కోలాహలంగా మెగా పీటీఎం 2.0
ABN, Publish Date - Jul 11 , 2025 | 02:07 AM
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధాలను బలపరిచి.. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం శుక్రవారం జిల్లాలోని పాఠశాలల్లో కోలాహలంగా జరిగింది.
ఉత్సాహంగా పాల్గొన్న తల్లిదండ్రులు
3,198 పాఠశాలలు, కళాశాలల్లో సమావేశాలు
తిరుపతి(విద్య), జూలై 10(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య సంబంధాలను బలపరిచి.. ఉత్తమ ఫలితాలు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశం శుక్రవారం జిల్లాలోని పాఠశాలల్లో కోలాహలంగా జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ సారి ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లోనూ సమావేశాలు నిర్వహించారు. జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష అధికారుల ఆధ్వర్యంలో విద్యాశాఖ మార్గదర్శకాల ప్రకారం ఆహ్వాన కమిటీ, బడ్జెట్ కమిటీ, బడి సుందరీకరణ, పర్యావరణ పరిరక్షణ, రిసెప్షన్, సీటింగ్, విద్యార్థుల ప్రగతి నివేదికలు, స్టేజీ నిర్వహణ కమిటీలు పీటీఎం కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమాలను నిర్వహించారు. ఇందులో.. తల్లులకు రంగోలి, తండ్రులకు టగ్ ఆఫ్ వార్, పిల్లలకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ముఖ్య అతిథులు, తల్లిదండ్రులు, పిల్లలతో మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణ తెలియజేశారు. ఇంకా ఫొటోడ్రీమ్, పాజిటివ్ పేరెంటింగ్ సెషన్లను నిర్వహించారు. విద్యార్థులు ఇళ్లలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా పిల్లలు సెల్‌ఫోన్ల వాడకాన్ని నియంత్రించాలని సూచించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు, తద్వారా మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. చివరిగా ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులతో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రోగ్రెస్ రిపోర్టులను తల్లిదండ్రులకు చూపించారు. ఏయే పాఠ్యాంశాల్లో.. ఏ స్థాయిలో ఉన్నారో చెబుతూ ఇంటివద్ద చదివించేటప్పుడు దృష్టిపెట్టాల్సిన అంశాలను విశదీకరించారు. ఇలా తల్లిదండ్రులు తమ విద్యార్థుల విద్యాంస్థలకు వచ్చి... ఆటపాటలతో సందడిచేసి... పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో పాల్గొని... తమ పిల్లల ప్రగతి నివేదికలు తెలుసుకుని... వారి భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు చేపట్టాల్సిన చర్యలపై అవగాహన పెంచుకుని తిరిగివెళ్లారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,198 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్స్ 2.0 జరిగింది. ఈ విద్యాసంస్థల్లో మొత్తం 3,47,565 మంది విద్యార్థులు ఉన్నారని, వారితోపాటు వారి తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో అత్యధిక శాతం పాల్గొన్నారని అధికారులు వెల్లడించారు. తమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు భాగస్వాములయ్యారు.
Updated Date - Jul 11 , 2025 | 02:07 AM