సర్దుకుపోదాం.. రండి
ABN, Publish Date - Aug 04 , 2025 | 01:49 AM
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపు కనుమరుగైంది. సమస్యలొస్తే సర్దుబాటు చేసే పెద్దవారు చిన్న కుటుంబాల్లో కనిపించడం లేదు. దీనివల్ల వైవాహిక జీవితంలో అంతరాలు పెరిగిపోతున్నాయి. దంపతులు తమ ఇగోలతో చిన్న చిన్న సమస్యలనే పెద్దవి చేసుకుంటున్నారు. ఈ కారణాలతో పోలీ్‌సస్టేషన్ మెట్లనూ ఎక్కుతున్నారు. ఇటువంటి దంపతులకు, వారి కుటుంబీకులకు సమాజ పోకడ, చట్టాలను తెలియజేసి సమస్యలను పరిష్కరిస్తూ.. కుటుంబ పెద్దగా వ్యవహరిస్తోంది జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్.
కుటుంబ తగాదాలకు పరిష్కారం
వేదికగా ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దాదాపు కనుమరుగైంది. సమస్యలొస్తే సర్దుబాటు చేసే పెద్దవారు చిన్న కుటుంబాల్లో కనిపించడం లేదు. దీనివల్ల వైవాహిక జీవితంలో అంతరాలు పెరిగిపోతున్నాయి. దంపతులు తమ ఇగోలతో చిన్న చిన్న సమస్యలనే పెద్దవి చేసుకుంటున్నారు. ఈ కారణాలతో పోలీ్‌సస్టేషన్ మెట్లనూ ఎక్కుతున్నారు. ఇటువంటి దంపతులకు, వారి కుటుంబీకులకు సమాజ పోకడ, చట్టాలను తెలియజేసి సమస్యలను పరిష్కరిస్తూ.. కుటుంబ పెద్దగా వ్యవహరిస్తోంది జిల్లా కేంద్రమైన చిత్తూరులోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్.
- చిత్తూరు అర్బన్, ఆంధ్రజ్యోతి
కుటుంబంలో ఏర్పడే కలతలతోపాటు మహిళల సమస్యలను పరిష్కరించే వేదికగా మహిళా పోలీ్‌సస్టేషన్ పరిధిలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ పనిచేస్తోంది. ఈ కేంద్రంలో పోలీసులతోపాటు రిటైర్డు ఉద్యోగులు, మానసిక నిపుణులు, స్వచ్ఛంద సేవా సంస్థల నిర్వాహకులు, మహిళా శిశు సంరక్షణ ఉద్యోగులు కలిసి కమిటీగా ఉంటారు. వీరు ప్రతి శనివారం స్టేషన్‌లో బాధితులకు కౌన్సెలింగ్ ఇస్తారు. వీలుకాని పక్షంలోనే కేసులు నమోదు చేస్తారు.
వచ్చే కేసులిలా..
ఇంట్లో మరిదికి, అత్తామామలకు సపర్యలు చేయడం ఇష్టం లేక.. భర్త ఆడబిడ్డలకు డబ్బులిచ్చాడని భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడం, అత్తామామలకు కనీస గౌరవం ఇవ్వడం లేదని కోడలిపై అలక, సంపాదనంతా తన వద్దే ఇవ్వాలని భార్య అలిగి వేరే నెపాన్ని భర్తపైనెట్టి పుట్టింటికి వెళ్లిపోవడం వంటి కేసులే అధికంగా కౌన్సెలింగ్ సెంటర్‌కు వస్తున్నాయి.
గతంలో కేసు నమోదు.. ఇప్పుడు కౌన్సెలింగ్
గతంలో భార్యభర్తల గొడవ, అత్తామామలు ఇలా కుటుంబ సమస్యలతో స్టేషన్‌కు వస్తే పోలీసులు నేరుగా కేసు నమోదు చేసి కోర్టులో పరిష్కరించుకోవాలని సూచించేవారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌లో మాత్రం ఈ విధానానికి పూర్తి విరుద్ధం. ఫిర్యాదు చేసిన వారితోపాటు ఫిర్యాదును ఎదుర్కొంటున్న వారిని సెంటర్‌కు పిలిపిస్తారు. ఇరువర్గాల సమస్యలను విన్న తర్వాత పరిష్కారం చూపుతారు. వారు ఒప్పుకోకుంటే కొంత సమయం ఇస్తారు. ఆ తర్వాత ఇరువర్గాలకు పిలిపించి చట్టం, కుటుంబ వ్యవస్థ, పెద్దలతో వ్యవహరించాల్సిన విధానం, కొన్ని సందర్భాల్లో తప్పు లేకపోయినా సర్దుకుని వెళ్లాల్సిన పరిస్థితులను వివరిస్తారు.
హింస, వేధింపులపై ఆలస్యం చేయకుండా కేసుల నమోదు
భార్యను శారీరంగా హింసించడం, కట్నం కోసం వేధించడం వంటి వాటిపై ఆలస్యం చేయకుండా కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా 181 మందిపై గృహ హింస కేసు పెట్టి, వీరిలో 58 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ఎస్పీ మణికంఠ తెలిపారు. 482 సంఘటనలకు సంబంధించి కౌన్సెలింగ్ సెంటర్‌లో కేసులు నమోదు చేయకుండా సామరస్యంగా పరిష్కార మార్గాలు చూపామన్నారు. జిల్లాకు చెందిన కేసులే కాకుండా పక్క రాష్ర్టాలైన తమిళనాడు, కర్ణాటకకు చెందిన 52 కేసులను పరిష్కరించామని పేర్కొన్నారు. అలాగే విదేశాల్లో ఉండి కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడిన మూడు కుటుంబాలను ఒక్కటి చేసి పంపామని తెలిపారు. మొత్తానికి ఈ సెంటర్ సత్ఫలితాలు ఇస్తోందని చెప్పారు.
కాలేజీ, పాఠశాలల్లో అవగాహన సదస్సులు
కుటుంబాల్లో తలెత్తే సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో విద్యార్థులకు తెలియజేస్తున్నారు. ఏడాది కాలంలో కళాశాలలు, పాఠశాలలు, గ్రామాలు, కాలనీల్లో 748 అవగాహన సదస్సులను నిర్వహించి చిన్న వయస్సులోనే కుటుంబ వ్యవస్థపై అవగాహన కల్పిస్తున్నారు.
Updated Date - Aug 04 , 2025 | 01:49 AM