Elephant: ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలు
ABN, Publish Date - Jan 21 , 2025 | 12:55 AM
పంటలపై ఏనుగుల దాడిని నివారించడానికి, వాటిని అడవుల్లోకి మళ్లించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ తెలిపారు.
తిరుపతి(మంగళం), జనవరి 20 (ఆంధ్రజ్యోతి): పంటలపై ఏనుగుల దాడిని నివారించడానికి, వాటిని అడవుల్లోకి మళ్లించడానికి ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను ఏర్పాటు చేశామని జిల్లా అటవీ శాఖ అధికారి వివేక్ తెలిపారు. తిరుపతిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎలిఫెంట్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలో పదిమంది ఉంటారని, ఇలా మూడు టీంలను ఏర్పాటు చేశామన్నారు. ఇవి సబ్ డివిజనల్ ఫారెస్టు అఫీసర్ పర్యవేక్షణలో పనిచేస్తాయన్నారు. డ్రోన్ల సాయంతో ఏనుగుల గుంపు కదలికలను పరిశీలిస్తారన్నారు. ఎప్పటికప్పుడు వాటిని గుర్తించి పంచాయతీ, అగ్రికల్చర్ అసిస్టెంట్, విద్యుత్‌శాఖ, అటవీశాఖకు చెందిన అధికారులతో ఏర్పాటు చేసిన వాట్సాప్ గ్రూప్‌లకు సమాచారం అందిస్తారన్నారు. వారు తమ పరిధిలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తారని వివరించారు. ఏనుగుల కట్టడికి గ్రామస్తుల సహకారం అవసరమన్నారు. కాగా, 9 నెలలుగా ఏనుగుల గుంపు చంద్రగిరి మండలం కందులవారిపల్లె సమీపంలోని అటవీ ప్రాంతంలో తిరుగుతోందని, నెల క్రితమే వాటికి పిల్లలు కలిగాయని చెప్పారు. ట్రాకర్ల ద్వారా ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలో మళ్లించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల పరిధిలో ప్రచార జాతాలు, టోల్‌ఫ్రీ నెంబరు ఏర్పాటును పరిశీలిస్తున్నామన్నారు.
Updated Date - Jan 21 , 2025 | 12:55 AM