డీసీసీబీలో కొనసాగుతున్న విచారణ
ABN, Publish Date - Apr 20 , 2025 | 02:23 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు గత పాలకవర్గం చేసిన అవినీతి, అక్రమాలపై సహకారచట్టం సెక్షన్-51 కింద విచారణ చిత్తూరులోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతోంది.
బ్యాంకు మాజీ సీఈవో, బోర్డు డైరెక్టర్లు, చైర్‌పర్సన్ పీఏ హాజరు
చిత్తూరు కలెక్టరేట్, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు గత పాలకవర్గం చేసిన అవినీతి, అక్రమాలపై సహకారచట్టం సెక్షన్-51 కింద విచారణ చిత్తూరులోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతోంది.ఇప్పటివరకు 40 మంది సాక్షుల విచారణ జరిగింది.ఈనెల 24 లేదా 27వ తేదీతో విచారణ ముగియనున్నట్లు సమాచారం.ఐదేళ్ళ వైసీపీ పాలనలో అప్పటి పాలకవర్గ చైర్‌పర్సన్ ఎం. రెడ్డెమ్మ పదవీ కాలంలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా కలెక్టర్‌చే నియమితులైన డీఆర్వో మోహన్‌కుమార్ గతనెల 21వ తేది సెక్షన్-51పై 50మందికి నోటీసులు జారీచేస్తూ విచారణకు హాజరుకావాలని ఆదేశించారు. ఇప్పటివరకు 40 మంది హాజరుకావాల్సివుండగా, ఇద్దరుముగ్గురు తప్ప మిగిలినవారంతా హాజరై తమ వాంగ్మూలాలిచ్చారు. శనివారం బ్యాంకు మాజీ సీఈవో మనోహర గౌడ్, డైరెక్టర్లు షేక్ మస్తాన్ సాహెబ్, డి. హరినాథ రెడ్డి, టి. ఊతప్ప, చైర్‌పర్సన్ పీఏ సుధాకర్ విచారణకు హాజరై తమపై వచ్చిన అభియోగాలపై వివరణను అందజేశారు. అవసరమైతే మరో విడత విచారణ చేపట్టి తుది నివేదికను కలెక్టర్‌కు డీఆర్వో మోహన్‌కుమార్ అందజేయనున్నారు.
Updated Date - Apr 20 , 2025 | 02:23 AM