పుంగనూరు రోడ్డు నేడు జాతికి అంకితం
ABN, Publish Date - May 02 , 2025 | 01:25 AM
పుంగనూరు పట్టణంలో రూ.41 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన 10 కిలోమీటర్ల జాతీయ రహదారిని శుక్రవారం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు.
పుంగనూరు, మే 1(ఆంధ్రజ్యోతి): పుంగనూరు పట్టణంలో రూ.41 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించిన 10 కిలోమీటర్ల జాతీయ రహదారిని శుక్రవారం అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ జాతికి అంకితం చేయనున్నారు. వేలూరు-కర్నూలు జాతీయ రహదారిలోని పుంగనూరులో ఇరుకు రోడ్లు, వాహనాల రద్దీతో రోజూ ట్రాఫిక్ స్తంభిస్తూ వాహనచోదకులు తీవ్రంగా ఇబ్బంది పడేవారు. రోడ్డు ఆక్రమణలు, ట్రాఫిక్ పెరగడంతో మదనపల్లె నుంచి పుంగనూరు వచ్చే మార్గంలోని భీమగానిపల్లె నుంచి గూడూరుపల్లె మదరసా వరకు కేంద్రప్రభుత్వం బైపాస్ రోడ్డు నిర్మించింది. లారీలు , ఇతర వాహనాలు పట్టణంలోకి రాకుండానే మదనపల్లె, చిత్తూరు మార్గంలో ప్రయాణించే వాహనాలన్నీ బైపా్‌సలో వెళుతున్నాయి. ట్రాఫిక్ తగ్గినా స్థానిక వాహనాలు, పుంగనూరుకు వచ్చే ట్రాఫిక్ వల్ల ఇరుకు రోడ్లతో అవస్థలు తప్పలేదు.ఎంపీ మిథున్‌రెడ్డి ప్రతిపాదనలతో పట్టణంలో రోడ్డు విస్తరణ పనులను కేంద్రం మంజూరు చేసింది. భీమగానిపల్లె వద్ద కృష్ణదేవరాయల విగ్రహం సర్కిల్ నుంచి రాంపల్లె. కొత్తఇండ్లు, ఎన్టీఆర్ సర్కిల్, ప్రైవేటు బస్టాండ్, ఇందిరా సర్కిల్, ఎంబీటీ రోడ్డు, తూర్పుమొగసాల, గూడూరుపల్లె, పలమనేరు రోడ్డులోని మదరసా వరకు 10 కిలోమీటర్లు గతంలో ఉన్న 7 మీటర్ల వెడల్పు రోడ్డులో విస్తరణ పనులను ఎన్నికల క్రితం చేపట్టి ఆక్రమణలు తొలగించి 10 మీటర్లుకు పెంచారు. రూ.41కోట్లతో కేంద్రప్రభుత్వం జాతీయరహదారుల అధికారులతో పనులు చేయించింది. రోడ్డుకు ఇరువైపులా విద్యుత్ దీపాలు ఏర్పాటు, వాకింగ్ పుట్‌పాత్, పలుచోట్ల రోడ్డుపై పశువులు, వాహనాలు రాకుండా ప్రమాదాలు జరగకుండా ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు.ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబు శుక్రవారం అమరావతిలో పుంగనూరు రోడ్డును వర్చువల్‌గా ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు.
Updated Date - May 02 , 2025 | 01:25 AM