రాజకీయ లబ్ధి కోసమే జగన్ పర్యటన
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:20 AM
రాజకీయ లబ్ధికోసమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారని, ఆయన పర్యటనతో రైతులకు ఎలాంటి లాభం లేదని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్ అన్నారు.
బంగారుపాళ్యం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): రాజకీయ లబ్ధికోసమే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బంగారుపాళ్యంలో పర్యటిస్తున్నారని, ఆయన పర్యటనతో రైతులకు ఎలాంటి లాభం లేదని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్ అన్నారు. మంగళవారం స్థానిక మార్కెట్ యార్డులో మామిడి మండీ యజమానులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం మామిడి రైతులను ఆదుకునేందుకు అనేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుందని చెప్పారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 6.50 లక్షల మెట్రిక్ టన్నులకు రూ.4 సబ్బిడీని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. గుజ్జు పరిశ్రమల యాజమాన్యాలను ఒప్పించి తోతాపురి మామిడి కాయలను కొనడానికి చర్యలు తీసుకున్నామని వివరించారు. వైసీపీ నాయకులకు చెందిన గుజ్జు పరిశ్రమ యాజమాన్యాలు టన్ను తోతాపురి ఏ ధరకు కొన్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ నాయకులను ఉద్దేశపూర్వకంగానే వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారని మండిపడ్డారు. మామిడి రైతులను ఆదుకోవడం చేతకాకే తమపై తప్పుడు ప్రచారాలు సాగిస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటన అంతా ఓ డ్రామా అని.. దాన్ని తిప్పికొట్టాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎన్పీ ధరణీప్రసాద్, ఏఎంసీ చైర్మన్ భాస్కర్ నాయుడు, జనార్దన్‌గౌడ్, బీసీ రవీంద్రనాయుడు, లోకనాథనాయుడు, బాబురెడ్డి, సూరినాయుడు తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు
- పోలీసుల హెచ్చరిక
చిత్తూరు అర్బన్/ఐరాల/నిండ్ర, జూలై 8 (ఆంధ్రజ్యోతి): నిబంధనలను అతిక్రమించి మాజీ సీఎం జగన్ పర్యటనకు జనాలను తరలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సాయినాథ్, ఐరాల ఎస్‌ఐ నరసింహులు, నగరి రూరల్ సీఐ భాస్కర్ వేర్వేరు ప్రకటనల్లో హెచ్చరించారు. ఇప్పటికే వైసీపీ నాయకులకు నోటీసులు అందజేయడం జరిగిందన్నారు.
Updated Date - Jul 09 , 2025 | 01:20 AM