టమోటా పంటకు వాన దెబ్బ ..!
ABN, Publish Date - Jul 24 , 2025 | 02:03 AM
ఇటీవల కురిసిన వర్షాలకు టమోటా తోటలు బాగా దెబ్బతిన్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే వర్షం ప్రభావంతో కోతలు చేయకుండానే దెబ్బ తిన్నాయి.
ధరలున్నా కాయలు దెబ్బతినడంతో ఆందోళనలో రైతాంగం
సోమల, జూలై 23 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన వర్షాలకు టమోటా తోటలు బాగా దెబ్బతిన్నాయి. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి సాగు చేస్తే వర్షం ప్రభావంతో కోతలు చేయకుండానే దెబ్బ తిన్నాయి.సోమల మండలంలోనే దాదాపు 400 ఎకరాల్లో ఏప్రిల్, మే నెలల్లో నాటిన టమోటా రైతులు నష్టపోయారు.ఇన్నాళ్లూ టమోటా ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.ఇప్పుడు వర్షం దెబ్బతో పచ్చని తోటల్లో ఆకులు రాలిపోతున్నాయి. చీడపీడలు వ్యాప్తి చెంది కాయలపై నల్లని మచ్చలు, పగుళ్లు రావడంతో పండిన పంటను మార్కెట్‌కు తరలించలేక పొలాల వద్దే వదిలేస్తున్నారు.మూడు రోజులుగా టమోటా ధరలు పెరిగి 15 కిలోల బాక్సు ధర 600 రూపాయలకు చేరుకుంది. అయితే తోటల్లో ఉన్న పంటను మార్కెట్‌కు తరలిస్తే నాణ్యత లేని కాయలు కావడంతో రూ.100 లోపు ధర పలుకుతోంది. పుంగనూరు, పలమనేరు మార్కెట్‌కు రవాణా ఖర్చులే బాక్సుకు రూ.20 చెల్లించాలి. కమీషన్ 10శాతం వసూలు చేస్తారు. ఈ ధరకు పెట్టుబడి సైతం దక్కదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా సాగుకు ఎకరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. స్థిరమైన ధర లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనికి తోడు వర్షంతో దెబ్బతిన్న పంటకు ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందే పరిస్థితి లేదని తెలిసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యానశాఖ అధికారులు స్పందించి టమోటా పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - Jul 24 , 2025 | 02:03 AM