సిండి‘కేటు’తో మామిడి రైతుకు దెబ్బ
ABN, Publish Date - Jun 17 , 2025 | 01:33 AM
మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపారులు, దళారీలు సిండకేట్ కావడంతో తోతాపురికాయలు అమ్ముకోలేక రైతులు అవస్ధలు పడుతున్నారు. గుజ్జుపరిశ్రమలు, ర్యాంపుల్లో టన్ను తోతాపురి రూ.8వేలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది.
ప్రభుత్వ ఆదేశాలూ బేఖాతరు
పాకాల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): మామిడి గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలు, వ్యాపారులు, దళారీలు సిండకేట్ కావడంతో తోతాపురికాయలు అమ్ముకోలేక రైతులు అవస్ధలు పడుతున్నారు. గుజ్జుపరిశ్రమలు, ర్యాంపుల్లో టన్ను తోతాపురి రూ.8వేలకు కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది. టన్ను ఐదారు వేల రూపాయలకు కూడా ఽకొనడం లేదు. గుజ్జు పరిశ్రమల్లో పరిమితంగా కొనుగోలు చేస్తున్నారు. దళారీలు ర్యాంపులవద్ద టన్ను రూ.4వేలకు కూడా కొనడం లేదు. తోటల్లో పక్వానికి వచ్చిన కాయలను ర్యాంపులవద్ద కొనాలని దళారీలను రైతులు బతిమలాడుకుంటున్నారు. ర్యాంపుల్లో తక్కువ ధరకు కొన్న కాయలు గుజ్జు పరిశ్రమలకు టన్ను ఆరేడు వేల రూపాయల వంతున దళారీలు సరఫరా చేస్తున్నారు. ర్యాంపు యాజమాన్యాలు లాభాలు ఆర్జిస్తున్నా రైతులకు కోత కూలీ, రవాణా ఖర్చులు కూడా రావడం లేదు. ఇటీవల కురిసిన వర్షాలకు తోటల్లో తోతాపురి కాయలు ఒక్కసారిగా పక్వానికి వచ్చి రాలిపోతున్నాయి. రసాయనిక ఎరువులు, పురుగుల మందులు, దుక్కి దున్నకాలకు ఎంతో వెచ్చించినా పంట అమ్ముకోలేక రైతులు దిగులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సకాలంలో స్పందించి తోతాపురి కాయల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని రైతుల విజ్ఙప్తి చేస్తున్నారు. ర్యాంపులవద్ద ధరల పట్టిక బోర్డు పెట్టాలని కోరుతున్నారు. తక్కువ విస్తీర్ణంలో సాగుచేసిన సన్నకారు రైతులు రెండు మూడు టన్నులు చొప్పున తీసుకువచ్చి మండీల్లో అమ్ముకుందామన్న ఫలితం లేకుండా పోతోంది. మండీల్లోనే మాగిపోతున్నాయి.
Updated Date - Jun 17 , 2025 | 01:33 AM