రైతులకు రాజముద్ర
ABN, Publish Date - Jul 24 , 2025 | 01:58 AM
వైసీపీ పాలనా కాలంలో సచివాలయాల్లో ఇచ్చే జనన, మరణ వంటి ధ్రువపత్రాలపైనా తన ఫొటోను వేసుకున్న జగన్.. రైతులను కూడా వదల్లేదు. రీసర్వే చేశాక పొలాల సరిహద్దులు చూపుతూ నాటే రాళ్ల మీద, రైతులకు అందించే పట్టాదారు పాసుపుస్తకాల మీద తన ఫొటోలు ముద్రించుకున్నారు.
జిల్లాకు చేరిన 49 వేల పట్టాదారు పుస్తకాలు
రీసర్వే చేసి తన ఫొటోతో పుస్తకాలు పంపిణీ చేసిన జగన్
వాటిని వెనక్కి తీసుకుని కొత్తవి ఇస్తున్న చంద్రబాబు
చిత్తూరు, జూలై 23 (ఆంధ్రజ్యోతి): వైసీపీ పాలనా కాలంలో సచివాలయాల్లో ఇచ్చే జనన, మరణ వంటి ధ్రువపత్రాలపైనా తన ఫొటోను వేసుకున్న జగన్.. రైతులను కూడా వదల్లేదు. రీసర్వే చేశాక పొలాల సరిహద్దులు చూపుతూ నాటే రాళ్ల మీద, రైతులకు అందించే పట్టాదారు పాసుపుస్తకాల మీద తన ఫొటోలు ముద్రించుకున్నారు. ఆ పుస్తకాలను రద్దు చేసి రాజముద్రతో కొత్త పుస్తకాలను అందిస్తామని సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. గతేడాది జూలైలో జగన్ ఫొటోలతో ఉన్న పుస్తకాలను వెనక్కి తీసుకోగా, తాజాగా వాటి స్థానంలో కొత్త పుస్తకాలను అందించనున్నారు.
వైసీపీ ప్రభుత్వ హయాంలో శాశ్వత భూహక్కు- భూరక్ష పథకం కింద చేపట్టిన భూ రీసర్వేపై జిల్లాలో పెద్దఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. సర్వేలో లోపాలున్నాయని, రీ సర్వేతో తమ భూమి తగ్గిపోయిందని అనేక మంది రైతులు గగ్గోలు పెట్టారు. అయినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. భూహక్కు పత్రంపై పెద్దదిగా జగన్ ఫొటో ఉండడంపైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో ఎన్నికల సమయంలో చంద్రబాబు అనేక ప్రచార సభల్లో జగన్ ఫొటో ఉన్న పాసు పుస్తకాల్ని రద్దు చేసి రాజముద్రతో మళ్లీ కొత్త పుస్తకాల్ని పంపిణీ చేస్తానని మాటిచ్చారు. పుంగనూరు రోడ్‌షోలో జగన్ ఫొటోతో ఉన్న పుస్తకాన్ని చించి పడేశారు. అనుకున్నట్టే కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం చంద్రబాబు గతేడాది జూలైలో జగన్ ఫొటోలతో ఉన్న పాసుపుస్తకాలను వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. వాటి స్థానంలో కొత్త పుస్తకాలను అందించాలని గతేడాది ఆగస్టు 7న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.
‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు- భూరక్ష’ కార్యక్రమానికి చిత్తూరు జిల్లాలోని గుడిపాల మండలం ముత్తుకూరుపల్లెను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే ప్రారంభించారు. మూడు విడతల్లో భూ రీసర్వే చేయగా.. మొత్తం 329 గ్రామాల్లో 90,287 పుస్తకాల్ని పంపిణీ చేశారు. గతేడాది జూలైలో రెవెన్యూ అధికారులు వాటిని వెనక్కి తీసుకున్నారు. ఇప్పుడు రాజముద్రతో కూడిన 49 వేల పాసుపుస్తకాలు జిల్లాకు వచ్చాయి. 30 పుస్తకాలు ఓ సెట్టుగా ఉన్న వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. అన్నీ సరిచూసి మండలాలకు పంపించి, ఆగస్టు 15 నుంచి పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Updated Date - Jul 24 , 2025 | 01:58 AM