కేంద్ర ప్రకటనతో రాష్ట్రంపై తగ్గిన భారం
ABN, Publish Date - Jul 23 , 2025 | 12:10 AM
మామిడి రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది.
చిత్తూరు, జూలై 22 (ఆంధ్రజ్యోతి): మామిడి రైతులకు సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. కిలోకు రూ.1.86 ఇవ్వనుంది. మామిడి రైతుల నుంచి డిమాండ్లు, నిరసనలు రాకముందే జిల్లాలో పరిస్థితిని అర్థం చేసుకున్న సీఎం చంద్రబాబు కిలోకు రూ.4 సబ్సిడీ ప్రకటించేశారు. కర్ణాటకలో మామిడి రైతుల పరిస్థితుల్ని వివరిస్తూ అక్కడి కేంద్రమంత్రి కుమారస్వామి కేంద్రానికి లేఖ రాశారు. ఆయన లేఖకు స్పందించిన కేంద్రం అనేక ఆంక్షలు పెట్టి రూ.16 మద్దతు ధర, అందులో 25 శాతం సబ్సిడీ, దాంట్లో మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 50ః50 నిష్పత్తిలో వాటా వేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఓ హెక్టారు నుంచి 13 టన్నుల కాయలు దిగుబడి అయితే 5 టన్నుల్నే కొనుగోలు చేస్తూ, అది కూడా రెండు హెక్టార్లకే లిమిటేషన్ పెట్టింది. దీంతో అత్యధిక తోపులున్న ఓ రైతుకు గరిష్ఠంగా రూ.40 వేల సబ్సిడీ అందుతుంది. కానీ, మన వద్ద గరిష్ఠం అంటూ ఏం లేదు. రూ.2 లక్షల సబ్సిడీ పొందే రైతులు కూడా ఉన్నారు.
సాయం కోరుతూ కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ
కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో రైతులకు సబ్సిడీ ప్రకటించాక సీఎం చంద్రబాబు కూడా కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్రంలోని తోతాపురి రైతులకు సబ్సిడీ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. స్పందించిన కేంద్రం మంగళవారం ఉత్తర్వుల్ని విడుదల చేసింది.
కేంద్రం రూ.1.86.. రాష్ట్రం రూ.2.14
మన వద్ద కేంద్రం కిలోకు మద్దతు ధర రూ.14.90గా నిర్ణయించింది. అందులో 25శాతం సబ్సిడీ అందించనుంది. అంటే రూ.3.72 అన్నమాట. అందులో మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాన వాటా వేసుకోవాలి. అంటే కేంద్రం రూ.1.86, రాష్ట్రం రూ.1.86గా వాటా వేసుకుని రైతుకు రూ.3.72 అందించాలి. ఈ లెక్కన ఇప్పటికే సీఎం చంద్రబాబు రూ.4 సబ్సిడీ ప్రకటించిన నేపథ్యంలో రైతులకు కిలోకు 28 పైసలు నష్టం వస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ 28 పైసల్ని భరించనుంది. అంటే కేంద్రం రూ.1.86 ఇస్తే, రాష్ట్రం రూ.2.14 ఇస్తుంది. మొత్తంగా రైతులకు రూ.4 సబ్సిడీ అందించేందుకు జిల్లా అధికార యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. నెల రోజుల్లో రైతుల ఖాతాల్లో నిధులు పడే అవకాశాలున్నాయి.
ప్రాసెస్ అయిపోయిన 3.25 లక్షల టన్నులు
ఇప్పటివరకు జిల్లాలో 3.25 లక్షల టన్నుల కాయల్ని ఫ్యాక్టరీలు, ర్యాంపులు కొనుగోలు చేయగా.. ఇంకా 15వేల టన్నుల కాయలు చెట్లకు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం ఏడు ఫ్యాక్టరీలు, తొమ్మిది ర్యాంపులు పనిచేస్తున్నాయి. సీజన్‌లో రోజుకు 10-11వేల టన్నుల కాయలు ప్రాసెస్ అయ్యేవి. ప్రస్తుతం సీజన్ ముగింపు దశలో రోజుకు వెయ్యి టన్నుల కాయలే ప్రాసెస్ అవుతున్నాయి. మరో నాలుగైదు రోజుల్లో సీజన్ ముగిసే అవకాశం ఉంది. ఫ్యాక్టరీల్లో, ర్యాంపులు కాయల్ని అమ్మిన రైతుల జాబితాలను రైతు సేవా కేంద్రాల్లోని సిబ్బంది రీవెరిఫికేషన్ చేస్తున్నారు.
కేంద్ర సాయం రూ.82 కోట్లు
జిల్లాలో ఇప్పటివరకు 3.25 లక్షల టన్నుల కాయలు ప్రాసెస్ అయ్యాయి. మరో 15వేల టన్నులు ఉన్నాయనుకుంటే మొత్తం 3.40 లక్షల టన్నుల కాయలకు సబ్సిడీ రానుంది. అంటే కిలో రూ.4, టన్నుకు రూ.4వేల చొప్పున 3.40 లక్షల టన్నుల కాయలకు రూ.136 కోట్ల సబ్సిడీ రైతులకు వస్తుంది. ఇందులో కేంద్రం టన్నుకు రూ.1860 చొప్పున ఇస్తే మొత్తంగా జిల్లాకు రూ.63.24 కోట్లు వస్తుంది. మిగిలిన రూ.72.76 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ భరించనుంది. ఇదే తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కలిపి లక్ష టన్నుల కాయల్ని ప్రాసెసింగ్ చేయగా.. కేంద్రం రూ.18.60 కోట్లను, రాష్ట్రం రూ.21.40 కోట్లను రైతులకు అందించనుంది. మొత్తంగా ఉమ్మడి జిల్లాకు కేంద్రం రూ.81.84 కోట్లను, రాష్ట్రం రూ.94.16 కోట్లను రైతులకు సాయం చేయనున్నాయి. తుది లెక్కలు వచ్చాక ఈ డబ్బులో స్వల్ప వ్యత్యాసం ఉండొచ్చు.
Updated Date - Jul 23 , 2025 | 12:10 AM