షాదీమహళ్ల నిర్మాణానికి రూ.2.4 కోట్లు మంజూరు
ABN, Publish Date - Jul 16 , 2025 | 01:49 AM
పలమనేరు నియోజకవర్గంలో షాదీమహళ్ల నిర్మాణానికి, మరో రెండు షాదీమహళ్ల ఆధునికీకరణ, మరమ్మతు పనులకు మైనారిటీ సంక్షేమ శాఖ రూ.2.4 కోట్లు మంజూరు చేసింది.
పలమనేరు, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పలమనేరు నియోజకవర్గంలో షాదీమహళ్ల నిర్మాణానికి, మరో రెండు షాదీమహళ్ల ఆధునికీకరణ, మరమ్మతు పనులకు మైనారిటీ సంక్షేమ శాఖ రూ.2.4 కోట్లు మంజూరు చేసింది. గత టీడీపీ హయాంలో పలమనేరు, వి.కోట మండల కేంద్రాల్లో అప్పటి మంత్రి అమరనాథరెడ్డి షాదీమహళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి శంఖు స్థాపనలు చేశారు. 2018లో కాంట్రాక్టరు పనులు ప్రారంభించారు. అయితే 2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పనులు పూర్తిచేసేందుకు నిధులు విడుదల కాకపోవడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి.కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే షాదీమహళ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ప్రభుత్వంతో చర్చించారు. దీంతో పలమనేరు, వి.కోట ప్రాంతాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన షాదీమహళ్ల నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరు చేయడంతో పాటు పలమనేరులోని దండపల్లి రోడ్డు, జెండామఠంలోని షాదీమహళ్ల ఆధునికీకరణ పనుల కోసం ఒక్కో షాదీ మహల్‌కు రూ.20 లక్షల చొప్పున మైనారిటీ సంక్షేమ శాఖ మంజూరు చేసింది. దీనిపై ఇక్కడి ముస్లిం మైనారిటీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రమే మైనారిటీల సంక్షేమం జరుగుతోందని టీడీపీ మైనారిటీ సెల్ నాయకుడు ఖాజాపీర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చాంద్‌బాషా పేర్కొన్నారు.
Updated Date - Jul 16 , 2025 | 01:49 AM