Petitions: అర్జీల పరిష్కారంలో అలసత్వం
ABN, Publish Date - Feb 21 , 2025 | 01:53 AM
వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వేతో జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. రికార్డుల్లో విస్తీర్ణం తగ్గిపోవడం, హద్దులు మారిపోవడం, రైతుల మధ్య విభేదాలు తలెత్తడం.. వంటివి జరిగాయి. దీన్ని సరిచేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రామ సభల్ని నిర్వహించి మరీ అర్జీలను స్వీకరించింది.అయితే వాటి పరిష్కారంలోనే ఆలస్యం చోటు చేసుకుంటోంది.
చిత్తూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):వైసీపీ ప్రభుత్వ హయాంలో జిల్లాలోని 29 మండలాల్లో 329 గ్రామాల్లో 3.02 లక్షల ఎకరాల్ని రీసర్వే చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార దినానికి కూడా రీసర్వే సమస్యలపైనే అధికంగా ఫిర్యాదులు వచ్చేవి. దీంతో కూటమి ప్రభుత్వం రీసర్వే జరిగిన గ్రామాల్లో ప్రత్యేకంగా గ్రామ సభలు నిర్వహించింది. అధికారులు హాజరై రైతుల నుంచి అర్జీలు తీసుకున్నారు. అక్టోబరు 22 నుంచి నవంబరు 15వ తేదీవరకు 327 గ్రామాల్లో నిర్వహించిన సభల్లో 16,128 అర్జీలు వచ్చాయంటే సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. మూడు నెలలు పూర్తయినా.. 2000 అర్జీలను మాత్రమే పరిష్కరించారంటే యంత్రాంగం అలసత్వం స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో రీసర్వే అర్జీల పరిష్కార శాతాన్ని చూసుకుంటే మన జిల్లా అట్టడుగున 26వ స్థానంలో ఉంది.
కలెక్టరేట్ గ్రీవెన్స్ డేలోనూ అవే ఫిర్యాదులు
ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో జరిగే గ్రీవెన్స్ డే నిర్వహణ దారుణంగా మారింది. రీసర్వే గ్రామ సభల్లో ఇచ్చిన అర్జీలు పరిష్కారం కాకపోవడంతో బాధితులంతా మళ్లీ కలెక్టరేట్‌కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నారు. కలెక్టర్ సుమిత్‌కుమార్‌ను కలిస్తే, ఆయన తహసీల్దార్ వంటి అధికారులకు పరిశీలించమని సిఫారసు చేస్తుంటారు.అక్కడ మాత్రం క్షేత్రస్థాయి అధికారులు కలెక్టర్ నుంచి వెళ్లిన అర్జీలను పట్టించుకోవడం లేదు. ఆయా మండలాల్లో కలెక్టరేట్ గ్రీవెన్స్ నుంచి వెళ్లిన అర్జీలు వందల సంఖ్యలో పెండింగులో ఉంటున్నాయి. ఇలా అన్ని అంశాల్లో కలిపి కలెక్టర్ సిఫారసు చేసిన సుమారు 6వేల అర్జీలు మండలాల్లో పెండింగులో ఉన్నాయి.
ఇకనైనా వేగం పెరిగేనా?
కూటమి ప్రభుత్వం కూడా మండలానికో గ్రామం చొప్పున 31 గ్రామాల్లో ఇటీవల రీసర్వేని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతకుముందే రీసర్వే తహసీల్దార్లను కొనసాగిస్తూ ఉత్తర్వులను ఇచ్చింది. రీసర్వే సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రీసర్వే తహసీల్దార్లను కేవలం ఆ కార్యక్రమానికి మాత్రమే వినియోగించాలని సీసీఎల్‌ఏ ఆ మధ్య స్పష్టం చేసిన విషయం తెలిసిందే. రీసర్వే అర్జీల పరిష్కారంలో జిల్లా వెనుకబడడంతో ఆర్డీవోలు చొరవ తీసుకుని పరిష్కారంలో వేగం పెంచాలని కలెక్టర్ ఇటీవల ఆదేశించారు.
నేటికీ పరిష్కారం కాలేదు
గుడిపాల మండలం డీవీపల్లెలో వీఎన్ అనసూయ పేరుతో 141/1ఏ సర్వే నెంబరులో 1.76 ఎకరాల పొలముండేది. రీసర్వే తర్వాత ఈ భూమి మరో ముగ్గురి పేరుతో ఆన్‌లైన్‌లోకి మారింది. రీసర్వే గ్రామ సభలో దీన్ని పరిష్కరించమని అర్జీ ఇచ్చినా నేటికీ పరిష్కారం కాలేదు. చలానా కట్టి సర్వే చేయిస్తే మళ్లీ 11 సెంట్లు రికార్డుల్లో నమోదవడం లేదని అనసూయ భర్త నాగరాజు యాదవ్ ఆవేదన చెందుతున్నారు.
ఏడాదిగా తిరుగుతున్నా స్పందన లేదు
జీడీనెల్లూరు మండలం చిన్నవేపంజేరి గ్రామానికి చెందిన నీలకంఠారెడ్డికి ఇద్దరు భార్యలు.వసంతమ్మ పేరుతో ఖాతా నెంబరు 558లో మూడెకరాల భూమి ఉంది. అలాగే చిన్నపాపమ్మ పేరుతో 559వ ఖాతాలో రెండెకరాల భూమి ఉంది. ఈ గ్రామంలో రీసర్వే జరిగిన తర్వాత వసంతమ్మ, చిన్నపాపమ్మ పేర్ల మీద ఉండే భూమి ఆన్‌లైన్‌లో చూపించడం లేదు. ఏడాదిగా అధికారుల చుట్టూ తగిన ఆధారాలతో తిరుగుతున్నా స్పందన లేదు. రీసర్వే గ్రామ సభలో అర్జీ ఇచ్చినా ఫలితం లేదు. బ్యాంకు లోన్ కూడా రెన్యువల్ చేయడం లేదంటూ నీలకంఠారెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - Feb 21 , 2025 | 01:53 AM