ఆగి..సాగిన ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్
ABN, Publish Date - Jun 12 , 2025 | 01:02 AM
సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అభ్యంతరాల నడుమ సాగుతోంది. రావాల్సిన పాయింట్లు రాకపోవడంతో అర్హత ఉన్నా, అనుకూల ప్రాంతాలు రాలేదంటూ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కౌన్సెలింగ్ ప్రక్రియలో పలు అభ్యంతరాలు లేవనెత్తారు.చిత్తూరు షర్మన్ మెమోరియల్ బాలికల పాఠశాలలో మంగళవారం రాత్రి 10.50 గంటలకు డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన మొదలైన ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ బుధవారం తెల్లవారుజాము 3 గంటల వరకు సాగింది.
స్పౌజ్ అంశంలో సమస్యలు
ఉపాధ్యాయ సంఘ నేతలతో డీఆర్వో చర్చలు
చిత్తూరు సెంట్రల్, జూన్ 11(ఆంధ్రజ్యోతి):సెకండరీ గ్రేడ్ టీచర్ల (ఎస్జీటీ) బదిలీ కౌన్సెలింగ్ ప్రక్రియ అభ్యంతరాల నడుమ సాగుతోంది. రావాల్సిన పాయింట్లు రాకపోవడంతో అర్హత ఉన్నా, అనుకూల ప్రాంతాలు రాలేదంటూ టీచర్లు, ఉపాధ్యాయ సంఘాల నేతలు కౌన్సెలింగ్ ప్రక్రియలో పలు అభ్యంతరాలు లేవనెత్తారు.చిత్తూరు షర్మన్ మెమోరియల్ బాలికల పాఠశాలలో మంగళవారం రాత్రి 10.50 గంటలకు డీఈవో వరలక్ష్మి అధ్యక్షతన మొదలైన ఎస్జీటీల బదిలీ కౌన్సెలింగ్ బుధవారం తెల్లవారుజాము 3 గంటల వరకు సాగింది. 203మంది ఎస్జీటీలకు బదిలీలు పూర్తి చేశారు. 204వ టీచర్ బదిలీ వచ్చే సరికి స్పౌజ్ సమస్య తలెత్తడంతో దాన్ని నివారించడానికి ఉదయం 6.45 గంటలైంది. ఆపై కొనసాగుతూ ఉదయం 10.50 గంటల వరకు 212 వరకు చేరుకుంది. తర్వాత కూడా స్పౌజ్ అంశంలో సమస్యలు తలెత్తడం విద్యాశాఖ అధికారులకు తలనొప్పిగా మారింది.మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉపాధ్యాయ సంఘాల నేతలకు విద్యాశాఖాధికారుల మధ్య సుధీర్ఘ వాదనలు సాగాయి. సమస్య తీవ్రతరం కావడంతో డీఈవో వరలక్ష్మి పరిస్థితులను కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు, విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు దృష్టికి తీసుకుపోయారు. ఈ క్రమంలో కలెక్టర్ ఆదేశాలతో డీఆర్వో మోహన్ కుమార్ రంగంలోకి దిగారు. దాదాపు 45 నిమిషాల పాటు ఉపాధ్యాయ సంఘాల నేతలు లేవనెత్తిన పలు సమస్యలపై డీఈవోతో పాటు ఫోన్లో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌తోనూ సమీక్షించారు.ఉపాధ్యాయ సంఘాలు లేవనెత్తిన అంశాలు సరైనవి కావని స్పష్టం చేశాక కౌన్సెలింగ్ సజావుగా జరిగేలా చూడాలని కోరారు.దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పలువురు ఉపాధ్యాయులు తమకు బదిలీ వద్దంటూ వెళ్లిపోయారు.డీఆర్వో దగ్గరుండి బదిలీ ప్రక్రియను కొనసాగించడంతో రాత్రి 7.15 గంటల వరకు 350 మంది టీచర్ల బదిలీ కౌన్సెలింగ్ పూర్తయింది. ఆపై 351 నుంచి 500 వరకు బదిలీ కౌన్సెలింగ్ కొనసాగించారు. కాగా గురువారం ఉదయం 11 గంటలకు 501 నుంచి వెయ్యి మంది వరకు బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు డీఈవో వరలక్ష్మి ప్రకటించారు.తిరుపతి డీఈవో కుమార్, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య డీవైఈవోలు, చిత్తూరు ఏడీలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.
Updated Date - Jun 12 , 2025 | 01:02 AM