Police: వంద కిలోల గంజాయి పట్టివేత
ABN, Publish Date - Jan 09 , 2025 | 02:42 AM
జిల్లాలో రెండు చోట్ల 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా.
తిరుపతి(నేరవిభాగం), జనవరి 8(ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండు చోట్ల 100 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ రూ.25 లక్షలు ఉంటుందని అంచనా. చిల్లకూరు పోలీసులు 72 కిలోలు, నలుగురు నిందితులను.. తడ పోలీసులు 28 కిలోల గంజాయి, ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. ఈ వివరాలను బుధవారం తిరుపతిలో ఎస్పీ సుబ్బరాయుడు మీడియాకు వెల్లడించారు. ఆయన తెలిపిన ప్రకారం.. పుత్తూరుకు చెంది న మాజీ హోంగార్డు పసుపులేటి గిరిబాబు, తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరుకు చెందిన మదన్‌కుమార్, గుమ్మిడిపూడికి చెందిన పంజనాధన్, మునసుందరం కొంతకాలంగా కాకినాడ జిల్లా తుని నుంచి గంజాయి తీసుకొచ్చి పుత్తూరు, తమిళనాడు ప్రాంతాల్లో విక్రయించేవారు. గతంలో గిరిబాబుపై కేసు నమోదైంది. తాజాగా వీరు తుని నుంచి కారులో దాదాపు 72 కిలోల గంజాయి తీసుకొస్తున్నారనే ముందస్తు సమాచారం అందింది. దీంతో గూడూరు డీఎస్పీ రమణకుమర్, అతడి బృందం మంగళవారం రాత్రి చిల్లకూరు పోలీసు స్టేషన్ పరిధిలోని కడివేడు గ్రామం, కోట క్రాస్ రోడ్డు వద్ద వేచి ఉన్నారు. అతి వేగంగా ముందు పైలట్ చేస్తున్న మాజీ హోంగార్డు గిరిబాబు కారు వస్తుండగా వెనుక గంజాయి తీసుకొస్తున్న మరో కారు పోలీసులను చూసి తప్పించుకుని పోవడానికి ప్రయత్నించారు. కారులో వెళ్లిపోతుండగా పోలీసులు చేజ్ చేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో పోలీసు కారును సైతం ఢీకొట్టే ప్రయత్నం చేశారు. చివరకు రెండు కార్లు, దాదాపు 72 కిలోల గంజాయి స్వాధీనం పోలీసులు చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మళ్లీ వారిని కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు ఎస్పీ చెప్పారు.
తడ పరిధిలో...
తమిళనాడు రాష్ట్రం గుమ్మడిపూడికి చెందిన కె.షారూఖాన్, అదే ప్రాంతం సామిరెడ్డి కండ్రిగకు చెందిన జి. అరుళ్ గంజాయి అక్రమ రవాణాకు పాల్పడేవారు. ఈ క్రమంలో ముందుగా అందిన సమాచారం మేరకు తడ సర్కిల్ పరిధిలోని శ్రీసిటీ వద్ద పోలీసులు కాపుకాచారు. వీరు కారులో చెన్నైకు గంజాయి తరలించడానికి వస్తుండగా చేజ్ చేసి పట్టుకున్నారు. వీరి నుంచి 28 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, షారూఖాన్, అరుళ్‌ను అరెస్టు చేశారు.
శెహభాష్ డీఎస్పీ, సీఐలు
ఆరుగురు గంజాయి స్మగ్లర్లను పట్టుకోవడంలోప్రతిభ చూపిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ సుబ్బరాయుడు అభినందించారు. గూడూరు డీఎస్పీ రమణకుమార్, సీఐ కిషోర్‌బాబు, చిల్లకూరు ఎస్‌ఐ సురే్‌షబాబు, సిబ్బందిని.. తడ ఘటనలో నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు, సూళ్లూరుపేట సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ కొండప్పనాయుడు, సిబ్బంది ఉన్నారు. ఈ విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీ రవిమనోహరాచ్చారి, డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Updated Date - Jan 09 , 2025 | 02:42 AM