ఉపాధ్యాయ ఖాళీలు ఏడు వేలు...!?
ABN, Publish Date - May 16 , 2025 | 01:15 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన బదిలీలకు రంగం సిద్ధం కొలిక్కి వచ్చిన హేతుబద్ధీకరణ ప్రక్రియ తుది గణాంకాలు లెక్కగడుతున్న విద్యాశాఖ
చిత్తూరు సెంట్రల్, మే 15 (ఆంధ్రజ్యోతి): బడుల పునర్వ్యవస్థీకరణ, ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ ప్రక్రియలు పూర్తయిన నేపథ్యంలో టీచర్ల బదిలీలు చేపట్టేందుకు విద్యాశాఖ సిద్ధమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రాతిపదికన నిర్వహించే బదిలీలకోసం చేపట్టిన ఖాళీల గుర్తింపు ప్రక్రియ కొలిక్కి వచ్చింది. తుది గణాంకాలను విద్యాశాఖ అధికారులు లెక్కలు కడుతున్నారు. ఏ ఒక్క పోస్టూ బ్లాక్ చేయకుండా, ఖాళీలు చూపేందుకు చర్యలు చేపట్టారు.మొత్తం 66 మండలాలకు సంబంధించి ఏడు వేల ఉపాధ్యాయ ఖాళీలు చూపనున్నారు. బదిలీ ప్రక్రియలో భాగంగా పాఠశాల, మండల, డివిజన్, జిల్లా స్థాయుల్లో క్యాడర్లవారీగా ఖాళీలను గుర్తించడంతోపాటు మరణించిన , వీఆర్‌ఎస్ తీసుకున్న, రిటైరైన ఉపాధ్యాయుల స్థానాలు, ఐదేళ్లు పూర్తి చేసుకున్న హెచ్‌ఎం, 8 ఏళ్లు పూర్తి చేసుకున్న టీచర్ల స్థానాలు, స్టడీ సెలవులపై వెళ్లిన ఉపాధ్యాయుల ఖాళీలు, పోస్కో కేసులు నమోదు కావడంతో వెళ్లిన వారి స్థానాలను క్లియర్ వేకెన్సీలుగా చూపనున్నారు. ఇప్పటికే 37 విభాగాల్లో టీచర్లు పనిచేస్తున్న చోట్ల ఉన్న 1918 వాటిని క్లియర్ వేకెన్సీలుగా చూపించారు. వీటితోపాటు మరో 5,082 ఖాళీలు చూపనున్నారు. ఒకే పాఠశాలలో ఐదేళ్లు పూర్తి చేసిన హెచ్‌ఎంలు, 8 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ కానున్న నేపథ్యంలో వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖాళీల జాబితాను సిద్ధం చేశారు. 5/8 ఏళ్లపాటు ఒకేచోట పనిచేసిన టీచర్ల ఖాళీలు 3వేలుండగా, మిగులు (సర్‌ప్లస్) కింద 500, స్కూల్ కొత్త పోస్టులు (రీఅపోషినేట్), ఒక యాజమాన్య పాఠశాల నుంచి మరో యాజమాన్య పాఠశాలకు వెళ్లిన (షిఫ్టెడ్) ఖాళీలు 1,582 చూపుతున్నారు.
Updated Date - May 16 , 2025 | 01:15 AM