ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రూ.2510 కోట్లతో ఆరు వరసల రహదారి

ABN, Publish Date - May 02 , 2025 | 01:10 AM

రేణిగుంట నుంచి నాయుడు పేట వరకు.. 57 కిలోమీటర్లు, రూ.2510 కోట్లతో నిర్మించిన ఆరు వరసల జాతీయ రహదారిని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రహదారి జిల్లాను కోల్‌కతా-చెన్నై నేషనల్‌ హైవే-16తో అనుసంధానం చేసింది.

రేణిగుంట వద్ద ఆరు వరసల రహదారి

రేణిగుంట- నాయుడుపేట హైవేని నేడు వర్చువల్‌గా ప్రారంభించనున్న ప్రధాని

ఊపందుకోనున్న పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు

రేణిగుంట నుంచి నాయుడు పేట వరకు.. 57 కిలోమీటర్లు, రూ.2510 కోట్లతో నిర్మించిన ఆరు వరసల జాతీయ రహదారిని శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమరావతి నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ రహదారి జిల్లాను కోల్‌కతా-చెన్నై నేషనల్‌ హైవే-16తో అనుసంధానం చేసింది.

- తిరుపతి, ఆంధ్రజ్యోతి

వాస్తవానికి రేణిగుంట నుంచి నాయుడుపేటకు డబుల్‌ రోడ్డు మాత్రమే ఉండేది. 1996-2004 నడుమ వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో పూతలపట్టు- నాయుడుపేటకు ఫోర్‌ లేన్‌ రోడ్డు మంజూరైంది. భూసేకరణ సంబంధిత సమస్యలతో ప్రాజెక్టు సుదీర్ఘ కాలం పెండింగులో పడింది. 2014-19 నడుమ తిరిగి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు బంగారుపాలెం మండలం మొగిలి నుంచీ పూతలపట్టు మండలం రంగంపేట, చంద్రగిరి, తిరుపతి మీదుగా నాయుడుపేటకు సిక్స్‌ లేన్‌ రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు వెళ్లాయి. కేంద్రం వెంటనే ఆమోదించినా భూసేకరణ విషయంలో పలువురు రైతులు కోర్టును ఆశ్రయించారు. ఆ క్రమంలో మొగిలి నుంచి చంద్రగిరి వరకూ పనులు పూర్తయ్యాయి. చంద్రగిరి నుంచి రేణిగుంట వరకూ చాలాచోట్ల పెండింగులో ఉన్నాయి. ఇక, రేణిగుంట- నాయుడుపేట నడుమ 2022 జనవరి 31న పనులు ప్రారంభమయ్యాయి. హైబ్రిడ్‌ ఆన్యుటీ మోడ్‌ పద్ధతిలో నిర్మాణం జరిగింది. సిక్స్‌ లేన్‌ రోడ్డుకు అనుబంధంగా అన్ని గ్రామాల వద్దా సర్వీసు రోడ్లు, 3 రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జిలు, 5 వెహిక్యులర్‌ అండర్‌ పాస్‌లు, 7 ఫ్లై ఓవర్లు, 15 బ్రిడ్జిలు, 56.827 కిలోమీటర్ల డ్రైన్లు కూడా నిర్మించారు.

సిక్స్‌ లేన్‌ రోడ్డుతో ప్రమాదాలకు చెక్‌

రేణిగుంట- నాయుడుపేట సిక్స్‌ లేన్‌ రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో రోడ్డు ప్రమాదాలకు చెక్‌ పెట్టినట్టయింది. ఇది వరకు డబుల్‌ రోడ్డు ఉండేటప్పుడు విపరీతమైన ట్రాఫిక్‌ వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. సగటున ఏడాదికి యాభై మందికిపైగా మృత్యువాత పడేవారు. క్షతగాత్రుల సంఖ్య మరీ ఎక్కువగా వుండేది. ఈ మార్గంలో ప్రయాణమంటేనే వాహనదారులు, ప్రయాణికులు భయపడే వారు. ద్విచక్ర వాహనాలు నడిపే వారైతే.. రాత్రిళ్లు ఏ వాహనం ఢీకొట్టి వెళ్లిందో కూడా తెలిసే అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు ఆరు వరుసల రోడ్డు కావడంతో వాహనాల ఓవర్‌ టేకింగ్‌ సమస్య కావడం లేదు. ఫలితంగా ప్రమాదాలు జరిగే అవకాశాలు తగ్గాయి.

తగ్గిన ప్రయాణ సమయం

ఇదివరకూ రేణిగుంట-నాయుడుపేట నడుమ 55 కిలోమీటర్లు బస్సులో వెళ్లాలంటే రెండు గంటలు.. కార్లు, జీపులైతే గంటన్నర సమయం పట్టేది. ఇపుడు సిక్స్‌ లేన్‌ రోడ్డు పూర్తి కావడంతో మరో రెండు కిలోమీటర్ల దూరం పెరిగినా.. బస్సులో గంట, కార్లు, జీపుల్లో అయితే 45 నిమిషాల్లో చేరుకోగలుగుతున్నారు.

ఊపందుకోనున్న పారిశ్రామిక, ఆర్థిక కార్యకలాపాలు

సిక్స్‌ లేన్‌ రోడ్డు నిర్మాణం.. ఈ ప్రాంత స్వరూప స్వభావాలను సమూలంగా మార్చివేయనుంది. అభివృద్ధి అవకాశాలు గణనీయంగా పెరగనున్నాయి. నాయుడుపేట నుంచీ దక్షిణంగా తడ పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. నాయుడుపేట కూడా పారిశ్రామిక కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే ఆ మండలంలో మేనకూరు సెజ్‌తో పాటు ఏపీఐఐసీకి చెందిన పారిశ్రామిక వాడలున్నాయి. నాయుడుపేట నుంచీ ఉత్తరంగా కోట, చిల్లకూరు, గూడూరు వైపు సాగరమాల, భారత్‌మాల రోడ్డు ప్రాజెక్టులు, క్రిస్‌ సిటీ వంటి అభివృద్ధి ప్రాజెక్టులు శరవేగంగా రూపు దిద్దుకుంటున్నాయి. ఈ రోడ్‌ కనెక్టివిటీ ఏర్పడడం వల్ల వరదయ్యపాలెం, సత్యవేడు మండలాల్లోని శ్రీసిటీ, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, ఏర్పేడు మండలాల్లోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కులకు ప్రాధాన్యం పెరుగుతోంది. అంతిమంగా పారిశ్రామిక, ఆర్థిక కార్యలాపాలు జోరందుకోనున్నాయి. దీనివల్ల జిల్లాకు, రాష్ట్రానికి ఆర్థికాదాయంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి. ఇంకో వైపు రియల్‌ఎస్టేట్‌ పరంగా భూముల విలువ గణనీయంగా పెరగనుంది. దానివల్ల రైతులు, స్థలాల యజమానులు ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశాలు ఏర్పడుతున్నాయి.

Updated Date - May 02 , 2025 | 01:10 AM