికి జల్లులతో పాటు పిడుగు పడటంతో కార్తీక్ అక్కడికక్కడే మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో బాలుడు స్పృహ తప్పి పడిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు నాయుడుపేటకు తరలించారు.
Updated Date - May 05 , 2025 | 01:48 AM