ఇకపై చేరువగా రిజిస్ట్రేషన్ సేవలు
ABN, Publish Date - Apr 22 , 2025 | 01:19 AM
భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం చేసేలా ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలుకుతూ.. నేరుగా ప్రజలే రిజిస్ట్రేషన్ల కోసం సమయాన్ని నిర్ణయించుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా మూడు దశల్లో
30 నుంచి తిరుపతి జిల్లాలో అమలు
సెలవు దినాల్లోనూ రిజిస్ట్రేషన్లు
తిరుపతి, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): భూముల రిజిస్ట్రేషన్లు సులభతరం చేసేలా ప్రభుత్వం చురుగ్గా చర్యలు తీసుకుంటోంది. రిజిస్ట్రార్ కార్యాలయాల్లో గంటల తరబడి వేచి చూసే విధానానికి స్వస్తి పలుకుతూ.. నేరుగా ప్రజలే రిజిస్ట్రేషన్ల కోసం సమయాన్ని నిర్ణయించుకునేలా వెసులుబాటు కల్పిస్తోంది. గత నెల 10వ తేదీన విజయవాడలోని కంకిపాడులో ప్రయోగాత్మకంగా స్లాట్ బుకింగ్ విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నెల 4న రాష్ట్రంలోని 26 జిల్లా ప్రధాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ప్రారంభించింది. దశల వారీగా నెలాఖరులోగా రాష్ట్రంలోని అన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘స్లాట్ బుకింగ్’ సాగాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ నెల 21, 26, 30వ తేదీలల్లో మూడు విడతలత్లో మొత్తం రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. జోన్-4లోని జిల్లాలో మొత్తం 15 రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో(ఫేజ్-3) ఈ నెల 30వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ సేవలు మొదలవుతాయి. గూడూరు, కోట, నాయుడుపేట, సూళ్ళూరుపేట, వెంకటగిరితో పాటు చిన్నగొట్టిగల్లు, చంద్రగిరి, పాకాల, పిచ్చాటూరు, రేణిగుంట, సత్యవేడు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, తిరుపతి రూరల్, పుత్తూరు సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
స్లాట్ బుకింగ్ ఇలా...
పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) సిస్టమ్ ద్వారా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ ప్రారంభించవచ్చు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ముందస్తు అపాయింట్మెంట్‌కు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఎంపిక చేసుకున్న సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. తమ వివరాలు నమోదు చేశాక డిజిటల్ క్యూ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (డీక్యూఎంఎస్) ద్వారా రిజిస్ట్రేషన్ కోసం టోకెన్ తీసుకోవచ్చు. తర్వాత డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, వివాహ రిజిస్ట్రేషన్ లాంటి అవసరమైన సేవలను ఎంపిక చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసే ముందు రోజే ఆన్‌లైన్‌లో డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయడంతో పాటు ఫీజులు కూడా చెల్లించాలి. అనంతరం ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ప్రాతిపదికన సిస్టమ్ ద్వారా అప్‌లోడ్ చేసి డాక్యుమెంట్లను రిజిస్ట్రేషన్ అధికారులు పరిశీలించి సక్రమంగా ఉంటే ఆమోదిస్తారు. లేదా తప్పులున్న దస్తావేజులను కారణాలు సూచిస్తూ తిరస్కరించే అవకాశం ఉంది. ఒకవేళ, డీక్యూఎంఎస్ రద్దు చేసుకోవాలనుకుంటే రూ.100, మార్పు చేసుకోవాలంటే రూ.200 చెల్లించాలి.
ప్రయోజనాలు ఇవీ
స్లాట్ బుకింగ్ వల్ల సమయం ఆదాతో పాటు కార్యాలయాల చుట్టూ తిరిగే వెతలు తగ్గుతాయి. నిర్ణీత సమయంలోనే కార్యాలయంలో హాజరు కావచ్చు. అనధికార కార్యాకలాపాలు, నకిలీ రిజిస్ట్రేషన్లు కూడా అరికట్టవచ్చు. ఇకపై సెలవు దినాల్లోనూ రిజిస్ట్రేషన్ సేవలు పొందవచ్చు. సమయం ఆదాతో పాటు దళారుల్లేని పారదర్శక సేవలను ప్రజలకు అందించాలన్నది ప్రభుత్వ సంకల్పం. అయితే, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలకమైన పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) అనుభవజ్ఞులు, అవగాహన ఉన్న వారికే సాధ్యమయ్యే పని. సామాన్యులకు అంతగా అర్థమయ్యే విషయం కాదు. మరి ఆచరణకు వచ్చే సరికి ఈ సమస్యను ఎలా అధిగమించాల్సి ఉంటుందనేది చూడాలి.
Updated Date - Apr 22 , 2025 | 01:19 AM